Begin typing your search above and press return to search.

సునీల్ నారంగ్ రాజీనామా.. ఎగ్జిబిటర్ల అభిప్రాయమేంటి?

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్స్- నిర్మాతల వివాదం మధ్య రీసెంట్ గా కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   23 May 2026 8:20 PM IST
సునీల్ నారంగ్ రాజీనామా.. ఎగ్జిబిటర్ల అభిప్రాయమేంటి?
X

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్స్- నిర్మాతల వివాదం మధ్య రీసెంట్ గా కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆ రాజీనామా వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎగ్జిబిటర్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ లో సమావేశమైన ఎగ్జిబిటర్లు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్‌ ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ప్రెస్‌ మీట్‌ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ విజయేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ బాల గోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సునీల్ నారంగ్ రాజీనామాపై స్పందించిన ఎగ్జిబిటర్ ప్రతినిధులు.. "ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇటీవల కూతురు వివాహం కూడా జరిగింది. కుటుంబ కార్యక్రమాలు, వ్యక్తిగత బాధ్యతలతో బిజీగా ఉన్నారు. అసోసియేషన్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు" అని తెలిపారు. అయితే ఇది సున్నితమైన అంశమని కూడా వారు పేర్కొన్నారు. "సునీల్ నారంగ్ ఒకేసారి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌ గా, ఎగ్జిబిటర్‌ గా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు ఉండొచ్చు. అందువల్ల ఫోకస్ దెబ్బతిన్న భావన ఆయనకు కలిగి ఉండొచ్చు" అని అభిప్రాయపడ్డారు.

ఇటీవల తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలన్న డిమాండ్ తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అద్దె విధానం కొనసాగించాలా? లేక పర్సంటేజ్ పద్ధతికి మారాలా? అన్న అంశంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇండస్ట్రీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేకంగా 21 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని వర్గాలతో చర్చలు జరిపి సామరస్య వాతావరణం తీసుకురావాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో సునీల్ నారంగ్ రాజీనామా చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తన రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

"కొంతమంది కార్యవర్గ సభ్యులు సంతృప్తిపరచేలా నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి వస్తోంది. ఇకపై అలా చేయలేను. నా ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఛాంబర్ ఎప్పుడూ ఒకే విధమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు" అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో గతంలో వివాదాస్పద పరిస్థితుల్లో సునీల్ నారంగ్ రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఆయన రాజీనామాను కార్యవర్గం అధికారికంగా ఆమోదించడం గమనార్హం.

ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ విడుదల చేసిన ప్రకటనలో.. "సునీల్ నారంగ్ తీసుకున్న నిర్ణయం బాధాకరం. కానీ కార్యవర్గం దానిని ఆమోదించింది. ఛాంబర్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి" అని పేర్కొన్నారు. మొత్తానికి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో అంతా వేచి చూడాలి.