సూర్య 'కరుప్పు'.. వాళ్లంతా హెల్ప్ చేస్తే గానీ..
సూర్య హీరోగా తెరకెక్కిన కరుప్పు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక పెద్ద ఫైనాన్సియల్ వార్ జరిగిందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వెల్లడించారు.
By: M Prashanth | 15 Jun 2026 12:49 PM ISTసూర్య హీరోగా తెరకెక్కిన కరుప్పు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక పెద్ద ఫైనాన్సియల్ వార్ జరిగిందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వెల్లడించారు. బయటకు చూస్తే సాధారణంగా విడుదలైన సినిమా అనిపించినా, తెరవెనుక పలువురు చేసిన హెల్ప్ లేకపోతే ఆ సినిమా కూడా విడుదల కాకుండా నిలిచిపోయేదని ఆయన చెప్పారు.
తాను కూడా సినిమాకు ఫైనాన్షియర్ గా వ్యవహరించానని చెప్పిన తిరుప్పూర్ సుబ్రమణ్యం.. సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న సమయంలో హీరో సూర్య అందరికన్నా ముందుగా స్పందించారని తెలిపారు. అయితే ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో తాను చేయగలిగిన సహాయానికి కూడా ఒక లిమిట్ ఉందని చెప్పినట్లు తెలిపారు. నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు, ఇతర సభ్యులు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ముందుకొచ్చి సాల్వ్ చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో అరుళ్‌భాతి హెల్ప్ ను గుర్తు చేశారు. సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా, విడుదల ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు నిద్రపోకుండా ఫైనాన్షియర్లతో చర్చలు జరిపారని తెలిపారు. తమకు రావాల్సిన పేమెంట్ విషయంలో తాను, ఆర్‌బీ చౌదరి వంటి ఫైనాన్షియర్లు పెద్ద మనసుతో వ్యవహరించారని చెప్పారు. అరుళ్ భాతి విజ్ఞప్తితో తాము తీసుకోవాల్సిన మొత్తంలో దాదాపు 70 శాతం వరకు తగ్గించుకుని, మిగిలిన మొత్తాన్ని తర్వాత సినిమాల్లో సర్దుబాటు చేసుకోవడానికి అంగీకరించామని వెల్లడించారు.
అయితే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరి నిమిషంలో మరో రూ.5 కోట్లు అవసరం పడిందన్నారు. తాను మరో రూ.1 కోటి మాత్రమే ఇవ్వగలనని, ఇప్పటికే తన వద్ద కూడా నిర్మాతల పెండింగ్ ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశానని తెలిపారు. ఆ తర్వాత ఎస్‌ఆర్ ప్రభు తనకు పరిచయం ఉన్న పలువురు దర్శకులు, నటులను సంప్రదించినా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. చివరికి రాజశేఖర్ పాండియన్ సూర్య తరఫున మిగిలిన డబ్బులు సెట్ చేయడంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని వివరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు హెచ్. వినోద్ పేరును కూడా తిరుప్పూర్ సుబ్రమణ్యం ప్రస్తావించారు. సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా, విడుదల కోసం రూ.1 కోటి సహాయం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. మరోవైపు నిర్మాతల ఆర్థిక పరిస్థితి గురించి తెలిసినా దర్శకుడు ఆర్‌జే బాలాజీ వీడియో విడుదల చేయడం మినహా స్పెషల్ గా ఏం చేయలేదని అన్నారు. సినిమా ఇబ్బందులకు ప్రధాన కారణం ఓటీటీ హక్కుల విషయంలో జరిగిన లెక్కల తేడా అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓటీటీ ద్వారా రూ.75 నుంచి రూ.80 కోట్ల వరకు వస్తాయని నిర్మాతలు అంచనా వేయగా, చివరకు కేవలం రూ.30 కోట్ల ఒప్పందం కుదరడంతో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. అందుకే గత ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన కరుప్పు దాదాపు ఎనిమిది నెలల పాటు వాయిదా పడిందని తెలిపారు. అంతేకాదు, ఫైనాన్షియర్లు తమకు రావాల్సిన డబ్బులు కావాలని పట్టుబట్టి ఉంటే కరుప్పు పరిస్థితి మారిపోయేదని అన్నారు. సినిమా విజయం తర్వాత హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ కు థ్యాంక్స్ చెప్పడం ఎంత ముఖ్యమో, తెరవెనుక నిలబడి సినిమాను కాపాడిన ఫైనాన్షియర్లు, సహాయం చేసిన వ్యక్తులను గుర్తు చేసుకోవడం కూడా అంతే అవసరమని సుబ్రమణ్యం అన్నారు.
