Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా లీగ్‌లో మ‌రో త‌మిళ తంబీ

పాన్-ఇండియా అరంగేట్రం కోసం పురాణేతిహాసాల‌లో అత్యంత ప్రాముఖ్య‌త ఉన్న‌ మహాభారత కథను సూర్య ఎంపిక చేస్తున్నాడ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 4:14 AM GMT
పాన్ ఇండియా లీగ్‌లో మ‌రో త‌మిళ తంబీ
X

సౌతిండియన్ సినీప‌రిశ్ర‌మ‌ల్లో ఒక కొత్త ప‌రిణామం అంత‌కంత‌కు ఉత్కంఠ రేపుతోంది. బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కోసం ప్ర‌య‌త్నించే హీరోల సంఖ్య అమాంతం పెరిగింది. స్వ‌భాష‌తో పాటు ఇరుగు పొరుగు భాష‌ల్లోను త‌మ ప‌రిధిని విస్త‌రించుకునేందుకు ఎవ‌రికి వారు త‌మ వంతు ప్ర‌య‌త్నాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ కంటే చాలా ముందే ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విక్ర‌మ్ లాంటి స్టార్లు పాన్ ఇండియా సినిమాల‌తో ఆక‌ట్టుకున్న‌వారి జాబితాలో ఉన్నారు. కానీ రేస్ లోకి ప్ర‌భాస్ రాక‌తో అమాంతం స‌న్నివేశం మారింది. ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి సెట్ చేసిన కొత్త ట్రెండ్ తో దేశంలోని అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో చాలా మంది హీరోలు ఆ రేంజులో పాన్ ఇండియా మార్కెట్ల‌ను కొల్ల‌గొట్టాల‌ని క‌ల‌లు క‌న‌డం మొద‌లైంది.

డార్లింగ్ ప్ర‌భాస్ స‌హ‌చ‌రులైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్ప‌టికే పాన్ ఇండియా రేసింగ్ ని ప‌రాకాష్ఠ‌కు చేర్చారు. ఆర్.ఆర్.ఆర్ స్టార్లుగా చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందుకున్నారు. త‌దుప‌రి వ‌రుస‌గా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ల‌తో వీళ్లంతా ప‌ని చేస్తున్నారు. అలాగే రాజ‌మౌళితో సినిమా చేస్తుండ‌డంతో మ‌హేష్ బాబు కూడా పాన్ ఇండియా రేసులో చేరారు.

మ‌రోవైపు త‌మిళం నుంచి కూడా ఇలాంటి పోటీ ఉత్ప‌న్న‌మైంది. అక్క‌డ చాలాకాలంగా ద‌ళ‌ప‌తి విజ‌య్, త‌ళా అజిత్ స‌హా చాలామంది స్టార్లు పాన్ ఇండియా మార్కెట్ కొల్ల‌గొట్టాల‌ని క‌ల‌లుగంటున్నారు. ఇక త‌మిళం-తెలుగులో అసాధార‌ణ స్టార్‌డ‌మ్ అందుకున్న సూర్య సైతం ఇప్పుడు సౌతిండియాలో ఇత‌ర మార్కెట్ల‌తో పాటు ఉత్త‌రాది మార్కెట్ పైనా క‌న్నేశాడు. త‌న ప‌రిధిని అమాంతం విస్త‌రించేందుకు ధీటైన ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకొస్తున్నాడు. సూర్య తదుపరి బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తూ అమాంతం చ‌ర్చ‌ల్లోకొస్తున్నాడు. త‌న స్థాయిని ఒకేసారి ప‌దింత‌లు పెంచుకునే ప్ర‌య‌త్న‌మిద‌ని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.

ఇటీవ‌ల సూర్య క‌థ‌ల ఎంపిక‌ల తీరు కూడా అమాంతం మారిపోయింది. భాష‌తో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఆద‌ర‌ణ ద‌క్కే డెప్త్ ఉన్న స్క్రిప్టుల వైపు మొగ్గు చూపుతున్నాడు. పాన్-ఇండియా అరంగేట్రం కోసం పురాణేతిహాసాల‌లో అత్యంత ప్రాముఖ్య‌త ఉన్న‌ మహాభారత కథను సూర్య ఎంపిక చేస్తున్నాడ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. రంగ్ దే బసంతి -భాగ్ మిల్కా భాగ్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి పని చేయడానికి సూర్య సిద్ధమవుతున్నాడు. తాత్కాలికంగా ఈ చిత్రానికి `కర్ణ` అనే టైటిల్ ని నిర్ణ‌యించార‌ని కూడా తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కించ‌నున్నార‌ని సమాచారం. సూర్య ప్రస్తుతం కంగువ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. అలాగే ఆకాశం నీ హ‌ద్దురా ఫేం సుధా కొంగరతో ఓ సినిమా చేస్తున్నాడు. బ‌హుశా ఇక‌పై సూర్య ఎంపిక‌ల‌న్నీ పాన్ ఇండియ‌న్ మార్కెట్ ని ట‌చ్ చేసే విధంగా ఉంటాయ‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.