అమ్మో.. ఎమ్మెల్యేలు.. ప్రజల నాడి చూశారా ..!
ఎమ్మెల్యే పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు.
By: Tupaki Desk | 22 Jun 2025 8:00 AM ISTఎమ్మెల్యే పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. మీ పని తీరు మారాలి, ప్రజల్లో ఉండాలి, అక్రమాలు అన్యాయాలు జోలికి అసలు పోవద్దు. అని ఆయన చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు మారినట్టు కనిపించడం లేదు. చంద్రబాబు చెప్పినప్పుడు తలాడిస్తున్న ఎమ్మెల్యేలు మళ్ళీ గడప దాటి బయటికి వచ్చిన తర్వాత తమ తమ దారుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇది ఎంతగా రిఫ్లెక్ట్ అయిందంటే ఏడాది తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 64 శాతం మంది ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతోను వ్యతిరేకతతోను ఉండడం.
ఇదేమి చిన్న విషయం కాదు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అంటే అది ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితికి వచ్చిన విషయాన్ని మనం 2019లోను 2024 లోను కూడా చూసాం. 2019లో చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తాను మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మారుస్తానని ప్రజలకు వంగి వంగి దండాలు పెట్టారు. అయినా ప్రజలు పట్టించుకోలేదు. దీనికి కారణం ఎమ్మెల్యేల పనితీరు బాగోలేక వ్యక్తిగా నాయకుడిగా చంద్రబాబుకు మంచి మార్కులు ఉండొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో నాయకుడిగా ఎమ్మెల్యేకే ప్రజలు ఓట్లు వేస్తారు. కాబట్టి ఎమ్మెల్యే పనితీరు అత్యంత కీలకం.
ఈరకంగా చూసుకున్నప్పుడు గడిచిన ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది తాజాగా వెళ్ళడైన రెండు మూడు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీనిలో టిడిపికి అనుకూలంగా ఉండే వ్యక్తులు చేసిన సర్వేలో కూడా 62 శాతం మంది ప్రజలు ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పనులు చేయడం లేదని, కనీసం తమను పట్టించుకోవడంలేదని, సమస్యలు వినడం లేదని, అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని చెబుతున్న వారు కూడా 72 శాతం మంది ఉన్నారంటే ఎంత దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.
ఎమ్మెల్యేల పనితీరును తక్కువగా అంచనా వేసిన నాయకుడు గాని, పార్టీ కానీ గెలిచిన సందర్భం ఎక్కడా లేదు, తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాల్సివచ్చిన ఎమ్మెల్యేల పనితీరే నిదర్శనంగా మారింది, కాబట్టి ఇప్పటినుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను సరైన మార్గంలో నడిచేలాగా వారికి దిశా నిర్దేశం చేసి అవసరమైతే కఠిన చర్యలు అయినా తీసుకునే విధంగా చర్యలు లేకపోతే 2029 నాటికి ఆయన ఊహించినట్టుగా ఫలితం ఉండే అవకాశం లేకపోవచ్చు,
