హృతిక్-తారక్ మధ్య సిసలైన్ వార్ డేట్ ఫిక్స్!
హృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య వార్ ఎలా ఉంటుంది? అన్నది ఒక్క టీజర్ తోనే రుచి చూపించారు. అసలైన ట్రైలర్ రిలీజ్ అయితే ఆ విధ్వంసం ఊహకి కూడా అందదు.
By: Tupaki Desk | 27 May 2025 1:41 PM ISTహృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య వార్ ఎలా ఉంటుంది? అన్నది ఒక్క టీజర్ తోనే రుచి చూపించారు. అసలైన ట్రైలర్ రిలీజ్ అయితే ఆ విధ్వంసం ఊహకి కూడా అందదు. సినిమాలో ఇద్దరి పాత్రల మధ్య తగ్గాఫ్ వార్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. వీటన్నింటిని మించిన సిసలైన పోరు మాత్రం అంతకు మించి ఉంటుంది. ఇప్పుడా పోరుకు హీరోలిద్దరు రెడీ అవుతున్నారు. ఇరువురు స్టూడియోలో తలపడటానికి సంసిద్దమవుతున్నారు.
ఆ అరుదైన ఘట్టాన్ని చూడటానికి చిత్ర యూనిట్ సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోంది. ఆ పోరు ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్చిలో ముగించాల్సిన పాట షూట్ జూన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో ఇద్దరు కలిసి చేయాల్సిన పాట చిత్రీకరణ వాయిదా పడింది. అప్పటి నుంచి హృతిక్ గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు.
ఇప్పుడాయన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జూన్ లో పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తు న్నారు. జూన్ చివరి వారంలో అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ను సిద్దం చేస్తున్నారు. ఈ పాట కోసం హృతిక్..తారక్ ఇద్దరు జూన్ మొదటి వారం నుంచి రిహార్సల్స్ మొదలు పెడతారు. ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ పాటను కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టాకీ పార్ట్ కు సంబంధించి 10 రోజుల చిత్రీకరణ పెండింగ్ లో ఉంది. చివరి షెడ్యూల్ తో ఇది పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చిత్రీకరణ పూర్తయినంత వరకూ సీజీ పూర్తి చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలుండటంతో టెక్నికల్ గా వర్క్ ఎక్కువగానే ఉంది. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
