Begin typing your search above and press return to search.

110 ఏళ్ల వయసులోనూ ఓటు.. చంద్రబాబు ప్రశంసలు అందుకున్న రాఘవమ్మ!

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురానికి చెందిన 110 ఏళ్ల తాటికాయల రాఘవమ్మ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆమెను సీఎం చంద్రబాబు అభినందిస్తూ, ప్రజాస్వామ్యంపై నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విడతలో 75 శాతం పోలింగ్ నమోదైంది.

By:  Tupaki Desk   |   29 Nov 2026 9:20 PM IST
110 ఏళ్ల వయసులోనూ ఓటు.. చంద్రబాబు ప్రశంసలు అందుకున్న రాఘవమ్మ!
X

ఓటు వేయడానికి వయసుతో సంబంధం లేదని కాకినాడ జిల్లాకు చెందిన 110 ఏళ్ల వృద్ధురాలు తాటికాయల రాఘవమ్మ నిరూపించారు. వయసు మీద పడినా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందిన రాఘవమ్మ ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. 110 ఏళ్ల వయసులోనూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. రాఘవమ్మ ఓటు వేసిన తర్వాత తన వేలికి ఉన్న సిరా గుర్తును చూపిస్తున్న ఫొటోను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. ఈ వయసులోనూ ఓటు హక్కును వినియోగించుకున్న ఆమెను అభినందించారు. ప్రజాస్వామ్యంపై ఆమెకు ఉన్న నిబద్ధత యువతకు ఆదర్శమని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఈ విడతలో సుమారు 75 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 3,880 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలు నిర్వహించగా, 3,803 సర్పంచి స్థానాలు, 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది.