'రెట్రో' మూవీ రివ్యూ
తమిళంలో గొప్ప నటుడిగా పేరుండి.. స్టార్ ఇమేజ్ కూడా ఉన్న హీరో సూర్య. అతడికి తెలుగులోనూ మాంచి ఫాలోయింగ్ ఉంది.
By: Tupaki Desk | 1 May 2025 11:22 AMనటీనటులు: సూర్య-పూజా హెగ్డే-జోజు జార్జ్-జయరాం-నాజర్-ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: శ్రేయస్ కృష్ణ
నిర్మాతలు: సూర్య-జ్యోతిక-కార్తికేయన్-రాజశేఖర్
రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
తమిళంలో గొప్ప నటుడిగా పేరుండి.. స్టార్ ఇమేజ్ కూడా ఉన్న హీరో సూర్య. అతడికి తెలుగులోనూ మాంచి ఫాలోయింగ్ ఉంది. కానీ కొన్నేళ్లుగా సూర్యకు సరైన విజయాలే లేవు. విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో అతను చేసిన ‘రెట్రో’ తన ఫ్లాప్ స్ట్రీక్ కు బ్రేక్ పడుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. సూర్య కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ:
పరివేల్ కణ్ణన్ అలియాస్ పారి (సూర్య).. తిలక్ రాజ్ (జోజు జార్జ్) అనే గ్యాంగ్ స్టర్ కొడుకు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అతను గ్యాంగ్ స్టరే అవుతాడు. కానీ ఒక దశ తర్వాత గొడవలన్నీ ఆపేసి.. పాత జీవితానికి స్వస్థి చెప్పేసి.. తాను ప్రేమించిన రుక్మిణి (పూజా హెగ్డే)ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలనుకుంటాడు. కానీ తిలక్ అతణ్ని విడిచిపెట్టడు. ‘గోల్డ్ ఫిష్’ అనే ఒక మాఫియా డీల్ కు సంబంధించిన రహస్యాన్ని చెప్పాలని అతడి వెంట పడతాడు. పారి తన మాట విననందుకు రుక్మిణిని తిలక్ చంపబోతుండగా.. ఎదురు తిరగడంతో తన జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. పారి జైలు పాలై రుక్మిణికి దూరం అవుతాడు. తర్వాత జైలు నుంచి తప్పించుకుని అండమాన్లో రుక్మిణి ఉంటున్న ఒక దీవికి వెళ్తాడు పారి. అక్కడ అతడికి ఎదురైన అనుభవాలేంటి.. రుక్మిణిని అతను తిరిగి దక్కించుకోగలిగాడా.. తిలక్ అతణ్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాడా.. ఇంతకీ ‘గోల్డ్ ఫిష్’ గుట్టేంటి.. చివరికి పారి కథ ఎలాంటి మలుపు తిరిగింది... ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
పెద్ద స్టార్ అయినప్పటికీ.. మిగతా స్టార్ల మాదిరి రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయడు సూర్య. అతను ఎంచుకునే కథల్లో కొత్తదనం ఉంటుంది. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ సాగిపోవడమే సూర్య ప్రత్యేకత. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న దశలో కూడా అతను విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో జట్టు కట్టి రొటీన్ కు భిన్నమైన కథనే ప్రయత్నించడం అభినందనీయం. ‘రెట్రో’ ట్రైలర్ చూస్తే ఇది మనం ఎప్పుడూ చూసే కథ కాదని అర్థమైంది. అదే సమయంలో ట్రైలర్ చూసి కథేంటో డీకోడ్ చేద్దామని చూస్తే అదంత తేలికైన విషయం కాదని అర్థమైంది. కథేంటో తెలియకుండా థియేటర్లో అడుగుపెట్టడంలోనూ ఒక మజా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా పాజిటివ్ గానే తీసుకున్నారు సూర్య అభిమానులు. కానీ విడ్డూరం ఏంటంటే.. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ‘రెట్రో’ సినిమా మొత్తం చూసినా కూడా ఈ కథ మీద ఒక అంచనా రాదు. అలా అని కార్తీక్ అంత ఇంటలిజెంట్ గా కథను నడిపించేశాడని.. అద్భుతాన్ని ఆవిష్కరించేశాడని కాదు. డిఫరెంట్ టేకింగ్ పేరుతో హంగామా చేయడం తప్పితే ఇందులో విషయం ఏమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే కొత్తదనం పేరుతో చేసిన వ్యర్థ ప్రయత్నం.. రెట్రో. పాపం సూర్య తన వరకు ఎప్పట్లాగే సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు కానీ.. ‘రెట్రో’ను కాపాడుకోలేకపోయాడు.
‘రెట్రో’ సినిమాలో సన్నివేశాలను సౌండ్ ఆపేసి చూస్తే విజువల్స్ భలేగా అనిపిస్తాయి. అలాగే కాసేపు కళ్లు మూసేసి కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే వింటే.. చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కనపెట్టి సూర్య గురించి మాట్లాడుకుంటే.. తన లుక్.. యాక్టింగ్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మరి వీటన్నింటినీ మిక్స్ చేసి ‘రెట్రో’ సినిమా ఎలా ఉంది అంటే మాత్రం.. కళ్లు తేలేయాల్సిందే. ఎంత చెత్త సినిమాలో అయినా సూర్య తన లుక్స్.. యాక్టింగ్ తో అదరగొట్టడం మామూలే. సంతోష్ నారాయణన్ బీజీఎం గురించి చెప్పేదేముంది? అతను అదరగొట్టేస్తాడు. సినిమాటోగ్రాఫర్ అభిరుచి ఉన్నవాడు. నిర్మాత ఖర్చుకు వెనకాడలేదు. కాబట్టి విజువల్సూ బాగున్నాయి. సినిమా బాగుండడానికి ఈ అదనపు హంగులు ఉంటే సరిపోతుందా? కథలో విషయం ఉండాలి. కథనం ఆసక్తికరంగా సాగాలి. ఈ విషయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పూర్తిగా నిరాశపరిచాడు. తొలి చిత్రం ‘పిజ్జా’ నుంచి కథల పరంగా కార్తీక్ దారి భిన్నం. సన్నివేశాలను ప్రెజెంట్ చేయడంలో ఒక మార్కు చూపిస్తాడు. కానీ కొన్నేళ్లుగా అతను టేకింగ్ మీద పెడుతున్న శ్రద్ధ కథాకథనాల మీద పెట్టట్లేదు. సన్నివేశాలను కొత్తగా చెప్పాలన్న తపన ఓకే కానీ.. అందుకోసం అర్థం పర్థం లేని సన్నివేశాలను పెట్టి.. గందరగోళంగా కథనాన్ని నడిపించి.. కన్ఫ్యూజ్ చేయడమే కొత్తదనం అనుకుంటే ప్రేక్షకులకు చికాకు తప్పదు. ‘రెట్రో’ విషయంలో అదే జరిగింది.
అసలు రెట్రో ఎలాంటి కథ అంటే చెప్పడం కష్టం. ఆరంభం చూస్తే ఇదేదో గ్యాంగ్ స్టర్ డ్రామా అనిపిస్తుంది. మధ్యలో ఏమో ఇదొక ప్రేమకథ రూపం తీసుకుంటుంది. చివర్లో ఏమో రివెంజ్ డ్రామాలా మారుతుంది. ఎందులోనూ నిలకడ లేదు. ఎక్కడా రవ్వంత ఆసక్తి రేకెత్తించదు. గోల్డ్ ఫిష్.. గోల్డ్ ఫిష్ అంటూ ఏదో మాఫియా డీల్ గురించి ఆరంభంలో చాలా హంగామా చేస్తారు. తర్వాత అదంతా పక్కకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత అండమాన్లో దీవి.. అక్కడ దొరలు.. వారి దగ్గరుండే బానిసలు.. వారి మధ్య ఫైట్లు అంటూ కథను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. మరోవైపు హీరోయిన్ హీరోను అసహ్యించుకుని వెళ్లిపోవడం.. అతను తాను మారాను అని ఆమెను నమ్మించే ప్రయత్నం చేసి దగ్గరవడం.. మళ్లీ అపార్థాలు వచ్చి విడిపోవడం.. తిరిగి ఇంకోసారి కలవడం.. ఇలా రిపిటీటివ్ సీన్స్ తో సాగే ఆ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విలన్లు చూడ్డానికి వయొలెంటుగా కనిపిస్తారే తప్ప.. ఏ పాత్రలోనూ బలం కనిపించదు. ఎవరికి వాళ్లు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా అండమాన్ దొరల పాత్రల్లో నాజర్-ఓ యువ నటుడు చేసిన విన్యాసాల గురించి వర్ణించతరం కాదు. ‘‘మీరేంటో మీ విధానాలేంటో..’’ అంటూ రావు రమేష్ డైలాగ్ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఆ క్యారెక్టర్లను.. అండమాన్ సెటప్ ను చూస్తే. ప్రథమార్ధం చూశాక.. ద్వితీయార్ధంలో అయినా ‘రెట్రో’ మెరుగుపడుతుందేమో అనుకుంటే.. ముందు చూసిందే నయం అనిపించేలా ఉంటాయి తర్వాతి సన్నివేశాలు. ఏ దశలోనూ ఎంగేజ్ చేయని విధంగా.. గందరగోళంగా సాగే ‘రెట్రో’లో కాస్తో కూస్తో ఎంగేజ్ చేసేవి సూర్య పెర్ఫామెన్స్.. సాంకేతిక హంగులు మాత్రమే. కానీ వాటి కోసం రెండూ ముప్పావుగంటలు ‘రెట్రో’ను భరించాలంటే మాత్రం కష్టమే.
నటీనటులు:
‘రెట్రో’లో సూర్యను చూస్తుంటే.. ఇలాంటి నటుడిని దర్శకులు ఎందుకు సరిగా ఉపయోగించుకోవట్లేదు అనిపిస్తుంది. అదే సమయంలో ఇలాంటి కథలను ఎంచుకుని.. వాటి కోసం అతను పడే కష్టం చూసి జాలేస్తుంది. అసలేముందని ‘రెట్రో’ సినిమా చేయడానికి అతను ఒప్పుకున్నాడన్నది అర్థం కాని విషయం. ఆ సంగతి పక్కన పెడితే.. సూర్య ‘ది బెస్ట్’గా కనిపించిన చిత్రాల్లో ఇదొకటి. పాత్రకు తగ్గట్లుగా లుక్స్ మారుస్తూ కనిపించిన ప్రతిసారీ అతను ఆకట్టుకున్నాడు. పెర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. కానీ తన పాత్రలో గందరగోళం వల్ల అనుకున్నంతగా అది పండలేదు. పూజా హెగ్డే లేక లేక పెర్ఫామెన్సుకి స్కోప్ ఉన్న పాత్ర చేసింది. కానీ రాణించలేకపోయింది. డీగ్లామరస్ లుక్ పూజాకు అంతగా సెట్ కాలేదు. జోజు జార్జ్ లాంటి విలక్షణ నటుడిని కార్తీక్ సుబ్బరాజ్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ప్రకాష్ రాజ్ గురించి చెప్పడానికేమీ లేదు. ఆయన్ని చూడగానే ఒక మొనాటనీ వస్తుంది. నాజర్ ఒక వ్యర్థ పాత్రలో కనిపించాడు. ఆయన కొడుకు పాత్రలో చేసిన నటుడు చూడ్డానికి బాగున్నాడు. తన నటనా బాగుంది. మిగతా ఆర్టిస్టులు మామూలే.
సాంకేతిక వర్గం:
సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ‘రెట్రో’కు అతి పెద్ద ఆకర్షణల్లో ఒకటి. సినిమా ఆద్యంతం ఒక డిఫరెంట్ స్టయిల్లో సాగింది బీజీఎం. తన పాటలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. శ్రేయస్ కృష్ణ విజువల్స్ అదిరిపోయాయి. ఛాయాగ్రహణంలో ఒక అభిరుచి కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కింది. కానీ అన్ని వనరులూ గొప్పగా సమకూరినా.. రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఉపయోగించుకోలేకపోయాడు. టేకింగ్ లో వైవిధ్యం చూపించాలనుకోవడం ఓకే కానీ.. కథేంటో పాత్రలేంటో అర్థం కాని విధంగా సన్నివేశాలను తీయడమే కొత్తదనం అని కార్తీక్ అనుకుంటున్నాడేమో తెలియదు కానీ.. ‘రెట్రో’తో అతను ఏం చెప్పదలుచుకున్నాడో ఏంటో మరి. మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ కాని విధంగా తలా తోకా లేకుండా సినిమా తీసి తన మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేశాడు.
చివరగా: రెట్రో.. ఒక వ్యర్థ ప్రయత్నం
రేటింగ్- 1.75/5