సూర్య 46: అనుకున్నట్లే తెలుగు దర్శకుడితో గ్రాండ్ స్టార్ట్
తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సూర్య 46’ చిత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
By: Tupaki Desk | 19 May 2025 3:23 PM ISTతమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సూర్య 46’ చిత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య 46వ సినిమాగా ఇది రూపొందుతోంది.
సూర్యకు తెలుగు నాట ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘గజిని’ సినిమాతో టాలీవుడ్‌లో భారీ అభిమానులను సంపాదించుకున్న సూర్య, తన కెరీర్‌లో వైవిధ్యమైన కథలు, పాత్రలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల ‘రెట్రో’ సినిమాతో మరో హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు.
వెంకీ అట్లూరి ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి విజయవంతమైన చిత్రాలతో భావోద్వేగ డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది.
ఇక సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ వర్క్ చేస్తున్నాడు, ఆయన గతంలో వెంకీ అట్లూరి సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాతో మరోసారి మాస్, ఎమోషనల్ బీట్స్‌తో మ్యాజిక్ క్రియేట్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది. సినిమా టెక్నికల్ టీమ్‌లో నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు విజేత నవీన్ నూలి ఎడిటర్‌గా, బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది, ఇక 2025 చివరిలోనే సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. సూర్య, వెంకీ అట్లూరి కాంబో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. సూర్య ఈ సినిమాలో స్టైలిష్ లుక్‌తో కనిపించనున్నాడని, వెంకీ అట్లూరి ఎమోషనల్ డ్రామాతో మరోసారి అలరిస్తాడని టాక్ నడుస్తోంది.
