పాక్, ఇజ్రాయెల్ ఒక్కటే.. దాడిపై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహ జ్వాల
కాబూల్ లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన దాడిని అఫ్ఘాన్ క్రికెటర్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
By: Tupaki Political Desk | 17 March 2026 2:51 PM ISTపవిత్ర రంజాన్ మాసం.. మరొక్క రెండు రోజులైతే పండుగ.. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన సమయంలో అఫ్ఘాన్ ఆస్పత్రిపై దాడికి దిగింది పాకిస్థాన్. ఆ దేశ సైనిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా తాము దాడి చేసినట్లు చెబుతున్నా... పాక్ ది అత్యంత దారుణ చర్య అంటూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ సైతం ఈ విషయమై స్పందించింది. పాక్ ది పిరికిపంద చర్య అంటూ విమర్శించింది. ఇదే సమయంలో అఫ్ఘానిస్థాన్ క్రికెటర్లు తమ ఆవేదన, ఆగ్రహాన్ని బయటపెట్టారు. పొరుగు దేశమైన పాకిస్థాన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎదుగుతున్న అఫ్ఘాన్.. పలు టోర్నీల్లో మంచి ప్రదర్శన చేస్తోంది. కొన్నిసార్లు పాకిస్థాన్ కంటే తామే మెరుగని కూడా చాటుతోంది. మరోవైపు పాక్ జట్టు ప్రదర్శన పడిపోతోంది. తాజాగా బంగ్లాదేశ్ వంటి జట్టు చేతిలోనూ వన్డే సిరీస్ లో ఓడిపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్న పాకిస్థాన్ కంటే ఉగ్రవాద ముద్ర ఉన్న తాలిబన్ల పాలనలోని అఫ్ఘానిస్థాన్ కే ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి.
ఆ తల్లుల ఆవేదనకు ఏం సమాధానం చెబుతారు?
కాబూల్ లోని ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన దాడిని అఫ్ఘాన్ క్రికెటర్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, మాజీ కెప్టెన్ మొహమ్మద్ నబీ, ఇబ్రహీం జద్రాన్, నవీనుల్ హక్ వంటి ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎంతోమంది తల్లులు తమ బిడ్డల కోసం ఆస్పత్రి బయట ఎదురుచూస్తున్నారని.. వారి ఆశలు ఆవిరయ్యాయని, దీనికి ఏం సమాధానం చెబుతారన్నంటూ నబీ ప్రశ్నించాడు. ఏ విధంగా చేసినా ఇదే మాత్రం సరికాదు అని ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ చట్టాలను దారుణంగా ఉల్లంఘించిందంటూ పాక్ పై మండిపడ్డాడు.
ఇజ్రాయెల్ లాంటిదే పాక్..
నవీనుల్ హక్ అయితే మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ను ఇజ్రాయెల్ తో పోల్చాడు. ముస్లిం సమాజం ఆగర్భ శత్రువుగా భావించే ఇజ్రాయెల్ ను పాకిస్థాన్ ను ఒకే గాటన కట్టడం అంటే అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి తేడా లేదని నవీనుల్ నిప్పులు చెరిగాడు.
కాబూల్ కన్నీరు పెడుతోంది..
పాకిస్థాన్ దాడితో కాబూల్ కన్నీరు పెడుతోందని అఫ్ఘాన్ క్రికెటర్లు పోస్టులు పెట్టారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన వారు.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇళ్లు, స్కూళ్లు, ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరం అంటూ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్రంగా స్పందించాడు. పవిత్ర రంజాన్ మాసంలో సాటి మనుషుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం అని అన్నాడు. ఐక్యరాజ్య సమితి, మావన హక్కుల సంఘాలు స్పందించాలని కోరాడు. ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగినా ధైర్యాన్ని కోల్పోమని, కోలుకుని తిరిగి నిలబడగామని రషీద్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.
