Begin typing your search above and press return to search.

సూర్య సినిమాకు ఏంటీ ఈ ప‌రిస్థితి?

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన భారీ యాక్ష‌న్ డ్రామా `రెట్రో`. 1980వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే ఈ మూవీకి కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

By:  Tupaki Desk   |   26 April 2025 1:30 PM
Suriya Retro No Buz in Tollywood
X

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన భారీ యాక్ష‌న్ డ్రామా `రెట్రో`. 1980వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే ఈ మూవీకి కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కార్తికేయ‌న్ సంతానంతో క‌లిసి సూర్య‌, జ్యోతిక ఈ భారీయాక్ష‌న్ డ్రామాని నిర్మించారు. `జైభీమ్‌`తో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న సూర్య ఆ త‌రువాత ఆ మార్కు స‌క్సెస్‌ని ద‌క్కించుకోలేక‌పోతున్నాడు. పాండిరాజ్‌తో చేసిన `ఈటీ` డిజాస్ట‌ర్ అనిపించుకుని షాక్ ఇచ్చింది.

ఇక కొంత విరామం త‌రువాత శివ డైరెక్ష‌న్‌లో చేసిన పాన్ ఇండియా మూవీ `కంగువ‌` గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మేకింగ్ ద‌గ్గ‌రి నుంచే భారీ స్థాయిలో ప్ర‌చారం చేసిన ఈ ప్రాజెక్ట్ ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్‌కా బాప్ అనిపించి సూర్య‌తో పాటు ద‌ర్శ‌కుడు శివ‌కు షాక్ ఇచ్చింది. వంద కోట్ల‌కు మించి ఖ‌ర్చు చేసినా అందులో స‌గాన్ని కూడా తిరిగి రాబ‌ట్ట‌లేక‌పోయిందంటే ఏ స్థాయిలో డిజాస్ట‌ర్ అనిపించుకుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ మూవీ ఇచ్చిన షాక్‌లో ఉన్న సూర్య ఈసారి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకోవాల‌ని కార్తీక్ సుబ్బ‌రాజ్‌ని న‌మ్ముకున్నాడు. అదే ఇప్పుడు సూర్య‌ని ఇర‌కాటంలో పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో తొలి సారి తెర‌కెక్కిన పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా `రెట్రో`. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ మే 1న త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల కాబోతోంది. టీజ‌ర్‌తో కొంత బ‌జ్‌ని క్రియేట్ చేయ‌గ‌లిగారు. కానీ ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాత ఆ బ‌జ్ కూడా వినిపించ‌డం లేదు. కార‌ణం ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్‌. త‌ను అందించిన క‌థ‌తో రూపొందిన `గేమ్ ఛేంజ‌ర్‌` డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డం తెలిసిందే.

ఇదే ఇప్పుడు సూర్య `రెట్రో`కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో ఈ సినిమాకు తెలుగులో పెద్ద‌గా బ‌జ్ వినిపించ‌డం లేదు. సహ‌జంగా తెలుగులో సూర్య సినిమావ‌స్తోందంటే ఆ హంగామా, హ‌డావిడీ వెరేగా ఉంటుంది. కానీ ఇటీవ‌ల `కంగువా` డిజాస్ట‌ర్ కావ‌డంతో `రెట్రో`కు పెద్ద‌గా బ‌జ్ వినిపంచ‌డంలేదు. అంతే కాకుండా 1980వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే సినిమా కావ‌డం, ట్రైల‌ర్‌లో ఏం చెప్ప‌బోతున్నార‌నే క్లారిటీ లేక‌పోవ‌డంతో `రెట్రో`పై తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించ‌డం లేదు. మ‌రో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండ‌గా `రెట్రో` హ‌డావిడి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో `రెట్రో` టీమ్ ఏం చేస్తోంది. అస‌లు ఈ సినిమా వెన‌క ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తెలుగులో భారీ విజ‌యాల్ని ద‌క్కించుకున్న సూర్య సినిమాకు తెలుగులో ఏంటీ ఇలాంటి ప‌రిస్థితి అని అంతా వాపోతున్నారు.