Begin typing your search above and press return to search.

ప్చ్‌! క‌ల‌గానే విశాఖ ఫిలింసిటీ నిర్మాణం!

ఆ దిశ‌గా ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేస్తున్న తాజా ప్ర‌య‌త్నం అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 2:30 PM GMT
ప్చ్‌! క‌ల‌గానే విశాఖ ఫిలింసిటీ నిర్మాణం!
X

రాజు గారే త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? దేశాన్ని లేదా రాష్ట్రాన్ని ఫ‌లానా విధంగా అభివృద్ధి చేయాలి అన్న త‌ప‌న ఉండాలే కానీ ఆ దిశగా ప్ర‌య‌త్నాలు చేయాలే కానీ, ఎందుకు అభివృద్ధి జ‌ర‌గ‌దు. ప్ర‌భుత్వంలో ఉత్సాహం ఉండాలే కానీ ప్ర‌తిదీ సాధ్య‌మే. ఆ దిశ‌గా ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేస్తున్న తాజా ప్ర‌య‌త్నం అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. యుపి సీఎం యోగి నిర్ణ‌యాలు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను క‌లిగిస్తున్నాయి.

ఇన్నాళ్లుగా బాలీవుడ్ కి ముంబై కీల‌క కేంద్రంగా ఉంది. కానీ దాని ప్ర‌భ‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ కి విస్త‌రించాలంటే 1000 ఎక‌రాల్లో భారీ ఫిలింస్టూడియోని నిర్మించాల‌ని యుపి ప్ర‌భుత్వం భావించింది. దీనికోసం దిగ్గ‌జాల నుంచి బిడ్ లు కోరింది. ఇప్ప‌టికే బిడ్డింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఈ వేలంలో అక్ష‌య్, బోనిక‌పూర్, భూష‌ణ్ కుమార్, కేసీ బొకాడియా లాంటి దిగ్గ‌జాలు పాల్గొన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే రీజియన్‌లో 1000 ఎక‌రాల్లో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్ట్ ప‌ని ప్రారంభ‌మైంది. తొలి విడ‌త‌గా సెక్టార్ 21లో 230 ఎక‌రాల్లో దీనిని నిర్మించ‌నున్నారు. ఎట్ట‌కేల‌కు బిడ్డింగ్ తో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వ‌చ్చింది.

అయితే అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ‌- ఆంధ్రాగా విడిపోయాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కూడా ఫిలింసిటీల నిర్మాణం కోసం దిగ్గ‌జ సినీపెద్ద‌ల నుంచి ఉత్సాహం వ్య‌క్త‌మైంది. అప్ప‌ట్లోనే ఖిలాడీ అక్ష‌య్ కుమార్, క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ వంటి వారు నేరుగా ఏపీ ప్ర‌భుత్వంతో స్టూడియో నిర్మాణం కోసం సంప్ర‌దింపులు జ‌రిపార‌న్న ప్ర‌చారం కూడా సాగింది. స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ స‌హా చెన్నై ఏవీఎం స్టూడియోస్ ప్ర‌తినిధులు కూడా బీచ్ సొగ‌సుల విశాఖ ప‌ట్నంలో భారీ స్టూడియోల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాదించార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఏపీఎఫ్‌డిసి అందుకు సంబంధించిన వివ‌రాల‌ను మీడియాలో ప‌బ్లిష్ చేయించింది. కానీ ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ్వ‌డం, అటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం మారిపోవ‌డంతో ఆ ప్రాజెక్టుల‌న్నీ చచ్చుబ‌డిపోయాయి.

కానీ ఆ త‌ర్వాత వ‌చ్చిన వైకాపా ప్ర‌భుత్వం కూడా విశాఖ‌ప‌ట్నం ప‌రిస‌రాల్లో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి సానుకూలంగా స్పందించింది. ప‌లువురు సినీప్ర‌ముఖుల‌తో మంత‌నాలు కూడా సాగించింది. కానీ ప‌రిస్థితులు ఎందుక‌నో త‌ల్ల‌కిందుల‌య్యాయి. విశాఖ టూరిస్ట్ న‌గ‌రం గ‌నుక ఇక్క‌డ ప‌రిస‌రాల్లోనే వంద‌ల ఎక‌రాలు అందుబాటులో ఉన్న చోట ఫిలింస్టూడియోల అభివృద్ధి చేప‌ట్టాల‌ని కూడా ప్ర‌తిపాదించారు. కానీ ఇవ‌న్నీ గాలికి కొట్టుకుపోయాయి. విశాఖ ఫిలింసిటీ నిర్మాణం అనేది క‌ల‌గానే మిగిలిపోయింది. రాజ‌ధాని నిర్మాణంపై స్ప‌ష్ఠత లేక‌పోవ‌డం, సుదీర్ఘ కాలం కోర్టు కేసుల పెండింగులు, క‌రోనా విల‌యం, ఆర్థిక దుస్థితి వ‌గైరా అంశాలు ఏపీలో అభివృద్ధిని కుంటుప‌డేలా చేసాయి. ఇదే క్ర‌మంలో ప‌రిశ్ర‌మ‌ల రాక కానీ, టూరిజం అభివృద్ధి కోసం చేసిన ప్ర‌య‌త్నాలు కానీ స‌ఫ‌లం కాలేదు. ఇక ఏపీలో కొత్త‌ ఫిలింఇండ‌స్ట్రీ గురించి ఆలోచించే సానుకూల‌ ప‌రిస్థితి నాయ‌కుల్లో క‌నిపించ‌లేదు.