స్టార్ హీరో సూర్యపై కక్ష కట్టిందెవరు?
ఇక ఇటీవలే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన 'రెట్రో' ఫ్లాపవ్వడం కూడా పుండు మీద కారం చల్లినట్టయింది.
By: Tupaki Desk | 22 Jun 2025 5:50 PMస్టార్ హీరో సూర్యకు సౌత్ అంతటా భారీ అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అటు తమిళం, ఇటు తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లోను సూర్యకు ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోల్లో ఎవరికీ తీసిపోని నట ప్రతిభ అతడి సొంతం. పైగా సూర్య హార్డ్ వర్క్, డెడికేషన్ ఎంతో గొప్పవి. కానీ ఇటీవలి కాలంలో సూర్యకు సరైన విజయం దక్కడం లేదు. ఇంతకుముందు దరువు శివ దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ సినిమా 'కంగువ' డిజాస్టర్ అవ్వడం సూర్యను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇక ఇటీవలే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన 'రెట్రో' ఫ్లాపవ్వడం కూడా పుండు మీద కారం చల్లినట్టయింది. అయితే సూర్య సినిమా రిలీజైన ప్రతిసారీ సోషల్ మీడియాల్లో విషపూరితమైన నెగెటివిటీ ప్రచారం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అప్పట్లో జ్యోతిక సైతం తన భర్త సూర్య నటించిన కంగువ పై చాలా నెగెటివ్ ప్రచారం సాగిందని, దీనికి సోషల్ మీడియా గ్రూపులతో కొందరి కుట్ర దాగి ఉందని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు సైతం రెట్రో మూవీ ఫ్లాపవ్వడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాల్లో సాగించిన నెగెటివ్ ప్రచారమేనని అన్నాడు. కొందరు కావాలని కుట్ర చేస్తున్నారు. పెయిడ్ ప్రమోషన్స్ తో హీరోలు, వారి సినిమాలను దిగజారుస్తున్నారని తాజా ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజు వ్యాఖ్యానించాడు. ఇంతకుముందు థియేట్రికల్ గా ఫ్లాపైన రెట్రో అందుకు భిన్నంగా ఓటీటీలో చాలా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా ప్రథమార్థం సహా యాక్షన్ ఎపిసోడ్స్ పై ప్రశంసలు కురిసాయి. ఈ సమయంలో సుబ్బరాజ్ చాలా ఎమోషనల్ గా స్పందించారు. రెట్రో చిత్రం భారీ ఓపెనింగ్స్ తో ప్రారంభమైనా 50కోట్ల క్లబ్ లో చేరేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ సినిమా వసూళ్లు వేగంగా పడిపోవడానికి కారణం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమీక్షలను వైరల్ చేయడమే కారణమని దర్శకుడు వాపోయాడు.
రెట్రో బాక్సాఫీస్ వైఫల్యానికి విషపూరిత ఆన్‌లైన్ సంస్కృతి కారణమని కార్తీక్ సుబ్బరాజ్ నిందించాడు. ఈ పెయిడ్ క్యాంపెయిన్... సినిమాకి నష్టం చేకూర్చిందని సుబ్బరాజ్ ఆవేదన చెందాడు. గలాట్టాతో ఇంటర్వ్యూలో కార్తీక్ సుబ్బరాజ్ ఉద్దేశపూర్వక సోషల్ మీడియా ప్రచారానికి రెట్రో లక్ష్యంగా మారిందని అన్నాడు. ప్రతి నటుడికి ట్విట్టర్‌లో శత్రు శిబిరం ఉందని నేను విన్నాను. సినిమాలపై దుష్ప్రచారానికి డబ్బు చెల్లించే ఆఫీసులు ఉన్నాయని, ఇది గ్రూపుగా సాగే వ్యవస్తీకృత దందా అని కూడా కార్తీక్ సుబ్బరాజు అన్నాడు. ఒకరిని అప్రతిష్ఠ పాల్జేయడానికి డబ్బు చెల్లిస్తారని కూడా వ్యాఖ్యానించాడు.
నా సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చింది. కానీ ప్రతికూల సమీక్షలు ఎందుకు వచ్చాయో తెలియక తాము అయోమయంలో పడ్డామని కార్తీక్ సుబ్బరాజు అన్నారు. ఈ పెయిడ్ ప్రచారం చాలా ప్రమాదకరమైనది.. ఇది చాలా షాకింగ్‌గా ఉందని కార్తీక్ సుబ్బరాజు అన్నారు.