Begin typing your search above and press return to search.

ఫుల్ ఫైర్ లో ఏబీవీ.. చంద్రబాబుపై విమర్శలకు అస్సలు తగ్గని రిటైర్డ్ డీజీ!

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Sept 2026 4:00 PM IST
ఫుల్ ఫైర్ లో ఏబీవీ.. చంద్రబాబుపై విమర్శలకు అస్సలు తగ్గని రిటైర్డ్ డీజీ!
X

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నాయి. ఒకప్పుడు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఏబీవీ, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతుండటమే సంచలనంగా మారుతోంది. గత ఎన్నికలకు ముందు ఉద్యోగ విరమణ చేసిన ఏబీవీ కూటమి ప్రభుత్వంలో పోలిస్ హౌసింగ్ బోర్డు చైర్మనుగా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆ పదవిని తీసుకోని ఆయన సొంతంగా పార్టీ పెడతానని ప్రకటించారు. ఈ దిశగా అడుగులు వేస్తున్న ఏబీవీ ప్రతిరోజు కూటమి ప్రభుత్వం పాలన విధానాలను ఎండగట్టేలా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు చర్చకు దారితీస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక అజెండాతో పనిచేస్తున్న ఏబీవీ ప్రతి రోజూ ఏదో ఒక అంశాన్ని ఎత్తిచూపడం ద్వారా విమర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న 22A భూ సమస్యలపై ఏబీవీ మరికొందరు మేథావులతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ రైతులను చైతన్యం చేయడంతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ సమస్యపై చొరవ తీసుకోవాల్సిన విపక్షం చేష్టలుడిగినట్లు చూస్తున్నా, ఏబీవీ ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తూ ప్రభుత్వంలో కదలిక తీసుకువస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో ఇతర సమస్యలను ఏబీవీ వెలికి తీస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వరుసగా ఎత్తిచూపుతున్నారు. ఇటీవల కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసు, రాజమండ్రి మెడికో హత్య కేసు విషయంలో ఏబీవీ లేవనెత్తిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేశాయని అంటున్నారు. ఇక తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా చేసిన మరో పోస్టు కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని కల్పించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఒక పోస్టుతో రిటైర్డ్ డీజీ ఏబీవీ ఆత్మరక్షణలోకి నెట్టేశారని అంటున్నారు. గత నెల 31న మార్కాపురం జిల్లాలో ప్రారంభించిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతోపాటు బుధవారం (సెప్టెంబరు 2) పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేసే సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలను విమర్శనాస్త్రంగా మార్చుకున్న ఏబీవీ ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలోకి నెట్టారని అంటున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసే సమయంలో ప్రోటోకాల్ పాటించాల్సివుంటుంది. సాగునీటి ప్రాజెక్టు ప్రారంభంలో ఆ శాఖ మంత్రి పేరు, ఫొటోలను కూడా పత్రికా ప్రకటనల్లో చేర్చాల్సివుంటుందని అంటున్నారు. కానీ, వెలిగొండ, పోలవరం జలాల విడుదల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటో లేకుండా ప్రకటనలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఏబీవీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

సోషల్ మీడియాలో ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ మాత్రమే ప్రభుత్వాన్ని నడపొచ్చుకదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నారా? అంటూ దెప్పిపొడవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా టార్గెట్ చేశారని అంటున్నారు. మీరు ముగ్గురే ప్రభుత్వంలో ఉన్నారా? మిగిలిన వారిని అవమానిస్తారా? అనే విధంగా ఏబీవీ విమర్శలు సంధించడం, దీనికి సాక్ష్యంగా పత్రికా ప్రకటనలను కూడా జత చేయడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లే అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో రాష్ట్రంలో మిగిలిన నేతలు, పార్టీలకు భిన్నంగా ఏబీవీ నడుచుకోవడమే హాట్ టాపిక్ అవుతోంది.