ఫుడ్ డెలివరీలోకి రాపిడో.. మార్కెట్ లో కొత్త వార్ షురూ
పక్కా ప్లానింగ్ తో ఎంట్రీలోనే ప్రత్యర్థులకు షాకిచ్చేలా చేసే రాపిడో తాజాగా మరో వాణిజ్య యుద్ధానికి తెర తీసింది.
By: Tupaki Desk | 9 Jun 2025 9:00 PM ISTపక్కా ప్లానింగ్ తో ఎంట్రీలోనే ప్రత్యర్థులకు షాకిచ్చేలా చేసే రాపిడో తాజాగా మరో వాణిజ్య యుద్ధానికి తెర తీసింది. ఇప్పటివరకు బైక్ లు.. ఆటోలు.. క్యాబ్ బుకింగ్ లకు తనదైన ముద్ర వేసిన రాపిడో ఇప్పుడు పుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పటికే ఆ రంగంలో దిగ్గజాలుగా ఉన్న జొమాటో.. స్విగ్గీకి గట్టి పోటీ ఇచ్చేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా.. కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తూనే.. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా.. తమ వ్యాపార ప్రత్యర్థులు రెస్టారెంట్ల నుంచి వసూలు చేసే కమిషన్ ను రాపిడో తగ్గించుకుంది. ఇప్పటివరకు స్విగ్గీ.. జొమాటోలు రెస్టారెంట్ల నుంచి 16-30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుంటే.. రాపిడో మాత్రం కేవలం 8-15 శాతం కమిషన్ మాత్రమే ఛార్జ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు.. ఆర్డర్ వాల్యూను అనుసరించి ఫిక్సెడ్ ఫీ స్ట్రక్చర్ ను కూడా సిద్ధం చేసింది.
దీని ప్రకారం ఆర్డర్ విలువ రూ.400 కంటే తక్కువ ఉంటే రూ.25 ఫీజు చొప్పున వసూలు చేస్తుంది. అదే రూ.400కంటే ఎక్కువ ఆర్డర్ పై మాత్రం రూ.50 ఫీజు వసూలు చేస్తుంది. మొత్తంగా గరిష్ఠంగా 15 శాతం కమిషన్ తీసుకునేలా ప్లాన్ చేసింది. ఓవైపు కస్టమర్లకు తక్కువ ఫీజు వసూలు చేయటం ద్వారా వారిపై భారాన్ని తగ్గించటం.. మరోవైపు రెస్టారెంట్ల నుంచి తక్కువ కమిషన్ వసూలు చేయటం ద్వారా వారికి భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
నిజానికి నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జొమాటో.. స్విగ్గీలపై గుర్రుగా ఉన్నాయి. రెస్టారెంట్ల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ఇలాంటి వేళ.. వారి కోపాన్ని తన అవకాశంగా మార్చుకునేలా రాపిడో ప్లాన్ చేసిందని చెప్పాలి. స్విగ్గీ.. జొమాటో వసూలు చేసే ఎక్కువ కమిషన్ కారణంగా చిన్న రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. రాపిడో కమిషన్ మోడల్ కారణంగా తమకు కాస్తా రిలీఫ్ కలుగుతుందని చెబుతుననారు.
ఫుడ్ డెలివరీలోకి ఎంట్రీ ఇస్తున్నరాపిడో తొలుత తన పైలెట్ ప్రాజెక్టుగా బెంగళూరు నగరాన్ని ఎంచుకుంది. అక్కడ తమకు ఎదురయ్యే అనుభవాల ఆధారంగా మిగిలిన నగరాలకు విస్తరిస్తారని చెబుతున్నారు. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు దేశ వ్యాప్తంగా 5 లక్షలకు పైగా రెస్టారెంట్లు సభ్యులుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సంస్థతోనే రాపిడో ఒప్పందం చేసుకోవటం ద్వారా.. ఫుడ్ డెలివరీ బిజినెస్ లోనూ తన ముద్రను చూపే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు రాపిడో ఫుడ్ డెలివరీలోకి ఎంట్రీ ఇస్తుందన్న సమాచారం బయటకు రావటంతో స్విగ్గీ.. జొమాటో షేర్లు ప్రభావానికి లోనయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ లో ఈ రెండు సంస్థలకు చెందిన షేర్లు దాదాపు 2 నుంచి 2.5 శాతం నష్టపోవటం గమనార్హం.