ఐటీ రంగంలో ఏఐ ప్రకంపనలు: 2026 తొలి ఐదు నెలల్లోనే 93 వేల మందికి పైగా ఇంటికి!
టెక్ ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) విప్లవం ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతుంటే.. మరోవైపు లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
By: A.N.Kumar | 8 May 2026 1:00 AM ISTటెక్ ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) విప్లవం ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతుంటే.. మరోవైపు లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా దిగ్గజ టెక్ కంపెనీలు కనికరం లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2026 సంవత్సరం ప్రారంభమై కేవలం ఐదు నెలలు గడవకముందే, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ సంఖ్య రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
టెక్ రంగంలోని ఉద్యోగ కోతలను పర్యవేక్షించే Layoffs.fyi తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది (2026) మే నెల నాటికి సుమారు 106 టెక్ కంపెనీలు కలిసి 93,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. గత ఏడాది (2025) మొత్తం మీద జరిగిన తొలగింపులు 1,24,201 కాగా ఈ ఏడాది కేవలం ఐదు నెలల్లోనే ఆ సంఖ్యను చేరువవుతుండటం చూస్తుంటే ఐటీ రంగంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దిగ్గజ కంపెనీల కోత ఇలా..
ఈ లేఆఫ్స్ పర్వంలో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ సంస్థ ఏకంగా 30,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. క్లౌడ్ సేవలు, డేటా మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఏఐ ఆధారిత ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లను ప్రవేశపెట్టడంతో పాత పద్ధతుల్లో పనిచేసే ఉద్యోగుల అవసరం లేదని సంస్థ భావిస్తోంది. మరోవైపు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సుమారు 16,000 మందిని తొలగించింది. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్, డేటా ఎంట్రీ వంటి విభాగాల్లో ఏఐ చాట్‌బాట్‌లు, ఆటోమేటెడ్ టూల్స్ వినియోగం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. వీటితో పాటు డెల్ లో 11,000 మంది ఉద్యోగుల తొలగింపు... మెటాలో 8,000 మంది సిబ్బందికి కోత విధించారు.. మెటా ప్రస్తుతం మెటావర్స్ కంటే ఏఐ ప్రాజెక్టులకే పెద్దపీట వేస్తోంది.. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు భారీ తొలగింపుల కంటే కొత్త నియామకాలను నిలిపివేసి ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి.
ఏఐ వల్ల ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఏవి?
సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం గతంలో మనుషులు చేసే కొన్ని పనులను ఏఐ ఇప్పుడు సెకన్ల వ్యవధిలో పూర్తి చేస్తోంది. దీని ప్రభావం ముఖ్యంగా కింది విభాగాలపై పడుతోంది. సాధారణ కోడింగ్ రాయడం, బగ్‌లను గుర్తించడం వంటి పనులను ఏఐ టూల్స్ సులువుగా చేస్తున్నాయి. భారీ డేటాను విశ్లేషించడం, నివేదికలు తయారు చేయడం ఇప్పుడు ఆటోమేటెడ్ అయిపోయింది. అడ్వాన్స్‌డ్ చాట్‌బాట్‌లు మనుషుల కంటే వేగంగా క్లయింట్ల సందేహాలను తీరుస్తున్నాయి. కంపెనీలు ఇప్పుడు 'తక్కువ మందితో ఎక్కువ పని' అనే సూత్రాన్ని పాటిస్తున్నాయి. నైపుణ్యం లేని సాధారణ ఉద్యోగాల కంటే, ఏఐని నియంత్రించగల నిపుణులకే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
యువతకు నిపుణుల సూచన: రీ-స్కిల్లింగ్ మాత్రమే మార్గం!
ఒకవైపు ఉద్యోగ కోతలు ఆందోళన కలిగిస్తున్నా, మరోవైపు నూతన సాంకేతికతలతో కొత్త అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సంప్రదాయ ఐటీ ఉద్యోగాల కాలం చెల్లిపోయిందని, అప్-స్కిల్లింగ్ చేసుకోకపోతే మనుగడ కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ మరియు రోబోటిక్స్. అలవాటు చేసుకోవాలి. నిరంతరం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త టూల్స్ నేర్చుకోవాలి. ఏఐ చేయలేని 'క్రిటికల్ థింకింగ్', 'క్రియేటివిటీ' వంటి మానసిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం.
మొత్తానికి ఐటీ రంగం ఇప్పుడు ఒక పెద్ద మార్పు దశలో ఉంది. ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడాలంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమను తాము సరికొత్తగా మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
