Begin typing your search above and press return to search.

తెలుగు సినీ పరిశ్రమలో 'పర్సంటేజ్' సెగ.. గిల్డ్‌లో ముసలం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల ప్రయోజనాలే పరమావధిగా ఏర్పడిన `యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్` (ఏటిఎఫ్‌పిజి) లో తొలిసారిగా నిలువునా చీలిక వచ్చింది.

By:  Sivaji Kontham   |   9 April 2026 10:38 AM IST
తెలుగు సినీ పరిశ్రమలో పర్సంటేజ్ సెగ.. గిల్డ్‌లో ముసలం!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల ప్రయోజనాలే పరమావధిగా ఏర్పడిన `యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్` (ఏటిఎఫ్‌పిజి) లో తొలిసారిగా నిలువునా చీలిక వచ్చింది. నిజాం ప్రాంతంలోని కొన్ని థియేటర్లు ఏప్రిల్ 30 నుండి కేవలం `పర్సంటేజ్ సిస్టమ్` (వసూళ్లలో వాటా) పద్ధతిలోనే నడుస్తామని ప్రకటించడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిల్డ్‌కు చెందిన 16 మంది నిర్మాతలు ఉమ్మడిగా లేఖ రాయగా.. కీలక వ్యక్తులైన దిల్ రాజు, సునీల్ నారంగ్ , అల్లు అరవింద్ ఈ నిరసనలో పాలుపంచుకోకపోవడం గమనార్హం. ఎగ్జిబిటర్లు తమ మనుగడ కోసం ఈ మార్పు అవసరమని వాదిస్తుంటే.. ఇది కేవలం పెద్ద పంపిణీదారుల ఆధిపత్య పోరాటమని అంటున్నారు.

ఈ పర్సంటేజ్ సిస్టమ్ అమలుపై నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దె పద్ధతి (రెంట‌ల్ విధానం) పోయి వాటా పద్ధతి వస్తే తమ ఆదాయం గణనీయంగా తగ్గుతుందని వారు భయపడుతున్నారు. దిల్ రాజు తన ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్` విడుదలకు ముందే ఈ విధానాన్ని సమర్థించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పంపిణీదారులు సినిమా బాగున్నప్పుడు అద్దె కట్టి.. వసూళ్లు తగ్గగానే పర్సంటేజ్ పద్ధతికి మారుతూ ఎగ్జిబిటర్లను నష్టపరుస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ అంతర్గత విభేదాల వల్ల గిల్డ్ రెండు వర్గాలుగా విడిపోవడమే కాకుండా.. భవిష్య‌త్‌లో వ‌స్తున్న‌ పెద్ద సినిమాల విడుదలపై అనిశ్చితి నెలకొంది.

ఈ ఆదాయ పంపిణీ వివాదం కేవలం పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా సామాన్య ప్రేక్షకులపై కూడా తీవ్ర ప్రభావం చూపేలా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ పర్సంటేజ్ సిస్టమ్ వల్ల నిర్మాతలకు లాభాలు తగ్గితే.. వారు ఆ లోటును పూడ్చుకోవడానికి టికెట్ ధరలను మరింత పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యులకు సినిమాను మరింత దూరం చేస్తుంది. అంతేకాకుండా.. థియేటర్ల వద్ద ఆశించిన ఆదాయం రాదని భావిస్తే.. నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీ వేదికలకే పరిమితం చేయవచ్చు.. ఇది క్రమంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతకు దారితీస్తుంది.

ఒకవేళ ఈ వివాదం సద్దుమణగకపోతే సినిమాల బడ్జెట్ .. మేకింగ్ క్వాలిటీపై కూడా దీని ప్రభావం పడుతుంది. థియేట్రికల్ రెవెన్యూ తగ్గుతుందనే భయం నిర్మాణ సంస్థల్లో ఖర్చును తగ్గించుకోవాలనే ఆలోచనను కలిగిస్తుంది. మరోవైపు.. ప్రాంతీయ మార్కెట్లలో భిన్నమైన నిబంధనలు ఉండటం వల్ల సినిమా పంపిణీ వ్యవస్థలో గందరగోళం ఏర్పడే ఛాన్సుంటుది. పంపిణీదారుల ఆధిపత్య పోరాటాల మధ్య సినిమా కంటెంట్ నాణ్యత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటి వారు. వీరిద్దరి మధ్య సమన్వయం లోపిస్తే అది మొత్తం సినిమా ఇకోసిస్టమ్‌కే ముప్పుగా పరిణమిస్తుంది. ప్రస్తుతం ఉన్న అద్దె పద్ధతికి .. ప్రతిపాదిత పర్సంటేజ్ సిస్టమ్‌కు మధ్యేమార్గంగా ఒక `హైబ్రిడ్ మోడల్`ను రూపొందించుకోవడమే పరిశ్రమ మనుగడకు శ్రేయస్కరం. ఈ సంక్షోభం త్వరగా పరిష్కారం కాకపోతే... ``హర్మోజ్ జ‌ల సంధి నిర్భంధం మోడ‌ల్`` లో.. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్థికంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.