బిగ్గెస్ట్ 'వార్'కి కౌంట్ డౌన్ షురూ
గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న వార్ 2 సినిమా విడుదలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మరో 50 రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుందంటూ కొత్త పోస్టర్స్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.
By: Tupaki Desk | 26 Jun 2025 11:42 AM ISTనందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఎన్టీఆర్ మొదటి సారి నేరుగా హిందీ సినిమాలో నటించడం ద్వారా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక హృతిక్ రోషన్ ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు, ఆయన హీరోగా ఇంతకు ముందు వచ్చిన వార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే హిందీ సినీ ప్రేమికుల్లో కూడా వార్ 2 సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు తప్ప ఎక్కువ శాతం మంది వార్ 2 రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వార్ 2 సినిమా టీజర్ విడుదల తర్వాత కాస్త బజ్ తగ్గింది అనేది సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న కామెంట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఉన్న కారణంగా కచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్‌ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. నార్త్ ఇండియాతో పాటు, సౌత్ ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అనుమానంగా ఉంది. దేశ వ్యాప్తంగా వార్ 2 ను ఈ ఏడాదిలోనే ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. హృతిక్ రోషన్‌కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తే, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు.
గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న వార్ 2 సినిమా విడుదలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మరో 50 రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుందంటూ కొత్త పోస్టర్స్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీలకు సంబంధించిన పోస్టర్స్‌ను వేరు వేరుగా విడుదల చేయడం జరిగింది. ప్రతి పోస్టర్‌లోనూ భారీ యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. చివరకు హీరోయిన్ కియారా అద్వానీతోనూ ఈ సినిమా కోసం భారీ స్టంట్స్ చేయించినట్లు తెలుస్తోంది. తాజా రిలీజ్ పోస్టర్‌లో కియారా అద్వానీని చూస్తూ ఉంటే అందంతో పాటు, తనలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను సైతం కియారా అద్వానీ చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల కాబోతున్న వార్ 2 సినిమాకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా పోటీగా రాబోతుంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాలో నాగార్జున మాత్రమే కాకుండా సౌత్, బాలీవుడ్ స్టార్స్ పలువురు ఉన్నారు. అందుకే అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల కూలీ కుమ్మేస్తుందనే విశ్వాసంతో మేకర్స్ ఉన్నారు. ఇలాంటి సమయంలో వార్ 2 సినిమాను కనీసం వారం రోజులు థియేటర్‌లో నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు.
కచ్చితంగా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే తప్ప వసూళ్లు భారీగా ఉండవు. వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మాణం జరిగింది. ఇప్పటి వరకు యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఎన్నో స్పై థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. వాటిల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్ కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు కొన్ని డిజాస్టర్‌గా నిలిచాయి. అందుకే ఈ సినిమా ఫలితం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
