Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ సినిమా కారణంగా 'ఢిల్లీ ఫైల్స్' వాయిదా..!

ఢిల్లీ ఫైల్స్ సినిమాను రూపొందిస్తున్న వివేక్ అగ్నిహోత్రి గతంలో ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమాను రూపొందించి సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   17 April 2025 4:30 PM
ఎన్టీఆర్‌ సినిమా కారణంగా ఢిల్లీ ఫైల్స్ వాయిదా..!
X

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ఢిల్లీ ఫైల్స్‌' చిత్రాన్ని నిన్న మొన్నటి వరకు ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ చెబుతూ వచ్చారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ది ఢిల్లీ ఫైల్స్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, అనుకున్నట్లుగా సినిమాను విడుదల చేసేందుకు అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ మేకర్స్ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం బాలీవుడ్‌ నుంచి రాబోతున్న మరో పెద్ద సినిమా 'వార్‌ 2' అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వార్ 2తో పోటీగా ఢిల్లీ ఫైల్స్ విడుదల చేయడం కచ్చితంగా తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయానికి మేకర్స్ వచ్చారట.

ఢిల్లీ ఫైల్స్ సినిమాను రూపొందిస్తున్న వివేక్ అగ్నిహోత్రి గతంలో ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమాను రూపొందించి సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా పలు ప్రముఖ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో, అంతర్జాతీయ స్థాయి అవార్డు వేడుకల్లోనూ చోటు సొంతం చేసుకుంది. పలు అవార్డులకు నామినేట్‌ అయిన కశ్మీర్ ఫైల్స్ సినిమా మొత్తం దేశ రాజకీయాలను కుదిపేసిన విషయం తెల్సిందే. అందుకే ఢిల్లీ ఫైల్స్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా వివేక్ అగ్నిహోత్రి సినిమాలు చేస్తాడు అనే విమర్శలు ఉన్నాయి. అయినా కూడా తాను అనుకున్నది అనుకున్నట్లు తీసుకుంటూ వెళ్తున్నాడు.

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత వివేక్ అగ్నిహోత్రి నుంచి 'ది వాక్సిన్‌ వార్‌' సినిమా వచ్చింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ వసూళ్లు అంతగా రాలేదు. కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన ది వాక్సిన్‌ వార్‌ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్న దర్శకుడు వివేక్‌ ది ఢిల్లీ ఫైల్స్ సినిమాను కమర్షియల్‌ యాంగిల్‌లో రూపొందించాడని తెలుస్తోంది. అంతే కాకుండా ఎప్పటిలాగే సినిమాలో వివాదాస్పద అంశాలను సైతం ఆయన జొప్పించాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీ ఫైల్స్ సినిమాతో రాజకీయంగా పెను సంచలనం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఆందోళనలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ది తాష్కెంట్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి వివాదాస్పద సినిమాల జర్నీ మొదలైంది. ఆయన ఇప్పటికే చాలా సినిమాల్లో వివాదాస్పద అంశాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఒక మోస్తరు వరకు ఆయన హద్దులు దాటుతాడు అంటూ కొందరు అంటే, కొందరు మాత్రం ఒక వర్గంకు పూర్తి వ్యతిరేకంగా ఆయన సినిమాలు ఉంటాయని, ఒక వర్గంను పూర్తిగా వెనకేసుకు వచ్చే విధంగా ఆయన సినిమాలు ఉంటాయని వాదించే వారు ఉన్నారు. ఇప్పుడు ది ఢిల్లీ ఫైల్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి షాక్‌ ఇస్తూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా విడుదల కారణంగానే ఢిల్లీ ఫైల్స్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది దర్శకుడు నోరు విప్పితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. వాయిదా పడ్డ ఢిల్లీ ఫైల్స్ సినిమాను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.