Begin typing your search above and press return to search.

'వార్-2' మూవీ రివ్యూ

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేసిన చిత్రం.. వార్-2. హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ కలయికలో బ్లాక్ బస్టర్ అయిన ‘వార్’కు ఇది సీక్వెల్.

By:  Tupaki Desk   |   14 Aug 2025 1:29 PM IST
వార్-2 మూవీ రివ్యూ
X

‘వార్-2’ మూవీ రివ్యూ

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్- కియారా అద్వానీ- అశుతోష్ రాణా- అనిల్ కపూర్ తదితరులు

సంగీతం: ప్రీతమ్

ఛాయాగ్రహణం: బెంజమిన్ జాస్పర్

మాటలు: రాకేందుమౌళి

కథ-నిర్మాణం: ఆదిత్య చోప్రా

స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్

దర్శకత్వం: అయాన్ ముఖర్జీ

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేసిన చిత్రం.. వార్-2. హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ కలయికలో బ్లాక్ బస్టర్ అయిన ‘వార్’కు ఇది సీక్వెల్. ఈసారి హృతిక్ తో తారక్ జత కట్టాడు. అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వార్-2’.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

‘రా’లో టాప్ ఏజెంట్ అయిన కబీర్ (హృతిక్ రోషన్).. ఇండియాకు వ్యతిరేకంగా పని చేసే ప్రమాదకర ఖలీల్ నెట్వర్క్ ను నాశనం చేయడం కోసం ‘రా’ చీఫ్ లూత్రా (అశుతోష్ రాణా) ఆదేశాల మేరకు దేశద్రోహిగా ముద్ర వేయించుకుని ఆ నెట్వర్క్ లో భాగం అవుతాడు. కబీర్ చేసిన కొన్ని మిషన్లు చూసి ఇంప్రెస్ అయి అతణ్ని తమ నెట్వర్క్ లోకి తీసుకుంటుంది ఖలీల్ గ్యాంగ్. ఐతే ఈ క్రమంలో తన గురువు అయిన లూత్రానే కబీర్ చంపాల్సి వస్తుంది. దీంతో లూత్రా కూతురు కావ్య (కియారా అద్వాణీ) కబీర్ మీద పగబడుతుంది. ఇంతలో ‘రా’లోకి కొత్తగా వచ్చిన విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్)తో కలిసి కావ్య కబీర్ ను టార్గెట్ చేస్తుంది. కానీ కబీర్ వీళ్లకు చిక్కడు. కొన్ని పరిణామాల తర్వాత విక్రమ్ మీద నమ్మకంతో తాను చేస్తున్న మిషన్ వెనుక అసలు నిజాన్ని కబీర్ చెబుతాడు. కానీ అతడికి విక్రమ్ పెద్ద షాక్ ఇస్తాడు. ఆ షాకేంటి.. ఇంతకీ విక్రమ్ నేపథ్యమేంటి.. కబీర్ తో అతడికున్న సంబంధమేంటి? కబీర్-విక్రమ్ మధ్య జరిగిన పోరులో చివరికి ఎవరు గెలిచారు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:


ఇండియాలో స్పై సినిమాలు అనగానే అందరికీ యశ్ రాజ్ ఫిలిమ్సే గుర్తుకు వస్తుంది. ప్రత్యేకంగా ‘స్పై యూనివర్శ్’ అని ఒక పేరు పెట్టి ఒకే జానర్లో చాలా ఏళ్ల నుంచి సినిమాలు తీస్తూ పోతోంది ఆ సంస్థ. ఏక్ థా టైగర్.. టైగర్ జిందా హై.. టైగర్-3.. వార్.. పఠాన్.. ఇలా ఈ యూనివర్శ్ నుంచి చాలా సినిమాలే వచ్చాయి. యశ్ రాజ్ వాళ్లను చూసి వేరే నిర్మాణ సంస్థలు కూడా ఈ తరహా సినిమాలు తీయడం మొదలుపెట్టాయి. కానీ ఒక దశ దాటాక ఈ కథలు జనాలకు మొహం మొత్తేశాయి. అన్ని స్టోరీలు.. వాటిలోని లీడ్ క్యారెక్టర్లు.. అవతల విలన్లు.. ఒకే రకంగా కనిపించడం మొదలుపెట్టారు. అలాంటపుడు మళ్లీ ఈ జానర్లో ఓ సినిమా వస్తోందంటే.. జనాలు ముందే కథ-ముఖ్య పాత్రలు ఎలా ఉంటాయో ఒక అంచనాకు వచ్చేస్తారు. ఆ అంచనాలకు భిన్నంగా.. ఏదైనా కొత్తగా.. వాళ్లను మెస్మరైజ్ చేసేలా ఏదైనా చేస్తేనే ప్రేక్షకులను మెప్పించడానికి అవకాశముంటుంది. కానీ ‘వార్-2’ టీం ఆ ప్రయత్నంలో విజయవంతం కాలేకపోయింది. టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ను తీసుకొచ్చి స్పై యూనివర్శ్ లో భాగం చేయడం బాగానే ఉంది కానీ.. తన పొటెన్షియాలిటీకి తగ్గ పాత్రను క్రియేట్ చేయడంలో అయాన్ ముఖర్జీ అండ్ కో ఫెయిలైంది. ఇక ‘వార్’లో వావ్ అనిపించిన కబీర్ పాత్రను అయినా సరిగా వాడుకున్నారా అంటే అదీ లేదు. విజయవంతమైన సినిమాకు సీక్వెల్.. ఇద్దరు తిరుగులేని హీరోలు.. కావాల్సినంత బడ్జెట్.. ప్రేక్షకుల్లో అమితాసక్తి.. ఇన్ని సానుకూలాంశాలు ఉన్నా అయాన్ ముఖర్జీ ఉపయోగించుకోలేకపోయాడు. ‘వార్-2’ రూపంలో ఒక సాధారణమైన స్పై మూవీని అందించాడు.

కేవలం భారీతనం.. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు ఉన్నంత మాత్రాన యాక్షన్ సినిమాలు విజయవంతం అయిపోవు. అవి ఆకర్షణ అవుతాయి తప్ప.. సినిమాను ముందుకు నడిపించలేవు. ఒక యాక్షన్ ఘట్టం రావడానికి ముందు సరైన బిల్డప్ ఉంటేనే అది ఇవ్వాల్సిన కిక్కు ఇస్తుంది. అందులోనూ ఇద్దరు హీరోలు తలపడుతున్నపుడు బిల్డప్ ఎలా ఉండాలి.. దాని వెనుక ఎమోషన్ ఎలా ఉండాలి? కానీ ‘వార్-2’లో హృతిక్ రోషన్-ఎన్టీఆర్ రక్తాలు చిందేలా కొట్టుకుంటున్నా రవ్వంత కూడా ఎమోషన్ ఉండదు. ఆ ఫైట్ కు ముందు ఉండాల్సిన బిల్డప్పే సరిగా లేదు. అసలు ఇద్దరు హీరోలు బద్ధ శత్రువులు కావడానికి.. ఒకరినొకరు అంతలా ఢీకొట్టడానికి కూడా బలమైన కారణం కనిపించదు. ఎన్టీఆర్ పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఆపాదించడం బాగున్నా.. అంతటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోను విలన్ని చేయలేక.. అదే సమయంలో పూర్తి స్థాయి హీరోగానూ చూపించలేక.. ఈ మీమాంసలో దాన్ని ఎటూ కాకుండా తయారు చేసిపెట్టినట్లు అనిపిస్తుంది. హీరోలిద్దరూ కుర్రాళ్లుగా ఉండగా వాళ్ల మధ్య నడిపించిన ఫ్లాష్ బ్యాక్ సినిమాకు పెద్ద మైనస్. తన మిత్రుడి మీద.. అలాగే దేశం మీద విక్రమ్ (ఎన్టీఆర్) పాత్ర పగ పెంచుకోవడానికి కారణాలను బలంగా చూపించలేకపోయారు. ఇక హృతిక్ చేసిన కబీర్ పాత్ర అయితే దిశా నిర్దేశం లేకుండా సాగుతుంది. తన మీద దేశద్రోహి ముద్ర వేయించుకుని విలన్ల నెట్వర్క్ లోకి వెళ్లిన కబీర్.. అక్కడ ఏం సాధించాడు అంటే ఏమీ కనిపించదు. అతను ఏమీ చేయకుండానే తన ఐడెంటిటీ బయటపడిపోతుంది. ఇక ఆ పాత్ర పరమార్థం ఏంటో రచయితలు-దర్శకులకే తెలియాలి.

ఒకవైపు బాలీవుడ్ సూపర్ స్టార్.. ఇంకోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్.. ఇలాంటి హీరోలున్న సినిమాలో విలన్లు ఎంత బలంగా ఉండాలి? కానీ ఖలీల్ నెట్వర్క్ అంటూ వివిధ దేశాలకు చెందిన మాఫియా డాన్లను మొదట్లో పెద్ద బిల్డప్ తో చూపిస్తారు కానీ.. వాళ్లు హాట్ లైన్లోకి వచ్చి స్క్రీన్ల మీద చేసే హడావుడి తప్ప ఏమీ ఉండదు. ఇండియాకు వ్యతిరేకంగా వాళ్లు చేసే కుట్రలన్నీ కృత్రిమంగా.. నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తాయి. విలన్లు బలంగా అనిపించి.. వాళ్లు ఏదో చేయబోతుంటే ఒక టెన్షన్ పుట్టాలి ప్రేక్షకుల్లో. అప్పుడు హీరోలు రంగంలోకి దిగి సాహసాలు చేస్తే మజా వస్తుంది. కానీ విలన్ల సెటప్పే చాలా కృత్రిమంగా అనిపించడం వల్ల ఏం జరిగినా ప్రేక్షకుల్లో పెద్దగా చలనం కనిపించదు. ‘వార్-2’లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేవి యాక్షన్ ఘట్టాలు మాత్రమే. హీరోల ఇంట్రడక్షన్ సీక్వెన్సులు రెండూ ఆకట్టుకుంటాయి. వాళ్లిద్దరి తొలి ఫేసాఫ్ సీన్ కూడా బాగా డిజైన్ చేశారు. కొంచెం అతిశయంగా అనిపించినప్పటికీ.. అది ఎంగేజ్ చేస్తుంది. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ట్విస్టుతో ఇంటర్వెల్ ఓకే అనిపిస్తుంది. ప్రథమార్ధం ఓ మోస్తరుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో మాత్రం గ్రాఫ్ పడుతూ పోతుంది. పతాక సన్నివేశాలను మినహాయిస్తే సెకండాఫ్ బోరింగే. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే.. థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్. యాక్షన్ ఘట్టాల్లో భారీతనం బాగున్నా.. అవి కొంచెం నమ్మశక్యంగా ఉండేలా చూసుకోవాల్సింది. వీఎఫెక్స్ సరిగా కుదరలేదు. కథ.. పాత్రల పరంగా కొత్తదనం కనిపించకపోవడం ‘వార్-2’కు ప్రతికూలం అయ్యాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాలంటే.. ఇలాగే కదా ఉంటాయి.. కొత్తేముంది అనే మొనాటనస్ ఫీలింగ్ ను ఇప్పటికే కొన్ని సినిమాలు కలిగించాయి. ఈ సినిమాతో అది మరింత పెరుగుతుంది. భారీ యాక్షన్ ఘట్టాలు.. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కోసం ‘వార్-2’పై ఒక లుక్కేయొచ్చు కానీ.. దీని మీద ఉన్న అంచనాలను అందుకునే సినిమా అయితే కాదిది.

నటీనటులు:


జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ అరంగేట్రంలో సరైన పాత్ర దక్కలేదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాబట్టి వెరైటీగా ఉంటుందని తారక్ ట్రై చేసి ఉండొచ్చు. ఆ పాత్రకు తగ్గట్లు అతను లుక్ మార్చుకున్నాడు. దాన్ని పండించడానికి ఎఫర్ట్ పెట్టాడు. క్యారెక్టర్ ఎసెన్స్ తెలిసేలా హావభావాలను సరిగానే పలికించాడు. కానీ విక్రమ్ పాత్రను సరిగా తీర్చిదిద్దకపోవడం.. బలమైన డైలాగులు కూడా పడకపోవడంతో ఎన్టీఆర్ కష్టం ఫలించలేదు. హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో ఎప్పట్లాగే మెప్పించాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. కానీ ‘వార్’ తరహాలో కబీర్ పాత్ర ఇందులో ఎలివేట్ కాలేదు. కథానాయిక కియారా అద్వానీకి కథలో కీలకమైన పాత్రే దక్కింది. ఒక పాటలో ఆమె అందాలు ఆరబోసి కుర్రాళ్లను అలరించింది. పెర్ఫామెన్స్ పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. యాక్షన్ ఘట్టాల్లో ఆమె బాగానే చేసింది. అనిల్ కపూర్.. అశుతోష్ రాణా సహాయ పాత్రల్లో ఓకే అనిపించారు. గులాటి అనే విలన్ పాత్ర చేసిన నటుడు.. ఇద్దరు స్టార్ల ముందు ఆనలేదు. అతడి నటన కూడా తేలిపోయింది.

సాంకేతిక వర్గం:


టెక్నికల్ గా ‘వార్-2’ యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రమాణాలకు తగ్గట్లు లేదు. సినిమా మీద భారీగానే ఖర్చు పెట్టినట్లు అనిపించినా.. విజువల్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల ఆడ్ గా అనిపిస్తాయి. యాక్షన్ ఘట్టాల్లో భారీతనం ఉన్నా నమ్మశక్యంగా అనిపించవు. ప్రీతమ్ సంగీతం సోసోగా సాగింది. సినిమాలో కిక్కిచ్చే పాటలు లేవు. నేపథ్య సంగీతం ప్రేక్షకుల్లో జోష్ తీసుకురాలేకపోయింది. బెంజమిన్ జాస్పర్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాత ఆదిత్య చోప్రానే అందించిన కథలో పొటెన్షియాలిటీ ఉన్నా.. దానికి శ్రీధర్ రాఘనవన్ ఆసక్తికర స్క్రీన్ ప్లే జోడించలేకపోయాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోనూ మెరుపులు కొరవడ్డాయి. ‘వార్’లో సిద్దార్థ్ ఆనంద్ తీసుకొచ్చిన ఔట్ పుట్ కు.. ‘వార్-2’లో అయాన్ పనితనానికి చాలా తేడా ఉంది. సినిమాలో కీలకమైన ట్విస్టులను సైతం అయాన్ సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. తన నరేషన్ బోరింగ్ గా సాగింది.

చివరగా: వార్-2.. డోస్ సరిపోలేదు

రేటింగ్- 2.5/5