Begin typing your search above and press return to search.

గంటా ముందు భారీ సవాల్...భీమిలీ అందేనా ?

అలాగే ప్రతీ ఎన్నికకూ పార్టీ మారడం కూడా ఆయన పొలిటికల్ సెంటిమెంట్ గా ఉంది.

By:  Tupaki Desk   |   22 April 2024 7:30 AM GMT
గంటా ముందు భారీ సవాల్...భీమిలీ అందేనా ?
X

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి రెండవసారి పోటీ చేస్తున్నారు. గంటా పొలిటికల్ ఫిలాసఫీకి ఇది పూర్తిగా భిన్నం. ఆయన తన మొత్తం రాజకీయ జీవితంలో పోటీ చేసిన చోట చేయకుండా గెలిచారు. అలాగే ప్రతీ ఎన్నికకూ పార్టీ మారడం కూడా ఆయన పొలిటికల్ సెంటిమెంట్ గా ఉంది. అయితే 2019లో దానికి కొంత బ్రేక్ ఇచ్చారు.

తాను పార్టీ మారకుండా టీడీపీలో కంటిన్యూ అవుతూనే ఆయన విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేశారు. అయితే ఆ యాంటీ సెంటిమెంట్ మహిమో ఏమో తెలియదు కానీ ఎపుడూ భారీ మెజారిటీలతో గెలిచే గంటా విశాఖ ఉత్తరంలో మాత్రం ఇబ్బంది పడుతూనే తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. నిజానికి 2019 ఎన్నికలకు ముందు గంటా వైసీపీలో చేరాల్సి ఉంది. కానీ అప్పటికే ఆయన శిష్యుడు అవంతి వైసీపీలో చేరిపోవడంతో గంటాకు బ్రేక్ పడింది.

ఇదిలా ఉంటే 2024 ఎన్నికల నాటికి గంటా మరో సెంటిమెంట్ ని కూడా పక్కన పెట్టేశారు. అదేంటి అంటే పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేయడం. గంటా 2014లో భీమిలి నుంచి పోటీ చేశారు. మళ్లీ ఇపుడు చేస్తున్నారు. దాంతోనే ఆయనకు అసలైన సవాల్ ఎదురవుతోంది అని అంటున్నారు.

గంటా ఎన్నికల వరకే జనానికి కనిపిస్తారు అని గెలిస్తే మాత్రం ఆయన పత్తా ఉండరని అంటారు. ఆయన క్యాంప్ ఆఫీసు ఒకటి ఏర్పాటు చేసి అక్కడ తన తరఫున ఒక ఇంచార్జిని పెడతారు. అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా తన పీఏలను పీఎస్ లని మాత్రమే ఉంచుతారు. తాను మాత్రం కనిపించరు అని విమర్శలు ఉన్నాయి. ఆయన విశాఖలో ఉంటారు, ఆయన్ని కలవాలీ అంటే గంటల కొద్దీ వెయిట్ చేసినా పార్టీ నేతలకే దర్శనం దొరకదని ప్రజలకు ఆ బాధలు మళ్లీ కావాలా అని అవంతి శ్రీనివాసరావు ప్రతీ మీటింగ్ లో గంటా మీద విమర్శలు చేస్తున్నారు.

ఇవన్నీ గతంలో చాలా మందికి అనుభవాలుగా ఉండడంతో అవంతి మాటలను వారు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. దాంతో తాను జనాలకు అందుబాటులో ఉంటాను అని జనాలకు గంటా చెప్పుకోవాల్సి వస్తోంది. అయితే ఆయన విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి గెలిచినా అయిదేళ్ళ పాటు ఆ నియోజకవర్గానికి ముఖం చూపించలేదు అన్న విమర్శలు ఉన్నాయి. వాటిని కూడా వైసీపీ భీమిలీ ప్రచారంలో ఎక్కుపెడుతోంది.

గంటా లాంటి వారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చి జనాలకు కనిపించకుండా చేసుకుంటారా లేక అందరికీ అందుబాటులో ఉండే అవంతి లాంటి వారిని గెలిపించుకుంటారా అన్న ప్రశ్నలు వేస్తున్నారు. జనాల్లోకి ఇవి బాగా వెళ్లడంతో గంటా ఇబ్బందులో పడుతున్నారని అంటున్నారు. తన ప్రతినిధులను కాకుండా తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను అని గంటా చెప్పాల్సి వస్తోంది.

అదే విధంగా ఆయన తాను అయిదేళ్ళూ ప్రజల మధ్యేన ఉంటూ వారి సమయలు తీరుస్తాను అని కూడా హామీలు ఇవ్వాల్సి వస్తోంది. అయితే జనాలు చాలా నిశితంగా ఆలోచిస్తారు. వారు కోరుకునేది ముందు తన ఎమ్మెల్యే అదుబాటులో ఉండడం, సమస్యలు తీర్చడం అన్నది తరువాత విషయం. దాని వల్లనే ప్రజా తీర్పులో కూడా తేడాలు వస్తాయని అంటున్నారు.

ఇప్పటికైతే గంటా వైసీపీలోని అసంతృప్తులను ఆకట్టుకుంటున్నారు. వారిని తన వెంట తిప్పుకుంటున్నారు కానీ మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలీ నియోజకవర్గంలో గెలుపు అన్నది గంటాకు ఈసారి గట్టి సవాల్ గానే మారుతుందని అంటున్నారు. అవంతిని లైట్ తీసుకుంటే డేంజరే అంటున్నారు. అయితే రాజకీయ వ్యూహాలలో గంటా చాతుర్యం అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఏదో విధంగా అంతా సానుకూలం చేసుకుంటారు అని అంటున్నారు.