Begin typing your search above and press return to search.

వార్ 2 తెలుగు రైట్స్: రిస్క్ తీసుకుంటున్నారా?

స్పై యూనివర్స్‌లో మరోసారి భారీ మాస్ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "వార్ 2" సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

By:  Tupaki Desk   |   1 July 2025 9:55 PM IST
వార్ 2 తెలుగు రైట్స్: రిస్క్ తీసుకుంటున్నారా?
X

స్పై యూనివర్స్‌లో మరోసారి భారీ మాస్ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "వార్ 2" సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. యాష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే బోల్డ్ లుక్‌తో తారక్ కనిపించిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపినా, పూర్తిగా బజ్ ని పెంచలేకపోయింది. అయినా కూడా ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ వ్యాపారం జరిగింది.

గత కొన్ని వారాలుగా సినీ వర్గాల్లో మరో హైప్డ్ మూవీ "కూలి"తో పోటీ జరగబోతుందన్న వార్తలే వినిపిస్తున్నాయి. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోగా వస్తున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ‘ఏషియన్ మల్టీప్లెక్స్’, సునీల్ నారంగ్, సురేశ్ బాబు, దిల్ రాజు కాంబినేషన్ ద్వారా ఈ మూవీ హక్కులు రూ.50 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలూ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు వస్తుండటంతో టికెట్ కౌంటర్లపై గట్టి పోటీకి ముస్తాబవుతున్నాయి.

ఇక "వార్ 2" తెలుగు హక్కులు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ సొంతం చేసుకున్నారు. యాష్ రాజ్ వాళ్లు మొదట సొంతంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తారక్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్ మార్పు చేశారు. మొదట రూ.100 కోట్లు అడిగినా.. చివరకు డీల్ రూ.80 కోట్ల దగ్గరే క్లోజ్ అయిందని సమాచారం. ఇదివరకే ‘దేవర’ సినిమాను నాగవంశీ రూ.120 కోట్లకు అందుకున్నారు, అదే ట్రాక్‌ను వార్ 2లో కూడా కొనసాగించారన్నమాట.

అసలు ప్రశ్న ఏమిటంటే.. నాగవంశీ నిజంగా ఈ డీల్‌తో రిస్క్ తీసుకున్నారా? అనేది వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. తారక్ మాత్రం మాస్ లుక్‌తో ఆకట్టుకున్నా, యాక్షన్ సీక్వెన్స్‌లు, కథపై పెద్దగా హైప్ కనిపించలేదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ తరహాలో విజువల్ ట్రీట్ చూపిస్తారనే నమ్మకం ఉన్నా.. సెంటిమెంట్‌గా తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా కనిపించడం లేదు.

అదే సమయంలో ‘కూలి’ పాజిటివ్ బజ్‌తో ముందుకు సాగుతోంది. ఒకవైపు రజనీకాంత్ మాస్ ఫాలోయింగ్, మరోవైపు లోకేష్ బ్రాండ్ వర్కవుట్ కావడం, ఆడియెన్స్ మధ్య హై ఇంటరెస్ట్ కలిగిస్తున్నాయి. అలాంటి సమయంలో తారక్ ఉన్నాడు అనే ఒక్క పాయింట్ మీదనే "వార్ 2" బిజినెస్ అంతలా పెట్టుబడి పెట్టడం సాహసమేనని ఫిల్మ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది? నాగవంశీ చేసిన డీల్ సక్సెస్ అవుతుందా లేదంటే కూలీ దూసుకుపోతుందా? అన్నది తేలాలి అంటే ప్రమోషన్ డోస్ పెంచే వరకు ఆగాల్సిందే.