వార్ 2 : ఈ రెండు నిజమైతే...!
ఈ సినిమాలో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న కొత్త సినిమాలకు సంబంధించిన ఇన్‌పుట్స్ ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది.
By: Tupaki Desk | 28 July 2025 11:30 AM ISTఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ మూవీ 'వార్ 2'. దీన్ని ఒక డైరెక్ట్ తెలుగు సినిమా స్థాయిలో విడుదల చేయడం కోసం నిర్మాత నాగ వంశీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్న కారణంగా దీన్ని ఒక డబ్బింగ్ సినిమాగా చూడవద్దు అన్నట్లుగా ఆయన మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. దేవర స్థాయిలో రిలీజ్ చేయడం ద్వారా అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను మరో లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందించాడని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై పాజిటివ్ ఒపీనియన్ మొదలైంది. దాంతో సినిమా అత్యధిక వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న కొత్త సినిమాలకు సంబంధించిన ఇన్‌పుట్స్ ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. క్లైమాక్స్‌తో పాటు ప్రీ క్లైమాక్స్ లో కథలో భాగంగా పఠాన్ 2, ఆల్ఫా సినిమాలకు సంబంధించిన కొన్ని పాత్రలను పరిచయం చేయబోతున్నారట. ఈ రెండు సినిమాల కోసం హిందీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్పై థ్రిల్లర్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా నుంచి కొత్త పార్ట్ రానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా నుంచి అప్‌డేట్ రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
పఠాన్ 2 కి సంబంధించిన అప్‌డేట్ రాకముందే వార్ 2 లో ఆ సినిమాకు సంబంధించిన ఇన్‌పుట్స్ ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి రాబోతున్న లేడీ ఓరియంటెడ్ స్పై థ్రిల్లర్ మూవీ ఆల్ఫా కు సంబంధించిన ఇన్‌పుట్స్‌ను సైతం ఈ సినిమాలో ఉంచారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ఇన్‌పుట్స్ వల్ల సినిమా వెయిట్ పెరగడంతో పాటు, ఆసక్తి వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. భారీ వసూళ్లు సాధించబోతున్న వార్ 2 లో ఆ రెండు సినిమాలకు సంబంధించిన ఇన్‌పుట్స్ నిజంగానే ఉన్నట్లయితే ఖచ్చితం గా ఆ సినిమాలకు కూడా ప్లస్ గా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదట విలన్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ట్రైలర్ ను చూస్తే సినిమాలో ఎన్టీఆర్ విలన్‌గా కాకుండా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల కాంబో ఫైట్, పాట ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే వార్ 2 చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది అంటూ మేకర్స్ బలంగా వాదిస్తూ వస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కాబోతున్న వార్ 2 ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుంది, తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేరకు వసూళ్లు రాబడుతుంది అనేది చూడాలి.
