సూర్య46 జానర్‌పై డైరెక్టర్ క్లారిటీ!
ప్రస్తుతం సూర్య46కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 July 2025 1:20 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు చేస్తున్న సినిమాలపై ఆశలు పెట్టుకోవడం, ఆ ఆశలు అడియాశలవుతుండటంతో సూర్యకు చాలా కాలంగా సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలింది. రీసెంట్ గా వచ్చిన రెట్రో సినిమా సూర్య కెరీర్ ను మార్చేస్తుందనుకుంటే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది.
దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంచి హిట్ అందుకోవాలని తన తర్వాతి సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు సూర్య. వెంకీ అట్లూరికి డైరెక్టర్ గా మంచి హిట్లున్నాయి. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్న వెంకీ ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సూర్య కెరీర్లో 46వ చిత్రంగా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం సూర్య46కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సూర్యతో వెంకీ చేస్తున్న సినిమా ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. ఈ విషయాన్ని రీసెంట్ గా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను కథ చెప్పే టైమ్ లో సూర్యకు మూడు వేర్వేరు స్క్రిప్టులను వినిపించానని వెంకీ ఈ సందర్భంగా వెల్లడించారు.
సూర్యకు తాను ఓ బయోపిక్, ఓ హీస్ట్ థ్రిల్లర్ మరియు ఓ ఫ్యామిలీ డ్రామా స్క్రిప్ట్స్ ను చెప్పానని, ఆ మూడు కథల్లో సూర్య ఫ్యామిలీ డ్రామాను సెలెక్ట్ చేసుకున్నారని, ఈ సినిమా సూర్యకు ఓ మంచి కమర్షియల్ సినిమా అవుతుందని వెంకీ వివరించారు. అయితే ఇది తెలిశాక కొందరు నెటిజన్లు సూర్య డెసిషన్ ను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సూర్య 46 కూడా ఫ్లాప్ అయితే దానికి ప్రధాన కారణం సూర్యనే అవుతారని, హీస్ట్ థ్రిల్లర్, బయోపిక్ కాకుండా సూర్య ఫ్యామిలీ డ్రామాను సెలెక్ట్ చేసుకోవడం పట్ల కూడా వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా టైర్1 హీరోల లిస్టులో ఉండే సూర్య ఇప్పుడు వరుస ఫ్లాపుల కారణంగా తన మార్కెట్ ను చాలా వరకు కోల్పోయారు. ప్రస్తుతం సూర్య చేస్తున్న కరుప్పు, సూర్య46 సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో హిట్టైతే తప్ప ఆయన తన మార్కెట్ ను తిరిగి పొందే వీలుండదని ట్రేడ్ నిపుణులంటున్నారు. మరి ఈ రెండు సినిమాలతో అయినా సూర్య వరుస హిట్లు అందుకుని తన పూర్వ వైభవాన్ని దక్కించుకుంటారేమో చూడాలి.
