సూర్య క్రేజీ లైనప్ వ్యూహాలు..సుప్రీమ్ చైర్ కోసమే?
తమిళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఆసక్తికరమైన ట్రేడ్ సమీకరణాలు నడుస్తున్నాయి.
By: Srikanth Kontham | 16 Jun 2026 11:08 AM ISTతమిళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఆసక్తికరమైన ట్రేడ్ సమీకరణాలు నడుస్తున్నాయి. ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలిన అగ్ర నటుడు దళపతి విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం.. మరో స్టార్ హీరో అజిత్ కుమార్ పూర్తి దృష్టిని రేసింగ్ ట్రాక్‌లపై కేంద్రీకరించడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ స్థానానికి శూన్యత ఏర్పడింది. ఈ సింహాసనాన్ని దక్కించుకోవడానికి పలువురు హీరోలు పోటీపడుతున్న తరుణంలో విలక్షణ నటుడు సూర్య మైండ్ బ్లోయింగ్ అప్‌కమింగ్ లైనప్‌తో అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సాధించిన చారిత్రాత్మక విజయం ఈ రేసుకు మరింత ఆజ్యం పోసింది.
ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని శాసించాలంటే కేవలం నటన మాత్రమే సరిపోదు. ట్రేడ్ వర్గాలను షేక్ చేసే తిరుగులేని బాక్సాఫీస్ స్టామినా అవసరం. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన `కరుప్పు` ప్రపంచవ్యాప్తంగా దాదాపు 340 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించడంతో సూర్య రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సంచలన విజయంతో సూర్య పూర్వ వైభవాన్ని అందుకున్నారు. విజయ్-అజిత్ అందుబాటులో లేని ప్రస్తుత తరుణంలో క్రేజీ కమర్షియల్ కథలతో వస్తున్న అగ్ర దర్శకులకు.. నిర్మాణ సంస్థలకు సూర్య ఫస్ట్ ఛాయిస్ ఐకాన్‌గా మారిపోయారు.
ఈ క్రేజీ ప్రయాణంలో సూర్య తదుపరి అడుగును వ్యూహాత్మకంగా వేస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తోన్న `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, క్లాస్ -ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సూర్యకున్న బలమైన మార్కెట్‌ను మరింత రెట్టింపు చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది.
సూర్య బలం ఆయన ఎంచుకునే వైవిధ్యమైన జోనర్లలోనే ఉంటుంది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ హిట్ `ఆవేశం` చిత్ర దర్శకుడు జితు మాధవన్‌తో ఓ వినూత్నమైన సినిమా తో యూత్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీనితో పాటు సామాజి క స్పృహతో పాటు గ్లోబల్ రీచ్ తెచ్చిపెట్టిన `జై భీమ్` కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నారు. దర్శకుడు టి.జి. జ్ఞానవేల్‌తో మరో ప్రాజెక్ట్.. అలాగే కమర్షియల్ మేకర్ హెచ్. వినోద్‌తో చర్చలు జరుపుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను కవర్ చేసేలా లైనప్‌ను డిజైన్ చేసుకుంటున్నారు.
అయితే సూర్యను కోలీవుడ్ సామ్రాజ్యానికి అల్టిమేట్ కింగ్‌గా మార్చబోయే మాస్టర్ స్ట్రోక్ ఆయన 50వ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ రూపంలో రాబోతోంది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించబోయే ఈ సినిమాకు టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ `సితార ఎంటర్‌టైన్‌మెంట్స్` భారీ బడ్జెట్ కేటాయించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నిజానికి నెల్సన్ ఈ కథను గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసారు. కానీ ఎన్టీఆర్ `డ్రాగన్` తో బిజీగా ఉండటం తదుపరి `గాడ్ ఆఫ్ వార్` చిత్రాలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉండటంతో? ఈ సంచలన కాంబో సూర్య వద్దకు చేరింది. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ యాక్షన్ సూర్య నట విశ్వరూపానికి తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం.
సూర్య భవిష్యత్ కోసం వేసిన మల్టీ-లాంగ్వేజ్ - మల్టీ-జోనర్ వ్యూహాలు కేవలం సినిమాలు చేయడం కోసమే కాదు. కోలీవుడ్ అగ్ర సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికే అన్నది బలమైన సమాచారం. వెంకీ అట్లూరి క్లాస్ టచ్, జితు మాధవన్ యూత్ పల్స్, జ్ఞానవేల్ సామాజిక కోణం, నెల్సన్ అల్ట్రా-మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి సక్సెస్ అయితే గనుక తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ వదిలివెళ్లిన సుప్రీమ్ చైర్ ను సూర్య భర్తీ చేయడం లాంఛనమే.
