ఇలాగైతే రీ రిలీజ్‌లు కష్టం...!
గత కొన్ని సంవత్సరాలుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇతర వుడ్స్‌తో పోల్చితే టాలీవుడ్‌లో ఎక్కువ రీ రిలీజ్‌లు చూస్తున్నాం.
By: Tupaki Desk | 24 April 2026 11:36 AM ISTగత కొన్ని సంవత్సరాలుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇతర వుడ్స్‌తో పోల్చితే టాలీవుడ్‌లో ఎక్కువ రీ రిలీజ్‌లు చూస్తున్నాం. స్టార్ హీరోల సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న హీరోల సినిమాలు, డిజాస్టర్ అయిన సినిమాలు సైతం రీ రిలీజ్ కావడం టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా ట్రెండ్‌గా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. మహేష్ బాబు నటించిన సగం సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. మరికొన్ని రీ రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ఇలా చెప్పుకుంటూ పోతే రీ రిలీజ్ అయిన సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది. నెలకు కనీసం రెండు రీ రిలీజ్‌లు అయినా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో రీ రిలీజ్‌లు కొత్త సినిమాలను కిల్ చేస్తున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. పెద్ద సినిమాలను రీ రిలీజ్ చేస్తే చిన్న సినిమాలు చితికి పోతున్నాయి.
ప్రభాస్ డార్లింగ్ సినిమా రీ రిలీజ్...
రీ రిలీజ్‌లు రెగ్యులర్‌గా ఉంటున్నా కూడా అభిమానుల సందడి మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ నటించిన సినిమాలు నెలకు ఒకటి చొప్పున రీ రిలీజ్ అవుతున్నా అభిమానులు ఆయా సినిమాలను ఎంజాయ్ చేసేందుకు థియేటర్‌ల ముందు క్యూ కడుతున్నారు. కేవలం ప్రభాస్ అనే కాకుండా ఏ హీరో సినిమా రీ రిలీజ్ అయినా, ఎన్ని రీ రిలీజ్‌లు ఉన్నా కూడా ఆయా హీరోల అభిమానులు థియేటర్ల ముందు బారులు తీరడం ఈ మధ్య కాలంలో కామన్‌గా మారింది. అయితే రీ రిలీజ్ షో లకు వెళ్లిన అభిమానులు కొందరు అత్యుత్సాహం కనబర్చడంతో థియేటర్‌ల వద్ద హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఆ మద్య ఒక వ్యక్తి థియేటర్ లో క్రాకర్స్ ను కాల్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరికొందరు థియేటర్ లోపల డీజే సౌండ్స్, ఇతర సౌండ్స్ చేస్తున్నారు. కొందరు యాంటీ ఫ్యాన్స్ సైతం హాజరు అయ్యి గొడవకు దిగుతున్న సందర్భాలు ఉన్నాయి.
రీ రిలీజ్‌తో థియేటర్ డ్యామేజ్...
థియేటర్లు పదే పదే డ్యామేజ్ అవుతున్నాయి. రీ రిలీజ్ సమయంలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా కూడా అభిమానం పేరుతో రచ్చ చేస్తున్నారు. చాలా థియేటర్ల సీట్లు నాశనం అయ్యాయి. కొన్ని థియేటర్ల స్క్రీన్‌లను పాడు చేశారు. మొత్తానికి థియేటర్ల యాజమాన్యాలు రీ రిలీజ్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది. తాజాగా డార్లింగ్ రీ రిలీజ్ సందర్భంగా క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ఘటనతో థియేటర్ల యాజమాన్యాలు మరింతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని సినిమాకు సంబంధించిన పాటలను ప్లే చేయలేదు అంటూ థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగాడు. ఆ తర్వాత జరిగిన ఘటన నేపథ్యంలో అతడిపై థియేటర్ సిబ్బంది దాడికి దిగారు. దాంతో ఇతర అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ సిబ్బందిపై దాడి చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం రసాభాసాగా మారింది. ప్రస్తుతం ఇదే విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సింగిల్ స్క్రీన్స్ లు ప్రమాదంలో...
సింగిల్ స్క్రీన్ లలో అభిమానం పేరుతో కొందరు చేస్తున్న రచ్చ కారణంగా చాలా పెద్ద నష్టం జరుగుతోంది. అగ్ని ప్రమాదాలు జరగడం, థియేటర్ లోని సీట్లు నాశనం కావడం, స్క్రీన్‌లు పాడు కావడం వంటి కారణాల వల్ల రీ రిలీజ్ లకు సింగిల్ స్క్రీన్ లు ఆసక్తి చూపడం లేదు. పెద్ద హీరోల కొత్త సినిమాల సమయంలో సైతం ఇలాంటి జరుగుతున్నాయి. అయితే అప్పుడు ఎక్కువ వసూళ్లు వస్తాయి, క్యాంటీన్ నడుస్తుంది కనుక పెద్దగా ఇబ్బంది లేదు. రీ రిలీజ్ సమయంలో హౌస్ ఫుల్ కాకున్నా షో వేయాల్సి ఉంటుంది. దాంతో థియేటర్ల యాజమాన్యాలు అసలు రీ రిలీజ్‌లకు స్క్రీన్ లు ఇవ్వడం అవసరమా అన్నట్లుగా పరిస్థితి మారింది. కొత్త సినిమాలు వరుసగా రావడం లేదు, వచ్చిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఆ కారణాల వల్ల కొందరు థియేటర్ల యాజమాన్యాలు రీ రిలీజ్‌కి థియేటర్లు ఇస్తున్నారు తప్ప వారికి అస్సలు ఇష్టం లేదు అనేది కొందరి మాట. అభిమానులు హద్దుల్లో ఉండకుంటే ముందు ముందు సింగిల్ స్క్రీన్స్ లో రీ రిలీజ్ లు కష్టం అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
