'కింగ్‌డమ్' రిలీజ్ ముంగిట సవాళ్లు
వారం వారం ఇలాంటి భారీ చిత్రాలు రిలీజవుతుంటే ఈ మధ్యలోనే విడుదలకు వస్తోంది విజయ్ దేవరకొండ కింగ్ డమ్. 31 జూలై డేట్ కోసం ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు.
By: Tupaki Desk | 28 July 2025 4:00 AM ISTవరుసగా భారీ సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ నటించిన యాక్షన్ చిత్రం 'వార్ 2' అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించినది. అలాగే లోకేష్ కనగరాజ్ లాంటి ప్రతిభావంతుడు రూపొందించిన 'కూలీ' భారీ తారాగణంతో అత్యంత భారీ హైప్ నడుమ విడుదలకు వస్తోంది. వారం వారం ఇలాంటి భారీ చిత్రాలు రిలీజవుతుంటే ఈ మధ్యలోనే విడుదలకు వస్తోంది విజయ్ దేవరకొండ కింగ్ డమ్. 31 జూలై డేట్ కోసం ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. అయితే ఈ తేదీకి రిలీజ్ నిజంగా దేవరకొండకు పెద్ద సవాల్ లాంటిది. పెద్ద హీరోలు నటించిన సినిమాల నడుమ ఏం తేడా కొట్టినా దాని ప్రభావం భారీగా బాక్సాఫీస్ పై పడుతుంది.
అయితే కింగ్ డమ్ కంటెంట్ పై నిర్మాత నాగవంశీ, హీరో దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈసారి తిరుమల వెంకన్న సామి సాయం చేస్తే చాలు టాప్ లోకి ఎక్కి కూచుంటానని ధీమాను కనబరిచాడు దేవరకొండ. ట్రైలర్ లాంచ్ లో అతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే, కింగ్ డమ్ పై గట్టి నమ్మకంగా ఉన్నాడని అనిపించింది. దానికి తగ్గట్టు ట్రైలర్ లో కంటెంట్ కూడా హై ఇచ్చింది. అయితే ట్రైలర్ లో కథేంటో చెప్పేయడంతోనే అసలు చిక్కొచ్చిపడింది.
ఈ సినిమా కథ తెలిసిపోయాక, ఇప్పుడు సినిమా ఆద్యంతం రక్తి కట్టించే మలుపులు, ట్విస్టులతో పాటు కొత్తదనంతో అలరించాలి. రొటీన్ సీన్లు, గ్రిప్ లేని కథనంతో సినిమాని నడిపించేస్తే ఈ రోజుల్లో జనం థియేటర్లకు రావడం లేదు. కింగ్ డమ్ ని కూడా ఓటీటీలోనే చూడాలనుకుంటారు. అలా కాకుండా కచ్ఛితంగా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలనిపించే కంటెంట్ ఇందులో ఉండాలి. ఇక ప్రీమియర్ షోలతో మంచి టాక్ కలిసి వస్తే, మొదటిరోజు, మొదటి వీకెండ్ వసూళ్లకు హుషారు పెరుగుతుంది. టాక్ నెగెటివ్ గా వచ్చినా దాని ప్రభావం కూడా అంతే దారుణంగా ఉంటుందనేది మర్చిపోకూడదు. ఇక పోటీ సినిమాల నడుమ మంచి ప్రైమ్ థియేటర్లు పడితే కింగ్ డమ్ కి కలిసొస్తుందేమో! ఇలాంటి పోటీ సమయంలో నాగవంశీ అండ్ టీమ్ సవాళ్ల నడుమ బాక్సాఫీస్ గేమ్ ఎలా ఆడతారో చూడాలి.
