'వార్ 2' రొటీన్ మూవీ కాదు.. ఎందుకంటే!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో నటించిన 'వార్ 2' సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 20 May 2025 12:36 PM ISTహృతిక్ రోషన్, ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో నటించిన 'వార్ 2' సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వార్ 2 ఉండబోతుందని తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే అనిపిస్తోంది. నిజంగా వార్‌ను కళ్ల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమాను రూపొందించినట్లు విజువల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య ఉండే ఫైట్ మరో లెవల్ అన్నట్లుగా ఉంటుందని అనిపిస్తోంది. ఆ ఫైట్‌కి సంబంధించిన విజువల్స్ ఎక్కువగా టీజర్‌లో లేవు అయినా కూడా చూపు తిప్పనివ్వకుండా ఆ యాక్షన్ సీన్ ఉంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'వార్ 2' సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్‌లో ఉండదట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని, అందులో ఒకటి హృతిక్ రోషన్, కియారా అద్వానీ కాంబోలో సాగే రొమాంటిక్ నెంబర్ కాగా, రెండోది హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో ఉండే పార్టీ సాంగ్. ఈ రెండు పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా రొటీన్ కమర్షియల్ సినిమాల్లో ఐదు, ఆరు పాటలు ఉంటాయి, నాలుగు ఫైట్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని తెలిసి పోయింది. అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఎక్కువ ఉంటాయట.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'వార్ 2' సినిమాలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. ఒకటి భారీ ఛేజింగ్ సీన్ ఉంటుందట. మొత్తంగా ఆరు యాక్షన్ సీన్స్‌తో వార్ 2 సినిమా ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీగా ఉంటుందని మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో యాక్షన్ సినిమాలకు, ముఖ్యంగా సౌత్ హీరోలు నటించిన యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో వార్ 2 సినిమా గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ పై హైప్ పెంచే విధంగా ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది.
వార్ 2 సినిమాతో పాటు ఎన్టీఆర్ కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వార్ 2 సినిమా ఈ ఏడాదిలో విడుదల కానుండగా ఎన్టీఆర్ నటిస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల ఉండే అవకాశం ఉంది. నేడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వార్ 2 నుంచి టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. ఇక ప్రశాంత్ నీల్ ఒక పోస్టర్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున వసూళ్లు సొంతం చేసుకోవడంతో పాటు, స్టార్‌డం దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
