Begin typing your search above and press return to search.

సూర్య‌తో విక్ర‌మ్ పోటీకి దిగుతాడా?

ఎంతో క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌లు పెట్టుకుని సూర్య చేసిన భారీ పాన్ ఇండియన్ సినిమా కంగువా ఘోర ప‌రాజ‌యమైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 April 2025 8:00 AM IST
Retro vs Dhruva Natchathiram
X

ఎంతో క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌లు పెట్టుకుని సూర్య చేసిన భారీ పాన్ ఇండియన్ సినిమా కంగువా ఘోర ప‌రాజ‌యమైన సంగ‌తి తెలిసిందే. కంగువా త‌ర్వాత సూర్య, కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రెట్రో సినిమా చేస్తున్నాడు. రెట్రో పై సూర్య‌తో పాటూ ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. రెట్రో ప్ర‌పంచ వ్యాప్తంగా మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే రెట్రో కు పోటీగా కోలీవుడ్ నుంచి ఇప్పుడు మ‌రో సినిమా కూడా రానుంద‌ని తెలుస్తోంది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ హీరోగా గ‌తంలో ఎప్పుడో తెర‌కెక్కిన ధృవ న‌క్ష‌త్రం సినిమా కూడా మే 1వ తేదీనే రిలీజ్ కానుందని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని కోలీవుడ్ లో గ‌ట్టిగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం, ధృవ న‌క్ష‌త్రం సినిమాకు ఉన్న ఫైనాన్షియ‌ల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియ‌ర్ అయ్యాయ‌ని, సినిమాను మే 1న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే ధృవ న‌క్షత్రం, రెట్రో రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌టం ఖాయం.

అయితే సూర్య‌, విక్ర‌మ్ గ‌త ప‌దేళ్లుగా బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ అందుకున్న‌ది లేద‌ని, మార్కెట్ ప‌రంగా ఇద్ద‌రూ ఒకే పొజిష‌న్ లో ఉన్నార‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లపై ప‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ రెండింటిలో రెట్రో మేక‌ర్స్ త‌మ రిలీజ్ డేట్ ను ఎప్పుడో అనౌన్స్ చేశార‌ని, అందుకే పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని ధృవ న‌క్ష‌త్రం టీమ్ కు నెటిజ‌న్లు సూచిస్తున్నారు.

కోలీవుడ్ లో వార్త‌లైతే వినిపిస్తున్నాయి కానీ ధృవ న‌క్ష‌త్రం రిలీజ్ పై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు. గ‌తంలో కూడా ఈ సినిమా రిలీజ్ గురించి ప‌లు వార్త‌లొచ్చాయి కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేప‌థ్యంలో విక్ర‌మ్ సినిమా నిజంగా మే 1న రిలీజై సూర్య సినిమాతో పోటీ ప‌డుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.