Begin typing your search above and press return to search.

ఏఐకే పాఠాలు నేర్పే ఉద్యోగాలు.. ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్న యువత..

ముఖ్యంగా లింక్డ్‌ఇన్ (Linked In) వంటి దిగ్గజ సంస్థలు ఏఐ ట్రైనర్ల కోసం గంటకు వేల రూపాయలు ఆఫర్ చేస్తుండడం చూస్తుంటే, టెక్ ప్రపంచం ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   15 April 2026 3:00 PM IST
ఏఐకే పాఠాలు నేర్పే ఉద్యోగాలు.. ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్న యువత..
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనగానే ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయో అని అందరూ భయపడుతున్న తరుణంలో, అదే ఏఐ కొత్త రకమైన ‘హై-పెయిడ్’ ఉద్యోగాలను సృష్టిస్తుండడం ఒక ఆశాజనకమైన పరిణామం. ముఖ్యంగా లింక్డ్‌ఇన్ (Linked In) వంటి దిగ్గజ సంస్థలు ఏఐ ట్రైనర్ల కోసం గంటకు వేల రూపాయలు ఆఫర్ చేస్తుండడం చూస్తుంటే, టెక్ ప్రపంచం ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు.

గంటకు ₹14 వేల వేతనంతో ‘ఏఐ ట్రైనర్’ కొలువులు!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మొదలుకొని కంటెంట్ రైటర్ల వరకు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ‘ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా?’. అయితే, టెక్ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే.. ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసివేయదు, కానీ ఆ ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తుంది. దీనికి తాజా నిదర్శనమే లింక్డ్‌ఇన్ ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్’. ఇక్కడ ఏఐకి పాఠాలు నేర్పే నిపుణుల కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి.

ఏమిటీ ‘ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్’?

లింక్డ్‌ఇన్ సంస్థ ప్రస్తుతం ఒక కొత్త ప్లాట్‌ఫారమ్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా వివిధ రంగాల్లో నిపుణులు ఫ్రీలాన్స్ ప్రాతిపదికన ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రాథమిక స్థాయి నుంచి నిపుణుల వరకు స్కిల్‌ను బట్టి గంటకు కనీసం ₹3,700 నుంచి గరిష్టంగా ₹14,000 వరకు చెల్లించనున్నట్లు లిస్టింగ్స్ వెల్లడిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి రోజుకు 4 గంటలు పనిచేసినా, నెలకు లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది.

ఏఐకి ట్రైనర్ అవసరమా..?

చాలా మందికి ఏఐ అంటే కేవలం ఒక సాఫ్ట్‌వేర్ అని మాత్రమే తెలుసు. కానీ దానికి సరైన సమాచారం అందించడం, అది ఇచ్చే సమాధానాల్లోని తప్పులను సరిదిద్దడం మనుషులు చేయాల్సిన పని. ఒక ఏఐ టూల్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడు, అది ఎంతవరకు వాస్తవంగా ఉంది? అందులో ఏమైనా పక్షపాతం ఉందా? అనేది నిపుణులు తనిఖీ చేస్తారు. ఏఐ ఇచ్చే స్పందనలకు నిపుణులు రేటింగ్ ఇస్తారు. ఏ సమాధానం బాగుంది..? ఏది మార్చాలి అని సూచిస్తారు. దీనినే ‘రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్’ (RLHF) అంటారు. ఏఐని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించి, అది ఎక్కడ విఫలమవుతుందో గుర్తించడం కూడా ఈ ఉద్యోగంలో భాగమే. తద్వారా ఏఐ మరింత సురక్షితంగా మారుతుంది.

ఎవరికి ఈ ఉద్యోగాలు దక్కుతాయి?

ఇక్కడ కేవలం కోడింగ్ తెలిసిన వారికే కాదు.., ప్రతి రంగానికి చెందిన నిపుణులకు డిమాండ్ ఉంది. రచయితలు, భాషా పండితులు ఏఐ భాషా శైలిని మెరుగుపరచడానికి ఉపయోగపడతారు. వైద్య, న్యాయపరమైన సలహాల్లో ఏఐ తప్పులు చేయకుండా ఉండేందుకు వైద్యులు, న్యాయ విశ్లేషకులు కావాల్సి ఉంటుంది. ఏఐ ప్రోగ్రామింగ్ కోడ్‌ను వెరిఫై చేయడానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ కావాల్సి ఉంటుంది.

మార్కెట్ ముఖచిత్రం మారుతుందా..?

గతంలో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ ఇప్పుడు ‘డేటా లేబ్లింగ్’, ‘ఏఐ ట్యూటరింగ్’ వైపు మళ్లుతోంది. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వంటి సంస్థలు ఇప్పటికే వేల సంఖ్యలో నిపుణులను ఈ పనుల కోసం నియమించుకుంటున్నాయి. లింక్డ్‌ఇన్ రంగంలోకి దిగడంతో సామాన్య నిపుణులకు కూడా ఈ ‘హై-పెయిడ్’ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఏఐ ఒక అద్భుతమైన పనిముట్టు. దానిని ఎలా వాడాలి..? దానికి ఎలా శిక్షణ ఇవ్వాలి? అనేది నేర్చుకున్న వారికి భవిష్యత్తులో తిరుగు ఉండదు. గంటకు ₹14 వేల వేతనం అంటే అది కేవలం సంఖ్య మాత్రమే కాదు, అది నైపుణ్యానికి దక్కుతున్న విలువ. టెక్నాలజీతో పోటీ పడడం కంటే, దానిని మనకు అనుకూలంగా మార్చుకోవడమే అసలైన తెలివితేటలు.