టార్గెట్ టీడీపీ.. ‘‘విషయం చాలా దూరం వెళ్తుంది’’ అంటూ ఏబీవీ హెచ్చరిక
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ), టీడీపీ అధిష్టానం మధ్య తెరచాటు యుద్ధం తొలగిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.
By: Tupaki Desk | 30 Jun 2025 12:02 PM ISTరిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ), టీడీపీ అధిష్టానం మధ్య తెరచాటు యుద్ధం తొలగిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. గత ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగ లేదన్న అసంతృప్తితో ఏబీవీ రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో అన్యాయానికి గురైన వారి పక్షాన పోరాటం చేస్తానని స్వయంగా ప్రకటించిన ఏబీవీ.. అందుకు విరుద్ధంగా టీడీపీపై పోరాడాలనే పరిస్థితులు దారితీస్తున్నాయని అంటున్నారు.
టీడీపీ స్పాన్సర్డ్ యూట్యూబ్ చానళ్లలో కొందరు జర్నలిస్టులు తనపై చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తున్న ఏబీవీ.. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు రాశారు. తనపై అవాకులు, చవాకులు మాట్లాడటం ఆపకపోతే... విషయం చాలా దూరం వెళుతుందని ఏబీవీ హెచ్చరించడం చర్చనీయాంశం అవుతోంది.
టీడీపీ సానుభూతిపరుడిగా ముద్రపడి గత ప్రభుత్వంలో ఐదేళ్లు పోస్టింగు లేక, జీతం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ సుదీర్ఘ న్యాయపోరాటంతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 9 నెలల అనంతరం ఆయన సర్వీసు రెగ్యులర్ చేసి జీతభత్యాల బకాయిలను చెల్లించాలని ఆదేశించింది.
అయితే ఇంతవరకు అవి అమలు కాలేదని ఏబీవీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం తన పట్ల అరాకచకంగా వ్యవహరించినా టీడీపీ నుంచి ఆశించిన మద్దతు లభించలేదన్న అసంతృప్తి ఏబీవీలో కనిపిస్తోందని అంటున్నారు. దీంతో జగన్ పై యుద్ధం ప్రకటించిన ఆయన తన టార్గెట్ ను సవరించి అధికార పార్టీపైన ఇటీవల విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఆలోచన పరుల వేదిక సమావేశంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఏబీవీ విమర్శలు గుప్పించారు. ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడమే తప్ప, ఏం లాభం లేదని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజా పోరాటానికి పిలుపునిచ్చారు. దీనిపై టీడీపీ స్పాన్సర్డ్ యూట్యూబ్ చానళ్లలో ఖండన ప్రకటనలు వచ్చాయి. ఇద్దరు జర్నలిస్టులు ఏబీవీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా సుమారు 30 నిమిషాల వీడియో చేశారు. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన ఏబీవీ ఆ ఇద్దరు జర్నలిస్టులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా టీడీపీపై తన అసంతృప్తికి కారణాలను పరోక్షంగా వెల్లడించారు.
‘‘సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారూ - మీరు, రామబ్రహ్మం గారు చేసిన 30 నిమిషాల వీడియో చాలా నేల బారుగా ఉంది. మీ దగ్గర విషయం లేదని పూర్తిగా బహిర్గతమైంది.
దీనికి సరైన సమాధానం ఒక వీడియో లేదా ఇంటర్వ్యూ ద్వారా వివరంగా త్వరలో చెబుతాను గానీ, నా మీద సుపారీ దాడులకు పాల్పడవద్దని మీలాంటి వారందరికీ నా సలహా. సద్విమర్శలకు ఎప్పుడూ స్వాగతం.’’ అంటూ ఏబీవీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన ఆవేదనను ఆ ట్వీట్ లో వెల్లడించారు. ‘‘గత ఐదేళ్లు జగన్ మోహన్ రెడ్డి అన్యాయపు కక్ష సాధింపుకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశాను. ఐదేళ్ల సర్వీసు పోగొట్టుకున్నాను. పదుల లక్షల రూపాయల ఖర్చైంది. ఏ నాడూ ఎవరి సహాయం కోరలేదు. అయ్యో.. మా వల్ల ఇబ్బందుల్లోకి వచ్చాడే, సహాయం కావాలా అని అడిగిన వారు లేరు.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వంపై CAT, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడానని గుర్తు చేశారు. చివరికి ఆధారాలు లేని పరమ చెత్త కేసని హై కోర్టు తనపై నమోదుచేసిన FIRని కొట్టేసిందని, అంత చెత్త కేసు విషయంలో సమాంతరంగా సాగిన శాఖా పరమైన విచారణ మూసెయ్యడానికి మంచి ప్రభుత్వానికి 9 నెలల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదీ చెప్పులరిగేదాకా తిరిగితేనే చంద్రబాబు ప్రభుత్వం తనపై ఎఫ్ఐఆర్ కొట్టివేసిందని చురకలు అంటించారు. తన విషయంలో చెప్పులు అరిగేలా తిరిగితేనే పనిచేశారన్న ఆవేదన ఏబీవీలో కనిపిస్తోందని ఆ ట్వీట్లో ఏబీవీ అసహనం వ్యక్తం చేశారు.
ఇక తనకు రావాల్సిన జీత భత్యాల బకాయిలు సగం మేర ఇంకా రాలేదని, పెన్షన్ సెటిల్ కాలేదని, వాటి కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నానని ఏబీవీ వాపోయారు. టీడీపీ ఆఫీసు నుంచి నడిపే మీ ఛానెల్లో నేను ఏదో ఆశించి, భంగపడి, ఇదంతా చేస్తున్నానని అవాకులు చెవాకులు పేలతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అనే భూతాన్నుంచి నా రాష్ట్రాన్ని రక్షించుకోవడమనే పని తప్ప నేనేమన్నా గనులు అడిగానా, మణులు అడిగానా? ఇది కాక మీకేమన్నా తెలిస్తే బహిరంగంగా చెప్పండి. అంతేకానీ ఆ తప్పుడు సంజ్ఞలు, నిగూఢార్థపు మాటలు ఎందుకు? బనకచర్ల కానీ ఇంకొక సబ్జెక్ట్ మీద కానీ చర్చకు ఎప్పుడూ సిద్ధమే. అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే విషయం చాలా దూరం వెళ్తుంది. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మిమ్మల్ని పురమాయించిన వాళ్లకు కూడా చెప్పండి అంటూ ఏబీవీ తీవ్ర హెచ్చరికలు పంపారు.
టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా సన్నిహితుడైన ఏబీవీ ఆవేదనపై టీడీపీ శ్రేణుల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. తమ కోసం పోరాడిన వ్యక్తికి న్యాయం చేయలేదన్న ఆవేదన కనిపిస్తోందని అంటున్నారు. అయితే టీడీపీ అనుబంధ యూట్యూబ్ చానళ్లలో ఏబీవీ పట్ల వ్యతిరేక కథనాలు రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకోని ఏబీవీపై విమర్శలు చేయడం మానుకోవాలని కేడర్ నుంచి సూచనలు వెళుతున్నాయి. అయితే ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందో లేదో కానీ, గ్యాప్ మాత్రం రోజురోజుకు పెరిగపోయే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
