ఓజీ హైప్.. ప్లస్సా మైనస్సా?
By: Tupaki Desk | 4 Sept 2025 8:00 AM ISTవిడుదలకు ముందు భారీ హైప్ వస్తుంది. తీరా చూస్తే సినిమాలో విషయం ఉండదు. ఎన్నో ఆశలతో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉస్సూరుమంటూ బయటికి వస్తారు. ప్రోమోలు చూసి ఏదో ఊహించుకుని వెళ్లిన ఆడియన్స్‌కు అక్కడున్న కంటెంట్ చూసి తాము మోసపోయిన భావన కలగుతుంది. ఇలా ఎన్నో సినిమాల విషయంలో జరిగింది. గత నెల ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వచ్చిన రెండు భారీ చిత్రాలూ ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చాయి.
ఇటు కూలీ, అటు వార్-2 రెండూ అంచనాలను అందుకోలేకపోయాయి. అందులోనూ విపరీతమైన హైప్ తెచ్చుకున్న కూలీ చిత్రం కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. అంతకుముందు విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ సైతం హైప్‌కు, కంటెంట్‌కు పొంతన లేనిదే. విజువల్స్, మ్యూజిక్ చూసి ఏదో ఊహించుకుని వెళ్తే.. నిరాశ తప్పలేదు. ఇలా వరుసగా ఎదురు దెబ్బలు తగిలి విసిగిపోయి ఉన్నారు ప్రేక్షకులు. ఇలాంటి టైంలో అందరి ఆశలూ ఓజీ మీదే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత హైప్ మరే సినిమాకూ రాలేదు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చాక ఇంత బజ్ దేనికీ క్రియేట్ కాలేదు.
అయితే భారీ హైప్ మధ్య వచ్చిన చిత్రాలు ఇస్తున్న షాకులు చూశాక ఓజీ అయినా ప్రేక్షకుల అంచనాలను నిలబెడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజయ్యే ప్రతి కంటెంట్ వావ్ అనే అనిపిస్తోంది. పోస్టర్లు.. రెండు పాటలు.. రెండు గ్లింప్స్.. ఇలా ప్రతిదీ ఆకర్షణీయంగా ఉంది. పవన్ కళ్యాణ్ లుక్స్.. స్వాగ్.. స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా లేవు. లేటెస్ట్ గ్లింప్స్‌లో విలన్ పాత్రధారి ఇమ్రాన్ హష్మి.. పవర్ స్టార్‌కు దీటుగా కనిపించాడు.
సినిమా మీద ఇంకా అంచనాలను పెంచేశాడు. ఈ గ్లింప్స్‌లో విజువల్స, బీజీఎం వేరే లెవెల్ అని చెప్పాలి. ఎప్పుడెప్పుడు సెప్టెంబరు 25 వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ మరింత ఉత్కంఠగా ఎదురు చూసేలా చూసింది లేటెస్ట్ గ్లింప్స్. ఇక ట్రైలర్ కూడా ఇదే రేంజిలో ఉంటే హైప్‌ను తట్టుకోవడం కష్టమే. ఈ హైప్ వల్ల భారీ ఓపెనింగ్స్ వస్తాయి కానీ.. అది ఒకింత మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అంచనాలు మరీ పెరిగిపోతే.. కంటెంట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా ప్రేక్షకులు నిరాశ చెందుతారు. ఇప్పటికే ఈ హైపెక్కించే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు చాలా ఎదురు దెబ్బలు తిని విసిగిపోయి ఉన్నారు. ఓజీ అయినా హైప్‌ను మ్యాచ్ చేసేలా ఉండి ప్రేక్షకుల కడుపు నింపుతుందేమో చూడాలి.
