వార్ 2 వర్సెస్ కూలీ.. అప్పుడే థియేటర్ల లొల్లి?
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `కూలీ` కూడా భారీ సినిమానే. నిజానికి వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీతో పోలిస్తే లోకేష్ కనగరాజ్ పైనే చాలా మందికి ఆసక్తి ఉంది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:39 AM ISTబాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `వార్ 2` ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. కీలకమైన మల్టీప్లెక్స్ చైన్ లలో రిలీజ్ వార్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజా సమాచారం మేరకు.. యష్ రాజ్ ఫిల్మ్స్ భారతదేశం అంతటా ఉన్న 30 పైగా ఐమ్యాక్స్ స్క్రీన్లను రెండు వారాల పాటు వార్ 2 కోసం రిజర్వ్ చేసిందని సమాచారం. దీనికోసం సదరు సంస్థ ఒక ప్రత్యేక ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. అయితే అదేరోజు విడుదలవుతున్న రజనీకాంత్ కూలీ చిత్రానికి ఐమ్యాక్స్ స్క్రీన్లలో ఒకటి కూడా అందుబాటులో లేకుండా యష్ రాజ్ బ్యానర్ లాక్ చేసేసిందనేది టాక్.
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `కూలీ` కూడా భారీ సినిమానే. నిజానికి వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీతో పోలిస్తే లోకేష్ కనగరాజ్ పైనే చాలా మందికి ఆసక్తి ఉంది. అతడి స్క్రీన్ ప్లే మాయాజాలం ముందు ఏదీ నిలబడదు. రజనీకాంత్, నాగార్జున లాంటి అగ్ర తారలు నటించిన ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారకుడు అతడే. అయితే థియేటర్ల పరమైన వార్ ఆ రెండు సినిమాల నడుమా ఇబ్బందికరమైనది. వార్ 2 కోసం ప్రైమ్ లొకేషన్లలో ప్రధాన స్క్రీన్లను దక్కించుకోవడం కూలీకి కొంత ఇబ్బందే. స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల సందడితో ఉత్సాహం నెలకొంటుంది. ఈ రెండు పెద్ద సినిమాలు విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
