2026లో సూర్య ఫుల్ స్పీడ్!
కమల్ హాసన్, విక్రమ్‌ల తరువాత విలక్షణమైన కథలకు, పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న హీరో సూర్య.
By: Tupaki Desk | 16 Dec 2025 8:00 PM ISTకమల్ హాసన్, విక్రమ్‌ల తరువాత విలక్షణమైన కథలకు, పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న హీరో సూర్య. `గజిని` బ్లాక్ బస్టర్‌తో హీరోగా కమర్షియల్ హిట్‌ని సొంతం చేసుకుని తమిళ, తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకుల్నిని ఆకర్షించాడు. అక్కడి నుంచి విలక్షణ కథలని, పాత్రలని ఎంచుకుంటూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.
అయితే గత కొంత కాలంగా సూర్యని సక్సెస్ అందని ద్రాక్షలా ముప్పుతిప్పలు పెడుతోంది. సూర్య హిట్టు మాట విని దాదాపు ఐదేళ్లు కావస్తోంది. `జైభీమ్` తరువాత సూర్య ఖాతాలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్టు పడలేదు. పాండిరాజ్‌తో చేసిన `ఈటీ`, కార్తీక్ సుబ్బరాజ్‌తో చేసిన `రెట్రో` భారీ డిజాస్టర్లుగా నిలిచి నిరాశపరిచాయి. ఇక పాన్ ఇండియా అంటూ సూర్య ట్రై చేసిన `కంగువ` సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. రూ.300 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టలేక తీవ్ర నష్టాలని మిగిల్చింది.
తమిళ సినిమాని విశ్వ యవనికపై సగర్వంగా నిలబెట్టి మరెన్నో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లకు దారిచూపుతుందని భావిస్తే ఇలా షాక్ ఇచ్చిందేంటని హీరో సూర్య ఆలోచనలో పడ్డాడు. ఈ సినిమా అందించిన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని యంగ్ డైరెక్టర్లతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. 2025 అందించిన చేదు జ్ఞాపకాల్ని పక్కన పెట్టి 2026లో మూడు క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల్ని తనదైన శైలిలో ఎంటర్ టైన్ చేసి బ్లాక్ బస్టర్లని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు.
2026లో సూర్య నటిస్తున్న మూడు సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ముందుగా నటుడు, డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ డ్రామా `కరుప్పు` రాబోతోంది. ఇందులో సూర్య రెండు విభిన్నమైన పాత్రల్లో మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఇది సూర్య నటిస్తున్న 45వ సినిమా. ఇందులో తనకు జోడీగా త్రిష నటిస్తోంది. చాలా ఏళ్ల విరామం తరువాత వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడం, డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు ప్రస్తుతం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఇక ఈ మూవీ తరువాత తన 46వ ప్రాజెక్ట్‌ని తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీతో కాలసి సాయి సౌజన్య నిర్మిస్తోంది. `లక్కీ భాస్కర్` వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడం, అది సూర్యతో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక దీని తరువాత అదే స్పీడుతో సూర్య తన 47వ ప్రాజెక్ట్‌ని కూడా పట్టాలెక్కించేస్తున్నాడు. దీనికి జీతు మాధవన్ దర్శకుడు. ఈ మూడు సినిమాలతో సూర్య బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయబోతున్నాడు. అనుకున్నట్టే ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ సాధిస్తాడా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
