2025-26 లో వచ్చే పాన్ ఇండియా సినిమాలివేనా!
2025-26 క్యాలెండర్ ఇయర్ లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలెన్ని? అంటే ప్రముఖంగా కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇవి మాత్రం కచ్చితంగా రిలీజ్ అయ్యే చిత్రాలని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 23 May 2025 9:00 PM IST2025-26 క్యాలెండర్ ఇయర్ లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలెన్ని? అంటే ప్రముఖంగా కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇవి మాత్రం కచ్చితంగా రిలీజ్ అయ్యే చిత్రాలని చెప్పొచ్చు. ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని మేకర్స్ తపిస్తున్నారు. ఓ సారి ఆ చిత్రాల వివరాల్లోకి వెళ్తే... ప్రభాస్ కథానాయుకుడిగా నటిస్తోన్న 'రాజాసాబ్' ఎంత కాలంగా వాయిదా పడు తుందో తెలిసిందే. ఏప్రిల్ రిలీజ్ అనుకున్నారు. కానీ సాధ్య పడలేదు. తాజాగా చిత్రం దసరా రిలీజ్ రేస్ లో కనిపిస్తుంది.
సినిమా రిలీజ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ మరో చిత్రం 'పౌజీ' కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రాన్ని కూడా ఏడాది ముగింపులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఏడాది సాధ్యం కానీ పక్షంలో వచ్చే ఏడాది ఆరంభంలోనే రెండు చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'పెద్ది' రిలీజ్ తేది ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు.
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తోన్న 'మిరాయ్' ఇదే ఏడాది ఆగస్టులో రిలీజ్ సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికి అన్ని పనులు పూర్తయితే రిలీజ్ అవుతుంది. లేదంటే? ఏడాది ముగింపు కల్లా ప్రేక్షకుల ముందుకొస్తుంది. 'హరిహరవీరమల్లు' రిలీజ్ నిరీక్షణకు కూడా తెరదించేసారు. ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ అవుతుంది. మరో వాయిదా ఛాన్స్ తీసుకునే అవకాశమైతే లేదు. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మరో చిత్రం 'ఓజీ' కూడా ఏడాది ముగింపులో గానీ వచ్చే ఏడాది గానీ రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న 'అఖండ2' పాన్ ఇండియా లో భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఆ తేదీ మిస్ అయితే అక్టోబర్ రిలీజ్ తప్పనిసరి. యంగ్ టైగర్ ఎన్టీర్ బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' భారీ అంచనాల మధ్య ఆగస్టులో రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా కాకపోయినా తారక్ ఎంట్రీతో 'వార్ 2' టాలీవుడ్ చిత్రంగా మారిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 'కూలీ' ఆగస్టులో రిలీజ్ అవుతుంది. కన్నడ స్టార్స్ యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. రిషబ్ శెట్టి స్వీయా దర్వకత్వంలో తెరకెక్కుతోన్న `కాంతార చాప్టర్ 1` అక్టోబర్ లో రిలీజ్ అవుతున్నాయి.
