టెన్త్ ఫెయిల్ అయిన కొడుకు ... షాక్ ఇచ్చిన పేరెంట్స్
సాధారణంగా పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు ఏమి చేస్తారో అందరికీ తెలుసు. అంతవరకూ కాదు అనుకున్న ర్యాంక్ రాలేదని ఒక్క మార్క్ తక్కువ వచ్చిందని బిడ్డలను పట్టుకుని ఎంతలా దండిస్తారో కూడా తెలుసు.
By: Tupaki Desk | 5 May 2025 12:30 AMసాధారణంగా పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు ఏమి చేస్తారో అందరికీ తెలుసు. అంతవరకూ కాదు అనుకున్న ర్యాంక్ రాలేదని ఒక్క మార్క్ తక్కువ వచ్చిందని బిడ్డలను పట్టుకుని ఎంతలా దండిస్తారో కూడా తెలుసు. ఈ రోజులలో విద్యా విధానం ఇది. పిల్లాలతో పాటు తల్లిదండ్రులూ పరీక్షకు నిలబడుతున్నారు. తమ బిడ్డలు టాప్ ర్యాంక్ ని సాధిస్తేనే గొప్ప అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు.
ఏ మాత్రం తేడా వచ్చినా వారిని నానా రకాలుగా వేధిస్తున్నారు. ఆ దెబ్బకు ఆ పసి హృదయాలు తట్టుకోలేక అసువులు బాసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం అలా కాదు, తమ బిడ్డ పరీక్ష ఫెయిల్ అయితే పార్టీ ఇచ్చారు. తప్పు జరిగింది రిపీట్ చేయకు, ఈసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అని మోరల్ బూస్టింగ్ ఇచ్చారు.
అంతే కాదు మరో మంచి మాట అన్నారు. పరీక్షల్లోనే ఫెయిల్ అయ్యావు, జీవితంలో మాత్రం ఎప్పటికీ ఫెయిల్ కాకు అని. నిజంగా ఇది ఎంత గొప్ప స్పూర్తిని ఇచ్చే మాట. అందరి తల్లిదండ్రులూ విని ఆచరించాల్సిన మాట కూడా.
జీవితంలో పరీక్షలు ఒక భాగం. ఆ మాటకు వస్తే ప్రతీ ప్రయత్నం కూడా ఒక భాగమే. ఆ సందేశం బిడ్డలకు ఇవ్వాలీ అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత గుండె ధైర్యం ఉండాలి. జీవితం పట్ల వారిలో ముందు ఎంత ఆశావహమైన దృక్పధం ఉండాలి. ఎంత ముందు చూపు మరెంత వివేచన విచక్షణ ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే ఆ తల్లిదండ్రులు ఇపుడు మెయిన్ స్ట్రీం మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
బిడ్డ పరీక్ష తప్పినా వారు మాత్రం టాప్ ర్యాంకులు సాధించిన పేరేంట్స్ కంటే హైలెట్ అవుతున్నారు. ఎందువల్ల అంటే ఈ తరానికి ఈనాటి విద్యా వాతావరణానికి అలాంటి తల్లితండ్రుల అవసరం ఉంది కాబట్టి. విషయానికి వెళ్తే కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి అభిషేక్ పదో తరగతి బోర్డు పరీక్షలలో తప్పాడు. ఏకంగా ఆరు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. మొత్తం 625 మార్కులకు గాను 200 మాత్రమే సాధించాడు. నిజానికి అలా బిడ్డ పరీక్ష తప్పితే తల్లిదండ్రులు అతన్ని ఎందుకూ పనికిరావు అని నిందించి జీవితం మీద విరక్తి పెంచేసి మొగ్గలోనే తనువు చాలించేలా చేస్తారు.
కానీ అభిషేక్ తల్లిదండ్రులు మాత్రం కొడుకుని అసలుజ్ తిట్టలేదు. కొట్టడం అంతకంటే చేయలేదు. పైగా అతన్ని బాగా ప్రోత్సహించారు. ఇంట్లోనే ఒక చిన్న పాటి వేడుకను నిర్వహించారు. అభిషేక్ పేరుతోపాటు అతడు సాధించిన మార్కులతో కూడిన కేక్ కట్ చేయించి అతడికి తినిపించారు. ఆ మీదట అతనికి జీవితంలో ఫెయిల్ కాకు బిడ్డా అని దీవించారు.
మరి ఇలా తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులను చూసి అభిషేక్ నిజంగా తల్లడిల్లిపోయాడు. నేను ఫెయిల్ అయ్యా కానీ నా ఫ్యామిలీ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. ఈసారి తప్పకుండా పాస్ అవుతాను. మంచి మార్కులు సాధిస్తాను అని నిబ్బరంతో కూడిన మాటలు చెప్పాడు.
నిజంగా అభిషేక్ ఇపుడు తాను అన్న మాటను నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ తల్లితండ్రులు అతనిలో నాటిన స్పూర్తి అలాంటిది. ఇది అభిషేక్ కే కాదు ఎందరికో ఆదర్శం కాబట్టే సోషల్ మీడియాలో ఆ వార్త తెగ వైరల్ అవుతోంది. నిజంగా బిడ్డలు అని కాదు ఎవరైనా తన ప్రయత్నంలో ఫెయిల్ అయినందుకు చింతిస్తూ కూర్చుంటే ఫలితం ఉండదు. అంతే కాదు వారు చీకటిని తిట్టి వెనక్కి వెళ్ళినా ప్రయోజనం ఉండదు, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఆ మీదట సాధించాలి. అపుడే ఎవరైనా ఎక్కడైనా విజేతలు అవుతారు.