ఆరు అడుగుల అందం కాదు..అద్భుతమైన నటన!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎంత గొప్ప నటుడో? అంతకు మించి గొప్ప దాతృ హృదయంగల వ్యక్తి. రియల్ లైఫ్ లో ఎప్పటికప్పుడు సామాజిక స్పృహను చాటుకుంటారు.
By: Tupaki Desk | 4 May 2026 6:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎంత గొప్ప నటుడో? అంతకు మించి గొప్ప దాతృ హృదయంగల వ్యక్తి. రియల్ లైఫ్ లో ఎప్పటికప్పుడు సామాజిక స్పృహను చాటుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా `కరుప్పు` ఆడియో విడుదల వేడుకలో పాల్గొన్న సూర్య సమాజంలో వేళ్లూనుకున్న బాడీ షేమింగ్ (శరీర ఆకృతిని బట్టి విమర్శించడం) అంశంపై తీవ్రంగా స్పందించారు. మనిషి రూపం కంటే వారి ప్రతిభ పట్టుదలలే గొప్పవని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా మలయాళ సీనియర్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ఇంద్రన్స్ ప్రయాణాన్ని ఉదాహరణగా చూపిస్తూ సూర్య చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి.
సినిమా రంగంలో లేదా బయటి ప్రపంచంలో ఒక వ్యక్తి ఎత్తు, బరువు లేదా రంగును బట్టి వారిని తక్కువ అంచనా వేయడం అత్యంత విచారకరమన్నారు సూర్య. బాడీ షేమింగ్ అనేది వ్యక్తి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అలాంటి ధోరణిని సమాజం వీడాలని కోరారు. ఒక నటుడికి ఉండాల్సింది ఆరు అడుగుల అందం కాదు. అద్భుతమైన నటన అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇంద్రన్స్ సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. నటుడు ఇంద్రన్స్ ప్రయాణం గురించి సూర్య ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇంద్రన్స్ తన కెరీర్‌ను సాదాసీదా టైలర్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత హాస్యనటుడిగా మారి చివరకు అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును గెలుచుకోవడం ఓ అద్భుతమని కొనియాడారు. రూపం పరంగా ఆయనను ఎగతాళి చేసిన వారందరికీ తన ప్రతిభతోనే సమాధానం చెప్పారని సూర్య గుర్తు చేశారు. ఇంద్రన్స్ సాధించిన ఈ ఘనత వెనుక దశాబ్దాల కష్టం , ఆత్మవిశ్వాసం ఉన్నాయన్నారు. ఇదే వేదికపై సూర్య చెప్పిన ఓ మాట అందరినీ అమితంగా ఆకట్టుకుంది. `కలలకు గడువు తేదీ ఉండదు. ఏ వయసులోనైనా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలను సాధించొచ్చు అన్నారు. ఇంద్రన్స్ కెరీర్ చివరి దశలో జాతీయ అవార్డు గెలుచుకోవడం దీనికి నిదర్శనమన్నారు.
మనం మనల్ని నమ్మినంత కాలం, ప్రపంచం చేసే విమర్శలు మనల్ని ఏమీ చేయలేవని సూర్య హితబోధ చేశారు. వేడుకలో సూర్య మాటలు ఎంతో ఇన్ స్పైర్ చేసాయి. బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే నేటి కాలంలో సూర్య వంటి అగ్ర హీరో మనిషి లోపలి ప్రతిభ గురించి మాట్లాడటం విశేషం. ప్రతిభ ఉంటే ఎవరైనా శిఖరాలను అధిరోహించవచ్చని ఈవెంట్ ద్వారా మరోసారి నిరూపితమైంది. సూర్య చేసిన వ్యాఖ్యలు సినిమా రంగానికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. బాడీ షేమింగ్ వంటి సామాజిక రుగ్మతలను ఎండగట్టడంలో సెలబ్రిటీలు ముందుండటం శుభపరిణామం. ఇంద్రన్స్ వంటి గొప్ప నటుల జీవిత గాథలు నిరంతరం స్ఫూర్తిని స్తూనే ఉంటాయి. సూర్య చెప్పినట్లుగా కలల వెంటే ప్రయాణిస్తూ అడ్డంకులను అధిగమించి విజేతలుగా నిలవడమే నిజమైన గెలుపు.
