ఏపీలో వార్ 2 ఈవెంట్.. ఇది కిక్కిచ్చే ప్లాన్!
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 19 July 2025 9:57 PM ISTపాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మూవీకి దేశవ్యాప్తంగా అభిమానులలో ఆసక్తి పెరిగిపోతోంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన 'వార్' సినిమాకు సీక్వెల్‌గా రాబోతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హృతిక్ - ఎన్టీఆర్ కాంబినేషన్ అన్నదే సినిమాకు హైప్ తీసుకొచ్చింది. ఇద్దరూ యాక్షన్‌లో మాస్టర్స్ కావడంతో వారి మధ్య వచ్చే క్లాస్ అండ్ మాస్ ఫైట్లు థియేటర్లలో మోత మోగించేలా ఉంటాయని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ట్రైలర్ జూలై 23న రిలీజ్ కాబోతుండగా, ప్రమోషన్స్‌కి మూడో గేర్ వేస్తున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్‌ను బాగా క్యాష్ చేసేందుకు మేకర్స్ స్పెషల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, ‘వార్ 2’ ప్రమోషన్ కార్యక్రమంగా విజయవాడలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ హాజరయ్యే అవకాశం ఉందట. స్టార్ హీరోలు ఇద్దరూ ఒకే వేదికపై ఉండే ఈ వేడుకకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట.
పోలీస్ భద్రత, వేదిక ఏర్పాట్లు మొదలైనవి చర్చలో ఉన్నాయి. ఈవెంట్ డేట్ ఇంకా ఖరారుకాలేదు కానీ జూలై చివరలో లేదా ఆగస్టు ప్రారంభంలో ఉండే అవకాశం ఉంది. ఈవెంట్ ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. హృతిక్ రోషన్ ఇంతవరకు ఏ తెలుగు ఈవెంట్‌కు రాలేదు. ఆయన ప్రత్యక్ష హాజరైతే ఫ్యాన్స్‌కు పండుగే. అలాగే ఎన్టీఆర్ కూడా సినిమా గురించి మాట్లాడితే మాస్ బజ్ మరింత పెరుగుతుంది.
ఈవెంట్‌లో ట్రైలర్ ఫుటేజ్, స్పెషల్ వీడియోలు, అభిమానుల మధ్య ఇంటరాక్షన్ వంటివి ఉండొచ్చని సమాచారం. ఇక ‘వార్ 2’కి సంబంధించిన మిగతా ప్రచార కార్యక్రమాలు ఇతర నగరాల్లో కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలోని స్పై యూనివర్స్ ఫ్యాన్స్ ఇప్పటికే బాక్సాఫీస్ రికార్డులు గురించే చర్చలు మొదలుపెట్టారు. మరి విజయవాడ ఈవెంట్ ద్వారా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
