ఫోర్స్ వల్లే వారంతా విలన్‌లు అవుతున్నారా?
వెండితెరపై ఓ వెలుగు వెలిగి హీరోలుగా రాణించి తమదైన ముద్రవేసిన వారు టాలీవుడ్ టు కోలీవుడ్ వరకు ఎంతో మంది ఉన్నారు.
By: Tupaki Desk | 11 Feb 2026 4:00 AM ISTవెండితెరపై ఓ వెలుగు వెలిగి హీరోలుగా రాణించి తమదైన ముద్రవేసిన వారు టాలీవుడ్ టు కోలీవుడ్ వరకు ఎంతో మంది ఉన్నారు. కెరీర్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా తమ క్రేజ్‌కు తగ్గ కథలని ఎంచుకుంటూ హీరోలుగా కొనసాగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌లుగా కనిపించి అభిమానులకు, ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. హీరోలుగా తమదైన మార్కు నటనతో ఆకట్టుకుని ప్రతినాయకులని మట్టికరిపించిన హీరోలే ఆ తరువాత నేటీ తరం స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌లుగా నటిస్తున్నారు.
అయితే దీని వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉందని ఇటీవల తెలిసింది. యాక్షన్ కింగ్‌గా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకోవడమే కాకుండా దర్శకుడిగా కూడా మంచి సక్సెస్‌లని దక్కించుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ తాజాగా పాల్గొన్న ఓ పోడ్ కాస్ట్‌లో తాను విలన్‌గా ఎందుకు నటించాల్సి వచ్చిందే వెల్లడించి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా, కన్నడ యంగ్ హీరో నిరంజన్ సుదీంద్రన్ హీరోగా `సీతా పయనం` రూపొందించారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా ఓ పోడ్ కాస్ట్‌లో పాల్గొన్న అర్జున్ తాను విలన్‌గా నటించడానికి గల కారణాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. మణిరత్నం అంటే తనకు చాలా ఇష్టం, గౌరవమని, ఎంతో కాలంగా ఇద్దరం కలిసి వర్క్ చేయాలని అనుకున్నామని, అయితే ఒక రోజు మణిరత్నం ఫోన్ చేసి ఓ క్యారెక్టర్ ఉంది చేయాలని చెప్పాడని, ఆ క్యారెక్టర్ ఏంటని అడిగితే విలన్ క్యారెక్టర్ అన్నాడని, అది విని నేను షాక్ అయి..నేనేంటీ విలన్ ఏంటీ..ఎంతో కాలంగా కలిసి పని చేయాలనుకున్నాం. ఇప్పుడు విలన్ అంటున్నారేంటీ? అని తాను అడిగితే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుందని, మణిరత్నం తనని ఫోర్స్ చేయడం వల్లే `కడలి` మూవీలో ఫస్ట్ టైమ్ విలన్‌గా నటించానని చెప్పడం గమనార్హం.
ఆ తరువాత కూడా నితిన్ `లై`, విశాల్ నటించిన `అభిమన్యుడు`లోనూ అలాగే చేశానని చెప్పుకొచ్చారు. ఇదే తరహాలో కాకపోయినా చాలా మంది క్రేజీ హీరోలు ఇప్పుడు విలన్‌లుగా తెరపైకి వచ్చేస్తున్నారు. శంకర్ తెరకెక్కించిన `ఐ` మూవీలో అంత వరకు హీరోగా నటించిన సురేష్ గోపీ సడన్‌గా విలన్ అవతారం ఎత్తడం అందరిని షాక్‌కు గురి చేసింది. మ్యాడీగా, లవర్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న మాధవన్ తెలుగు డైరెక్టర్ చందూ మొండేటి రూపొందించిన `సవ్యసాచి` మూవీలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.
మ్యాడీని సైకో విలన్‌గా చూడటం, కథలో భారీ లోపాలు ఉండటంతో సవ్యసాచి ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇక కింగ్ నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ మూవీ `కూలీ`. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విలన్‌గా కింగ్ నటించిన విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్‌కు నాగ్ అయితేనే బాగుంటుందని భావించి తనని ఒప్పించి ఈ మూవీ చేయించారు. సినిమాలో తన క్యారెక్టర్ కొత్తగా ఉన్నా చివర్లో రజనీ చేతిలో చనిపోవడం నాగ్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. నాగ్ ఇలాంటి క్యారెక్టర్ అంగీకరించి ఉండకపోతే బాగుండేదని అంతా ఫీలయ్యారు.
ఇప్పుడు ఇదే తరహాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా మహేష్ కోసం విలన్ వేషం వేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా వండర్ `వారణాసి`. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా `కుంభ` క్యారెక్టర్‌లో వీల్ చైర్‌కే పరిమితమయ్యే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నటించే అవకాశం ఉన్న ఛాలెంజింగ్ రోల్ కావడం వల్లే ఈ మూవీలో ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించానని పృథ్వీరాజ్ చెబుతున్నాడు. ఇలా క్రేజీ హీరోలని డైరెక్టర్స్ టెమ్ట్ చేస్తూ ఫోర్స్‌తో విలన్ క్యారెక్టర్లు చేయిస్తుండటం బాగానే ఉన్నా వారి ఫ్యాన్స్‌కు మాత్రం తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది.
