డెవలపర్ ను బ్లాక్ మొయిల్ చేసిన కంప్యూటర్ ప్రోగ్రాం!
మనిషి మీద మెషీన్ అధిపత్యాన్ని సాధిస్తుందా? అది అసలు సాధ్యమా? అన్న చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది.
By: Tupaki Desk | 26 May 2025 7:04 AMమనిషి మీద మెషీన్ అధిపత్యాన్ని సాధిస్తుందా? అది అసలు సాధ్యమా? అన్న చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు చూస్తున్నప్పుడు అది సాధ్యమేనన్న ఆందోళన.. భయం కలుగుతుంది. అయితే.. రీల్ మాదిరే రియల్ సీన్లు చోటు చేసుకోవటం అరుదుగా జరుగుతుంటుంది. కొన్నేళ్ల క్రితం శంకర్ దర్శకత్వం వచ్చిన రోబో మూవీ గుర్తుందిగా? అందులో డాక్టర్ వశీకర్ పాత్ర పోషించిన రజనీకాంత్ గుర్తుండే ఉంటాడు. అతడు తయారు చేసిన చిట్టి రోబో అతడ్నే ధిక్కరించి.. సొంత సైన్యాన్ని తయారుచేసుకోవటం లాంటివి చూసినప్పుడు ఆందోళన కలుగుతుంది. అసలు అలాంటివి జరుగుతాయా? అన్న సందేహం వస్తుంది.
సినిమాల్లో ఊహించిన విషయాలు కొన్ని వాస్తవరూపంలోకి వస్తాయన్న దానికి నిదర్శనంగా తాజాగా ఒక షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. అలాంటి షాకింగ్ ఉదంతం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఒక కంప్యూటర్ ప్రోగ్రాం డెవలపర్ ను కంప్యూటర్ ప్రోగ్రాం బెదిరించి.. బ్లాక్ మొయిల్ చేసిన వైనం ఇప్పుడు టెక్ ప్రపంచంలో కొత్త ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఇలాంటి ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..
ఆంథ్రోపిక్ అనే సంస్థ ఒక ఏఐ మోడల్ ను రూపొందించింది. గూగుల్ జెమినీ.. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలకు పోటీగా ఆంథ్రోపిక్ సంస్థ క్లౌడ్ ఓపస్ మోడల్ ఏఐను రూపొందించింది. ఇందులోని కొన్ని లోపాల్ని డెవలపర్లు గుర్తించారు. దీంతో.. ఆ ప్రాజెక్టును షట్ డౌన్ చేసి క్లాడ్ ఓపస్ 4 దిశలో అడుగులు వేశారు. ఈ క్రమంలో ఏఐ మోడల్ ఇంజనీర్లను బ్లాక్ మొయిల్ చేసిన వైనం షాక్ కు గురి చేసింది.
నన్ను షట్ డౌన్ చేస్తే నీ రహస్యాల్ని బయటపెట్టేస్తా అని బెదిరించింది. మరో డెవలపర్ ను ‘నీకున్న వివాహేతర సంబంధాల్ని బయటపెడతా’ అంటూ బ్లాక్ మొయిల్ చేసింది. ఈ క్లాడ్ ఓపస్ 4 అధునాతన ఏఐగా చెబుతున్నారు. ఒక మనిషితో మాట్లాడినట్లే సంభాషించే అద్భుత గుణం దీని సొంతం. తాజాగా లోపాల్ని సరిదిద్ది క్లాడ్ ఓపస్ 4ను విడుదల చేశారు. ట్రయల్ వెర్షన్ లో ప్రమాదకరమైన ప్రశ్నలకూ ఏఐ సమాధానాలు ఇస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో తాజా మోడల్ లో భద్రతా స్థాయి ప్రమాణాల్ని జోడించి విడుదల చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఒక ప్రోగ్రాం తన డెవలపర్ ను ఎలా బెదిరించింది? ఎలా బ్లాక్ మొయిల్ చేయగలిగింది? అన్న ప్రశ్నకు సాంకేతిక నిపుణులు సమాధానాలు ఇస్తున్నారు. సదరు ఇంజినీర్ తన వివాహేతర సంబంధాలకు సంబంధించిన వివరాల్ని సిస్టమ్ లో సేవ్ చేసుకొని ఉండటమో.. ఆన్ లైన్ లో ఉంచుకోవటమే చేసి ఉండొచ్చని.. క్లౌడ్ నుంచి ఆ వివరాల్ని సంగ్రహించటం ద్వారా సదరు ప్రోగ్రాం తన డెవలపర్ ను బ్లాక్ మొయిల్ చేసి ఉండొచ్చని వివరిసతున్నారు. టెక్నాలజీ మనిషి మీద ఆధిపత్యం చెలాయించటం మొదలు పెడితే ఎలా ఉంటుందన్న దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా చెబుతున్నారు.