పిక్‌టాక్ : వాళ్లు ఇకపై నోళ్లు మూసుకుంటారా?
మొత్తానికి జ్యోతిక, సూర్య గురించి రకరకాలుగా పుకార్లను పుట్టించిన వారికి చెంప పెట్టు అన్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి.
By: Tupaki Desk | 21 April 2025 3:50 PM ISTతమిళ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక మధ్య గొడవలు, అందుకే జ్యోతిక ముంబై వెళ్లి పోయింది అంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఎన్ని విధాలుగా జ్యోతిక, సూర్యలు ఆ వార్తలను కొట్టి పారేసినా కూడా మళ్లీ మళ్లీ అవే పుకార్లను కొందరు పని గట్టుకుని ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్నాళ్ల వైవాహిక జీవితం తర్వాత సూర్యకు దూరంగా జ్యోతిక ముంబై వెళ్లడం వెనుక ఉద్దేశం ఏంటి అంటూ లేని పోని అనుమానాలతో చాలా మంది సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విషపు ప్రచారం చేశారు. అయినా కూడా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు అంటూ అభిమానులతో పాటు, వారి సన్నిహితులు చెబుతూ వచ్చారు.
జ్యోతిక హిందీ సినిమాలతో బిజీ కావడంతో తమిళనాడుకు దూరం కావాలని భావిస్తుందేమో అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి జ్యోతిక, సూర్య గురించి రకరకాలుగా పుకార్లను పుట్టించిన వారికి చెంప పెట్టు అన్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. ఆ ఫోటోలను జ్యోతిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సూర్య, జ్యోతిక దంపతులు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంను సందర్శించారు. అక్కడి ఆచారం మేరకు జ్యోతిక చాలా పవిత్రంగా పూజలో పాల్గొన్నారు. ఆమెను చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. చీర కట్టులో ఆమె గుడిలో మహాలక్ష్మి గా కనిపించారు అంటూ పలువురు కామెంట్ చేశారు.
కామాఖ్య అమ్మవారి ఆలయంలోనూ జ్యోతిక, సూర్యలు ప్రార్థనలు చేశారు. ఇద్దరు చాలా సన్నిహిత్యంగా, అన్యోన్యంగా ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతిక ముదురు ఎరుపు రంగు చీర కట్టులో కనిపించారు. వారు చాలా ప్రశాంతంగా కనిపించడం మాత్రమే కాకుండా సంతోషంగానూ కనిపించారు. ఈ సెలబ్రెటీ కపుల్ సోషల్ మీడియాలో ఉన్న పుకార్లకు ఈ ఫోటోలతో ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంఇ. ఇకపై అయినా ప్రతి ఒక్కరూ వీళ్ల గురించి తప్పుగా మాట్లాడటం మానేస్తారనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసిన జ్యోతిక మధ్యలో ఫ్యామిలీ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది.
ఇక కంగువా సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా రెట్రో సినిమా ఉంటుంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సూర్య, జ్యోతిక విడివిడిగా నటించిన సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ సమయంలో వీరు దైవ దర్శనం చేసుకోవడంతో సినిమాల సక్సెస్ కోసం అనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వీరిద్దరు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉండటం ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చే అంశం. వీరిద్దరు పుకార్లకు చెక్ పెట్టే విధంగా ఒక సినిమాలో కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎప్పటికి సాధ్యం అవుతుందో చూడాలి.
