ఈ ఒక్క ఇంజక్షన్ తో బీపీ మాయం.. మార్కెట్ లోకి ఎప్పుడస్తుందంటే.?
బీపీ (బ్లడ్ ప్రెషర్-రక్తపోటు) కనిపించని శత్రువు. లక్షణాలు కనిపించకుండా మనిషిని మరణించే వరకు తీసుకు వెళ్లే శత్రువు.
By: Tupaki Desk | 5 April 2026 1:00 PM ISTబీపీ (బ్లడ్ ప్రెషర్-రక్తపోటు) కనిపించని శత్రువు. లక్షణాలు కనిపించకుండా మనిషిని మరణించే వరకు తీసుకు వెళ్లే శత్రువు. బీపీ వచ్చిందంటే చాలు ప్రతి రోజు ఒక మాత్ర వేసకోవాల్సిందే. ప్రతి రోజూ మాత్ర వేసుకోవడం, వయసు పెరిగేకొద్దీ మాత్రల సంఖ్య కూడా పెరగడం అనేది మందికి పెద్ద తలనొప్పి. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న ఈ ‘ఏడాదికి రెండు ఇంజక్షన్లు’ వార్త వైద్య రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకబోతోంది. ప్రఖ్యాత వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ ప్రచురించిన పరిశోధనల ప్రకారం.., భవిష్యత్తులో అధిక రక్తపోటు బాధితులు మాత్రలు వేసుకోవడం వల్ల కలిగే విసుగు నుంచి విముక్తి పొందవచ్చు.
బీపీ బాధితుల్లో 25 శాతం మాత్రమే సేఫ్..!
భారతదేశంలో రక్తపోటు సమస్య ఒక నిశ్శబ్ద హంతకిలా మారుతోంది. సుమారు 30% మంది పెద్దలు బీపీతో బాధపడుతున్నారు. ఇందులో 50% మందికి అసలు తమకు ఆ సమస్య ఉన్నట్లు కూడా తెలియదు. వంద మంది బాధితుల్లో కేవలం 25 మందికే మాత్రమే మందులు క్రమం తప్పకుండా వాడుతూ బీపీని నియంత్రణలో ఉంచుకుంటున్నారు. మిగిలిన వారు గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ, తదితర సమస్యల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
'జిలెబెసిరాన్' మ్యాజిక్!
ప్రస్తుతం ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఈ కొత్త మందు, శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై నేరుగా పనిచేస్తుంది. స్మాల్ ఇంటర్‌ఫీరింగ్ ఆర్‌ఎన్‌ఏ (siRNA) ఈ టెక్నాలజీ ద్వారా 'జిలెబెసిరాన్' అనే ఔషధం కాలేయంలో తయారయ్యే ‘ఆంజియోటెన్సినోజెన్’ అనే ప్రోటీన్‌ను తగ్గిస్తుంది. ఒక్క ఇంజిక్షన్ తీసుకుంటే సుమారు 6 నెలల పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఏడాదికి కేవలం 2 డోసులు చాలు. సంప్రదాయ మాత్రలలా కాకుండా.. ఇది రక్తపోటుకు కారణమయ్యే జీవసంబంధిత మార్గాలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది.
మన జీవన శైలే హైబీపీకి కారణం..
మందులు ఒకవైపు ఉన్నా, అసలు బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. మనం తీసుకునే ఆహారం నుంచి దీనికి కట్టడది చేయాలి. అధిక ఉప్పు వినియోగం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం అస్సలు చేయవద్దు. ఎప్పుడూ కూర్చొని పని చేయడం కాకుండా.. అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. ఇక ప్రతి రోజు ఉదయం ఖచ్చితంగా అరగంట నుంచి గంట పాటు వ్యాయామం చేయాలి. ఊబకాయం రాకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం. ఇక వ్యసాలైన ధూమపానం, మద్యంకు దూరంగా ఉండాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఆందోళన, ఒత్తిడిని జయించేందుకు ఆధ్యాత్మికం, వినోదం వైపు దృష్టి సారించాలి.
మాత్రల వాడకంలో ఇబ్బందులతో ఈ ఇంజక్షన్!
ప్రస్తుతం వాడుతున్న ఏసీఈ ఇనిహిబిటర్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రోజువారీ పనుల్లో పడి మాత్ర వేసుకోవడం మర్చిపోతుంటారు. ఒక్కో సమయంలో ఒక్క రోజు మాత్ర వేసుకోకున్నా.. బీపీ పెరిగి అనర్థానికి దారి తీస్తుంది. కాబట్టి ఒక్క సారి వైద్యులు బీపీ మాత్రలు రెగ్యులర్ గా వాడాలని సూచిస్తే వేసుకోవాల్సిందే. ఎక్కువ కాలం, ఎక్కువ సంఖ్యలో మాత్రలు మింగాల్సి రావడం వల్ల రోగుల్లో కలిగే విసుగు కలుగుతుంది. దీనికి తోడు కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ లేకపోలేదు. డాక్టర్లను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల బీపీ అకస్మాత్తుగా పెరిగి ప్రమాదాలకు దారితీయడం.
ఈ చికిత్సా విధానం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది. ఈ ఇంజక్షన్ మార్కెట్లోకి వస్తే, ముఖ్యంగా మందులు సరిగ్గా వాడలేని వారికి ఇది ఒక గొప్ప వరం అవుతుంది. అప్పటి వరకు ఉప్పు తగ్గించి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులను వాడటమే శ్రేయస్కరం.
