వార్ 2 : ఎన్టీఆర్ నెట్టాల్సిందే..?
బాలీవుడ్‌లో అత్యంత భారీగా రూపొందుతోన్న స్పై యూనివర్స్ సినిమా వార్ 2 పై తెలుగులో అభిమానుల అంచనాలు మొదట్లో బాగానే ఉండేవి.
By: Tupaki Desk | 22 May 2025 2:00 PM ISTబాలీవుడ్‌లో అత్యంత భారీగా రూపొందుతోన్న స్పై యూనివర్స్ సినిమా వార్ 2 పై తెలుగులో అభిమానుల అంచనాలు మొదట్లో బాగానే ఉండేవి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్, అగ్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలింస్ బ్యానర్, స్పై యాక్షన్ నేపథ్యంలో అటు నేషనల్‌గా ఇటు తెలుగు మార్కెట్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది. కానీ తాజాగా విడుదలైన టీజర్ మాత్రం అందరినీ నిరాశపరిచింది. హృతిక్ స్టైలిష్‌గా కనిపించాడనే దానికంటే ఎన్టీఆర్ పై చూపించిన విజువల్స్, డైలాగ్ డెలివరీపై సోషల్ మీడియాలో భారీగా నెగటివ్ కామెంట్లు రావడం షాక్‌కు గురిచేసింది.
ఇక ఇదే సమయంలో మరో ప్రక్క రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న కూలి బజ్ మాత్రం టాప్ గేర్‌లో ఉంది. "100 డేస్ టు కూలి" వీడియోతో మొదలైన ప్రమోషన్, అనిరుధ్ నేపథ్య సంగీతం, రాజనీ గెటప్.. ఇవన్నీ కలిసి ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. అలాగే నాగార్జున క్రేజ్ తో కూడా హైప్ గట్టిగానే ఎక్కించారు. ముఖ్యంగా తమిళంతో పాటు తెలుగులోనూ కూలీ ప్రమోషన్ స్పీడ్ పెరిగిపోతుండటం గమనార్హం.
ఒక వేళ ఇలాగే కొనసాగితే కూలీ తెలుగు బాక్సాఫీస్ వద్ద వార్ 2 ని దాటేస్తుందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నది.. వార్ 2 కు తెలుగు మార్కెట్లో హైప్ లోపిస్తున్న విషయం. హృతిక్ నేమ్‌కి ఉత్తరాదిలో మార్కెట్ ఉన్నా, సౌత్‌లో మాత్రం ఎన్టీఆర్ మీదే పూర్తి భారం పడింది. కాబట్టి ఈ నెగటివ్ ట్రెండ్‌ను తిరగమొయ్యాలంటే ఇక నుండి ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
టీజర్ విఫలమైన నేపథ్యంలో ట్రైలర్‌తో పెద్ద ఎఫెక్ట్ తీసుకురావడమే ఒక్కటే మార్గం. ఆపై మీడియా ఇంటర్యూస్, ఈవెంట్స్, సోషల్ మీడియా అప్‌డేట్స్.. అన్ని దశల్లోనూ ఎన్టీఆర్ ప్రమోషన్ లో ముందుండాలి. ఈ సినిమా ఎన్టీఆర్‌కు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. బాలీవుడ్ లో ఫుల్ స్కేల్ ఎంట్రీగా ఈ సినిమాను చూడటం, ఆ స్థాయిలో తన పాత్రకు ప్రాముఖ్యత రావాలన్నదే అభిమానుల ఆశ.
కానీ మొదటి మెట్టు అయిన టీజర్ అంచనాలు అందుకోలేకపోవడం ఇప్పుడు ప్రమోషన్ వైపు మరింత శ్రద్ధ అవసరమని చెబుతోంది. ఇక యష్‌రాజ్ ఫిలింస్‌కు సౌత్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మద్ధతిచ్చే ఎన్టీఆర్‌లాంటి స్టార్ అవసరం తప్పనిసరి. సాధారణంగా ఈ స్థాయిలో పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు మార్కెట్ కోసం డిజైన్ చేసే స్పెషల్ ప్రెజెంటేషన్ ఉంటుంటుంది. కానీ వార్ 2 టీజర్ మాత్రం అక్కడే తడబడింది. ఇది తేలికగా తీసుకునే విషయం కాదు. ఇప్పుడైనా దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాతలు, ఎన్టీఆర్ కలిసి భారీ స్ట్రాటజీతో ప్రమోషన్ స్ట్రాటజీ రూపొందించాలి. లేదంటే కూలీ ముందు వార్ 2 స్పీడ్ తగ్గే అవకాశాలున్నాయి. తెలుగులో సినిమాకి మిగిలిన హైప్ అంతా ఇప్పుడు ఎన్టీఆర్ మీదే ఆధారపడి ఉంది.
