Begin typing your search above and press return to search.

ఆ విషయంలో రేవంత్ రెడ్డి టాప్.. 28 మంది సీఎంలలో సగం మందిపై క్రిమినల్ కేసులు!

దేశంలో సగం మంది ముఖ్యమంత్రులు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు సుప్రీంకోర్టు విచారణలో బయటపడింది.

By:  Tupaki Desk   |   18 Aug 2026 4:00 PM IST
ఆ విషయంలో రేవంత్ రెడ్డి టాప్.. 28 మంది సీఎంలలో సగం మందిపై క్రిమినల్ కేసులు!
X

దేశంలో సగం మంది ముఖ్యమంత్రులు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు సుప్రీంకోర్టు విచారణలో బయటపడింది. మొత్తం 28 మంది ముఖ్యమంత్రుల్లో సగం మంది అంటే 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్రమైన కేసులు ఉన్నట్లు తేలింది. ఇందులో అన్నిపార్టీల నేతలు ఉండటమే చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు విచారిస్తుండగా, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన గణాంకాలు సంచలన చర్చకు దారితీశాయి.

ఆందోళన కలిగించే గణాంకాలు

దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో దాదాపు 14 మంది ముఖ్యమంత్రులు తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నట్లు అమికస్ క్యూరీ నివేదిక వెల్లడించింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏకంగా 89 కేసులతో జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. రేవంత్ రెడ్డి తర్వాత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి (29) రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో 19 కేసులతో ఏపీ, కర్ణాకట ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి. కేరళ సీఎం వీడీ సతీశన్ కూడా 18 కేసులను ఎదుర్కొంటున్నారు.

ఎమ్మెల్యేల నేర నేపథ్యం

ఇక కేవలం ముఖ్యమంత్రులకే పరిమితం కాకుండా, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న శాసనసభ్యుల నేర చరిత్ర మరింత దారుణంగా ఉందని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సుమారు 58 శాతం మంది సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా కేరళలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం మంది శాసనసభ్యులు ఏదో ఒక రకమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని నివేదిక బయటపెట్టింది. ఇలా సగం మంది ప్రజాప్రతినిధులు నేర చరిత్రను కలిగి ఉండటం వల్ల చట్ట తయారీ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్లమెంటులోనూ అదే పరిస్థితి

లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రజాప్రతినిధుల నేర చరిత్ర కూడా ఆందోళనకరంగానే ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా 543 మంది లోక్‌సభ సభ్యులలో సుమారు 170 మంది అంటే 31 శాతం నేతలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎంపీలు గణనీయమైన సంఖ్యలో నేరారోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. రాజ్యసభ విషయానికి వస్తే, 233 మంది సభ్యుల్లో 75 మంది నేర చరిత్ర కలిగిన వారు కాగా, అందులో 40 మంది సభ్యులపై ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.

దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై సుమారు 4,192 క్రిమినల్ కేసులు ఏళ్ల తరబడి విచారణ దశలోనే మగ్గుతున్నాయని అంటున్నారు. వీటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 1,171 కేసులతో అత్యధికంగా అగ్రస్థానంలో ఉంది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని, ప్రతి కేసు పురోగతిని ఆయా రాష్ట్రాల హైకోర్టులు పర్యవేక్షించాలని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టును కోరారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణలో జాప్యం జరగడం వల్ల, చట్టం కేవలం సామాన్యులకే పరిమితమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే చట్టసభల్లోని వ్యక్తులు నిష్కళంకంగా ఉండాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ప్రస్తుత గణాంకాలు రాజకీయాల్లో క్రిమినలైజేషన్ ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టం చేస్తోందని చెబుతున్నారు. ఈ నివేదికను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, కఠినమైన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ సంస్కరణలు, ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో నేర చరిత్ర లేని ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.