రెట్రో ముఖ్య ఉద్దేశం అదే!
అయితే ట్రైలర్ లో విషయాన్ని చెప్పకపోయినా ఆ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ...
By: Tupaki Desk | 19 April 2025 2:57 PM ISTస్టార్ హీరో సూర్య ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకుని కంగువ సినిమా చేస్తే ఆ సినిమా కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో సూర్య ఇప్పుడు తన ఆశలన్నింటినీ తన తాజా సినిమా రెట్రోపైనే పెట్టుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన రెట్రో మూవీ మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. మామూలుగా ఏ సినిమా ట్రైలర్ అయినా సరే సినిమాలో ఏముంటుందో, అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నారనే విషయంలో క్లారిటీ ఇస్తుంది. కానీ రెట్రో సినిమా ట్రైలర్ మాత్రం దానికి భిన్నంగా ఉంది. కావాలని మేకర్స్ రెట్రో కథ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమా విషయంలో గందరగోళాన్ని సృష్టించారు.
దీంతో అసలు రెట్రో సినిమా దేని గురించి? కథాంశం ఏంటని మూవీ గురించి, ఆ చిత్ర ట్రైలర్ గురించి అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ట్రైలర్ లో విషయాన్ని చెప్పకపోయినా ఆ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ రెట్రో సినిమా మన జీవితాల ముఖ్య ఉద్దేశాలను తెలపడమే అని వెల్లడించాడు.
తన జీవిత ముఖ్య ఉద్దేశం అగరం ఫౌండేషనే అనుకుంటున్నానని సూర్య ఈ సందర్భంగా తెలిపాడు. ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రేమ, మద్దతు వల్లే తాను ఆ ఫౌండేషన్ ను సరిగా నడపగలుగుతున్నానని చెప్పిన సూర్య, ఇప్పటివరకు ఆ ఫౌండేషన్ నుంచి 8 వేల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యారని, మరెంతో మంది పట్టభద్రులు కానున్నారని చెప్పాడు.
మనందరికీ లైఫ్ లో ఒక్కో ఉద్దేశం ఉంటుందని, రెట్రో లో ప్రేమ, నవ్వు, వార్ లాంటి ఎన్నో లేయర్స్ ఉన్నాయని, మే 1న రిలీజయ్యే తమ సినిమా ప్రతీ ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని సూర్య తెలిపాడు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ శ్రియా శరణ్ ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నాగ వంశీ రిలీజ్ చేస్తున్నాడు.
