కాక్రోచ్ పార్టీ నేత భావోద్వేగ ట్వీట్.. రేపు ఢిల్లీకి అభిజిత్ రాక
సోషల్ మీడియా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఢిల్లీకి రానున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2026 6:15 PM ISTసోషల్ మీడియా సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఢిల్లీకి రానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో ఆయన ట్వీట్ చేశారు. ‘ఇండియాకి వస్తున్నా.. నా భవిష్యత్తును రాజ్యాంగం చేతుల్లో పెడుతున్నా’ అన్న రాస్తూ ఢిల్లీలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీడియో రిలీజ్ చేశారు. దేశ విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న లోపాలను నిరసిస్తూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు డిజిటల్ స్క్రీనుకి పరిమితమైన కాక్రోచ్ జనతా పార్టీ తొలిసారిగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. డిజిటల్ మాధ్యమాల్లో కాక్రోచ్ పార్టీకి సుమారు రెండు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య దేశంలోని బలమైన జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువగా కావడం విశేషం. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకులు, విద్యార్థుల డేటా బహిర్గతం కావడం వంటి సమస్యలపై కాక్రోచ్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సోషల్ మీడియాలో వ్యంగ్య మీమ్స్ వదలిని కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు తొలిసారిగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
ఇక 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు ప్లాన్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తాను ఇండియా వస్తున్నట్లు నాలుగు రోజుల క్రితమే ప్రకటించాడు. అంతేకాకుండా ఢిల్లీలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమం విజయవంతం చేయడానికి ముగ్గురు అధికార ప్రతినిధులను నియమించాడు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఆందోళనల్లో పాల్గొంటామని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తోపాటు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో కాక్రోచ్ పార్టీ కార్యక్రమంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు ఒకపక్క ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ రోజు ఉదయం అభిజిత్ మరో ట్వీట్ చేశారు. 6వ తేదీ (శనివారం) ఢిల్లీ విమానాశ్రయంలో దిగుతాను అని, అక్కడి నుంచి నేరుగా పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ కి వెళ్లి శాంతియుత ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు ప్రకటించాడు. దీంతో పోలీసులు అనుమతిస్తారా? లేదా? అన్నదే ఉత్కంఠకు గురిచేస్తోంది. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నుంచి వెనక్కి తగ్గని కాక్రోచ్ పార్టీ ఆందోళనలకు ఎంతమంది వస్తారనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఈ పరిస్థితుల్లో రేపు ఉదయం ఢిల్లీలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠతోపాటు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయని అంటున్నారు.
