పెద్ది పంచాయతీలో పెద్ద ట్విస్ట్.. మళ్ళీ మొదటికే ఎగ్జిబిటర్స్ ఇష్యూ..
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు ముందే ఆ వివాదం కొత్త మలుపు తిరిగింది.
By: M Prashanth | 23 May 2026 6:58 PM ISTటాలీవుడ్ లో గత కొంతకాలంగా సాగుతున్న ఎగ్జిబిటర్స్- నిర్మాతల మధ్య పర్సంటేజ్ వర్సెస్ రెంటల్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు ముందే ఆ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇకపై తెలంగాణలో సినిమాలను పాత రెంటల్ విధానంలో కాకుండా, పర్సంటేజ్ విధానంలో మాత్రమే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. దీంతో పెద్ది విడుదల, టికెట్ ధరల పెంపు అంశాలపై కన్ఫ్యూజన్ నెలకొంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో శనివారం సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్.. గతంలో హరి హర వీరమల్లు విడుదల సమయంలో తమ సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే సంవత్సరం గడిచినా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ప్రతి సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్మాతలు కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక థియేటర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఒకప్పుడు మంచి ఆదాయం ఇచ్చిన థియేటర్ వ్యవస్థ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లిపోయిందని, దాదాపు 120 మంది థియేటర్ యజమానులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు నిర్మాతలకు ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కులు సహా పలు మార్గాల్లో ఆదాయం వస్తోందని, కానీ ఎగ్జిబిటర్లకు మాత్రం థియేటర్ల కలెక్షన్లే ప్రధాన ఆధారమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పర్సంటేజ్ విధానం అమలులో ఉండగా, తెలంగాణలో మాత్రం పాత రెంటల్ విధానం కొనసాగడం సరైంది కాదని వారు అభిప్రాయపడ్డారు.
థియేటర్ల గ్రేడింగ్ కూడా సౌండ్ సిస్టమ్, ఏసీల ఆధారంగా కాకుండా, వాస్తవ కలెక్షన్లను బట్టి ఉండాలని డిమాండ్ చేశారు. పర్సంటేజ్ విధానం ద్వారా మాత్రమే థియేటర్ల మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. పెద్ది సినిమాపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. మొదట ఆ చిత్రాన్ని వివాదం నుంచి మినహాయించాలని భావించామని, కానీ సమస్యను ఇప్పుడు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మళ్లీ తమను పట్టించుకోరనే భావనతో పెద్దిని కూడా పర్సంటేజ్ శ్లాబ్ లో చేర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ వ్యవహార శైలిపై కూడా ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మే 19 నుంచి 23 వరకు వరుసగా డ్రాఫ్ట్‌లు మారుస్తూ, ఇండస్ట్రీ మొత్తం ఒకే నిర్ణయానికి వచ్చిందన్న భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని వర్గాల నిర్మాతల ప్రయోజనాల కోసమే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ పరిణామాల మధ్య తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. థియేటర్ల మనుగడ కోసం కొత్త కమిటీ సమిష్టిగా పని చేస్తుందని ఎగ్జిబిటర్లు తెలిపారు. మొత్తానికి పెద్ది విడుదలకు ముందే మొదలైన ఆ వివాదం.. టాలీవుడ్ లో మరోసారి ఎగ్జిబిటర్స్- నిర్మాతల మధ్య విభేదాలను బయటపెట్టింది. రాబోయే రోజుల్లో ఆ సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
