నిర్ణయం అంత సులభం కాదు!
నిర్మాతలకు తమ పెట్టుబడి తిరిగి రావడం ముఖ్యం . కాబట్టి పోటీని తప్పించుకోవాలా లేక సీజన్‌ను వాడుకోవాలా అనే సందిగ్ధంలో వారు ఉంటారు.
By: Srikanth Kontham | 1 May 2026 12:25 PM ISTఒకేసారి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే అది బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. ఇలాంటి సమయంలో ఎవరు వెనక్కి తగ్గాలి? అనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం హీరోలకు అంత సులభమైన విషయం కాదు. నిజానికి సినిమా విడుదల తేదీని ఖరారు చేసే అధికారం చాలా పరిమితంగానే హీరోల చేతుల్లో ఉంటుంది. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాతకే ఆ సినిమాపై సర్వహక్కులు ఉంటాయి . కాబట్టి లాభనష్టాలను బేరీజు వేసుకుని నిర్మాత తీసుకునే నిర్ణయానికే హీరోలు కూడా తలొగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య -విక్రమ్ సినిమాల విడుదల విషయంలో సరిగ్గా ఇలాంటి సస్పెన్సే నెలకొంది.
సూర్య నటించిన `కరుప్పు` మే 14 న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు చియాన్ విక్రమ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న `ధ్రువ నక్షత్రం` చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హీరోలిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదు. ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలు వస్తే థియేటర్ల కేటాయింపులో సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల రెండు సినిమాల వసూళ్లపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే హీరోలు పరోక్షంగా ఒకరితో ఒకరు చర్చించుకున్నా? అంతిమ నిర్ణయం మాత్రం పంపిణీదారులు , నిర్మాతల ఆర్థిక సమీకరణాలపైనే ఆధారపడి ఉంటుంది.
నిర్మాతలకు తమ పెట్టుబడి తిరిగి రావడం ముఖ్యం . కాబట్టి పోటీని తప్పించుకోవాలా లేక సీజన్‌ను వాడుకోవాలా అనే సందిగ్ధంలో వారు ఉంటారు. విక్రమ్ నటించిన `ధ్రువ నక్షత్రం` అనేక న్యాయపరమైన , ఆర్థిక ఇబ్బందులను దాటుకుని ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. మద్రాస్ హైకోర్టు కూడా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మే నెలలోనే దీనిని తీసుకురావాలని దర్శకుడు గౌతమ్ మీనన్ కృత నిశ్చయంతో ఉన్నారు. అదే సమయంలో సూర్య `కరుప్పు` కూడా ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుంది.
ఈ రెండు చిత్రాలు వేర్వేరు జానర్లకు చెందినా? బాక్సాఫీస్ వద్ద ఒకేసారి తలపడితే థియేటర్ల వద్ద సందడి పెరిగినా? వసూళ్ల పంపకంలో గందరగోళం తప్పదు. పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు హీరోలు స్వచ్ఛందంగా తమ సినిమాలను వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రెండు సినిమాల వెనుక వేర్వేరు ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నాయి. విక్రమ్ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం కాగా, సూర్య సినిమా సమ్మర్ సీజన్‌ను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.
`కరుప్పు` కూడా డిలే ప్రాజెక్ట్ గానే ఉంది. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని రెడీ అవుతున్నారు. మరి ముందుగా ఏహీరో వస్తాడు? అన్నది చూడాలి. సినిమా రిలీజ్ అనేది కేవలం డేట్ల సర్దుబాటు మాత్రమే కాదు. అదొక భారీ బిజినెస్ గేమ్. హీరోలు ఎంతటి ఆప్తమిత్రులైనా? బాక్సాఫీస్ వద్ద మాత్రం వారి సినిమాలు వ్యాపార వస్తువులే. నిర్మాత నిర్ణయమే ఫైనల్ కాబట్టి హీరోలు ఆ నిర్ణయాన్ని స్వాగతించి ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది.
