సూర్యకు ఇక వారే హిట్టివ్వాలా?
ఎంత ప్రకాశించిన చందమామకైనా అప్పుడప్పుడు రాహువుతో ఇబ్బందులు తప్పవు. హీరో సూర్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు.
By: Tupaki Desk | 2 May 2025 2:30 PMఎంత ప్రకాశించిన చందమామకైనా అప్పుడప్పుడు రాహువుతో ఇబ్బందులు తప్పవు. హీరో సూర్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. కమల్ హాసన్, విక్రమ్‌ల తరువాత కోలీవుడ్‌లో విలక్షణమైన కథలకు, పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరో సూర్య. సూరారైపోట్రు, జైభీమ్ సినిమాలతో వరుస విజయాల్ని దక్కించుకున్న సూర్య గత మూడేళ్లుగా ఆ స్థాయి సక్సెస్‌లని దక్కించుకోలేకపోతున్నాడు. గతంలో విలక్షణమైన కథల్ని ఎంచుకుని విజయాల్ని దక్కించుకున్న సూర్య గత కొంత కాలంగా తన మార్కుని చూపించలేకపోతున్నాడు.
పాండిరాజ్‌తో చేసిన `ఈటీ` అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తే రూ. 60 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అంటే సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాలేదంటే ఆ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత రెండేళ్లకు పేనే ఎదురు చూసి సూర్య చేసిన సినిమా `కంగువా`. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుని సూర్యకు షాక్ ఇచ్చింది.
దర్శకుడు శివపై నమ్మకంతో స్టూడియో గ్రీన్, యువీ వారు రూ.300 కోట్లు ఖర్చు చేసినా అందులో 90 కోట్లు మాత్రమే రాబట్టిందంటే `కంగువ` ఎంతటి డిజాస్టర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాణ సంస్థలకు కోలుకోలేని దెబ్బకొట్టిన ఈ సినిమా హీరో సూర్యకు ఊహించని షాక్‌నిచ్చింది. మూడేళ్లు కష్టపడి చేస్తే ఫలితం లేకుండా పోవడంతో సూర్య ఆలోచనలో పడ్డాడు. దీని తరువాత కొత్తగా ట్రై చేయాలని కార్తీక్ సుబ్బరాజ్‌తో తొలి సారి కలిసి `రెట్రో` చేశాడు.
కార్తీక్ సుబ్బరాజ్ ట్రాక్ రికార్డ్, సూర్య కంగువ కారణంగా ఈ సినిమాకు పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. కార్తీక్ అందించిన కథ, కథనాల్లో పస లేకపోవడంతో గురువారం విడుదలైన `రెట్రో` కూడా సూర్యకు షాక్ ఇచ్చింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ కూడా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు సూర్యకు హిట్ ఇచ్చేది వారేనా అనే చర్చ మొదలైంది. ఈ మూవీ తరువాత ఆర్.జె.బాలాజీ డైరెక్షన్‌లో ఓ భారీ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతోంది. ఇక వెట్రిమారన్‌తోనూ `వడివాసల్` చేస్తున్నాడు.
దీని షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది. వీటితో పాటు సూర్య తొలిసారి తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేయబోతున్నాడు. సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నాడు. దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు దర్శకులు సూర్యకు హిట్ లని అందిస్తారని, వీరి సినిమాలతో మళ్లీ సూర్య ట్రాక్‌లోకి రావడం ఖాయం అని అంతా అంటున్నారు. మరి అంతా అనుకున్నట్టే సూర్య మళ్లీ హీరోగా రైజ్ అవుతారో తెలియాలంటే వీరి సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.