టాలీవుడ్ పర్సంటేజ్ వివాదం: ముగింపు దిశగా అడుగులు.. అసలేం జరగబోతోంది?
తెలుగు చిత్ర పరిశ్రమను గత కొన్ని వారాలుగా కుదిపేస్తున్న `పర్సంటేజ్ సిస్టమ్` వివాదం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
By: Sivaji Kontham | 27 May 2026 4:34 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమను గత కొన్ని వారాలుగా కుదిపేస్తున్న `పర్సంటేజ్ సిస్టమ్` వివాదం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నైజాం (తెలంగాణ) ఫిల్మ్ ఛాంబర్ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఆచరణాత్మక రూపం దాల్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ వివాదంలో ప్రధానంగా టికెట్ ధరల పెంపుదల, థియేటర్ల కమిషన్ల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఒకవేళ సినిమాలకు అదనపు టికెట్ ధరల పెంపు లభిస్తే, ఆ అదనపు రేట్లపై థియేటర్ల యజమానులకు 7.5 శాతం కమిషన్ లభిస్తుంది. ఒకవేళ ప్రభుత్వాల నుంచి రేట్ల పెంపు రాకపోతే.. పాత పద్ధతిలోనే (ఓల్డ్ రేషియో) లావాదేవీలు కొనసాగుతాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర అధ్యయనం చేసి.. పరిష్కారాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ మరో నెలరోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ సినీ మార్కెట్‌లో ఈ పర్సంటేజ్ సమస్య పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. ఏపీలోని థియేటర్ల యాజమాన్యాలతో నిర్మాతల ఒప్పందాలు ఇప్పటికే దాదాపు ఖరారైపోయాయి. అక్కడ ఆటోపైలట్ మోడ్‌లో అనుమతులు వస్తుండటంతో గందరగోళానికి తెరపడింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే... ఈ పర్సంటేజ్ వివాదం వల్ల పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.... పెద్ద హీరోల సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే నైజాం ఎగ్జిబిటర్ల విభాగంలో ఉన్న అంతర్గత భేదాభిప్రాయాలను తొలగించి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు నేడు (మే 27న) నైజాం ఎగ్జిబిషన్ రంగానికి చెందిన ముఖ్య పెద్దల అత్యవసర సమావేశం కూడా జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే ఈ కొత్త పర్సంటేజ్ విధానంపై సోషల్ మీడియాలో సామాన్య ప్రేక్షకులు, చిన్న నిర్మాతల తరపున కొన్ని తీవ్ర ఆందోళనలు, భిన్నమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిర్మాతలు ఈ పర్సంటేజ్ విధానానికి అంగీకరిస్తే.. ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఎగ్జిబిటర్లు ఇష్టానుసారంగా టికెట్ ధరలను పెంచేసుకునే ప్రమాదం లేదా? అది సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు విశ్లేషకులు సైతం..పెద్ద సినీ కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలకు లేదా పెద్ద బ్యానర్లకు అసలు సమస్యే ఉండదు. కానీ ఈ సరికొత్త పర్సంటేజ్ మోడల్ కనుక అమలులోకి వస్తే చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు బతికేది ఎలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త నిబంధనల వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం గగనంగా మారుతుందనే భయాలు పరిశ్రమలో నెలకొన్నాయి. థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెద్ద సినిమాల వైపే మొగ్గు చూపుతాయని దీనివల్ల కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు థియేటర్ల కొరతను ఎదుర్కొంటాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. పెద్ద తలకాయలు తమ వ్యాపారాలను చక్కబెట్టుకుంటున్న ఈ తరుణంలో రానున్న కమిటీ నివేదిక చిన్న సినిమాల మనుగడను, సామాన్య ప్రేక్షకుల ప్రయోజనాలను ఏ మేరకు కాపాడుతుందో వేచి చూడాలి.
