ఫుడ్ బ్లాగర్ అనుకుంటున్నారా? ఇది పూర్తిగా AI క్రియేషన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఒక ఫుడ్ బ్లాగర్ చెన్నై వీధుల్లోని స్ట్రీట్ ఫుడ్ తిని, దాని గురించి రివ్యూ ఇస్తున్నట్లు ఉంటుంది.
By: Tupaki Desk | 7 Jun 2025 3:48 PM ISTఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఒక ఫుడ్ బ్లాగర్ చెన్నై వీధుల్లోని స్ట్రీట్ ఫుడ్ తిని, దాని గురించి రివ్యూ ఇస్తున్నట్లు ఉంటుంది. కానీ, ఈ వీడియో చూసి మీరు అది నిజమైన ఫుడ్ బ్లాగర్ అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు.. ఎందుకంటే, ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్రియేట్ చేసిన వీడియో. గూగుల్ ఇటీవల విడుదల చేసిన 'వీయ 3' (Veo 3) అనే AI మోడల్ ద్వారా ఈ అద్భుతమైన విజువల్స్‌ను తయారుచేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇక కంటెంట్ క్రియేషన్‌కు ఆర్టిస్టులు అవసరం లేదని, అంతా AI చేసేలా ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా ఫుడ్ బ్లాగర్‌లు స్వయంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి, అక్కడి స్థానిక వంటకాలను రుచి చూసి, వాటి గురించి తమ అభిప్రాయాలను వీడియోల రూపంలో పంచుకుంటారు. కానీ, 'వీయ 3' క్రియేట్ చేసిన ఈ వీడియోలో చెన్నైలోని ఒక కాలనీలో ఫుడ్ బ్లాగర్ స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తూ దాని గురించి మాట్లాడుతున్న దృశ్యాలు అచ్చం నిజంగా జరిగినట్లే ఉన్నాయి. తన ముఖ కవళికలు, ఆహారాన్ని పట్టుకునే విధానం అన్నీ చాలా న్యాచురల్ గా కనిపిస్తున్నాయి.
ఈ వీడియోలో కనిపించే ఆహారం, నేపథ్యం, వ్యక్తులు అన్నీ AI క్రియేషనే. దీనితో కంటెంట్ క్రియేషన్‌లో AI ఎంత దూరం వెళ్లిందో స్పష్టంగా అర్థమవుతోంది. వీడియో క్వాలిటీ, దానిలో సహజత్వం చూస్తే ఇది ఒక రియల్ ఫుడ్ బ్లాగర్ చేసిన వీడియో అని ఎవరైనా నమ్ముతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. "ఇది చూస్తుంటే భయంగా ఉంది, ఇక మానవులకు ఉద్యోగాలు ఉండవా?" అని కొందరు ప్రశ్నిస్తుంటే, "AIతో క్రియేటివిటీ రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది" అని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ మాట్లాడుతూ, "ఇప్పుడు AI ఫుడ్ రివ్యూలు కూడా చేస్తుందంటే, భవిష్యత్తులో ఏదైనా సాధ్యమే" అని అన్నారు. ఇంకొకరు, "కంటెంట్ క్రియేషన్‌లో ఇది ఒక గేమ్ ఛేంజర్. ఆర్టిస్టులు ఇక తమ నైపుణ్యాలను AIతో కలిసి ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి" అని సూచించారు.
